Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:32 PM
గుంటూరు రైల్వే డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..
గుంటూరు, డిసెంబర్ 20: గుంటూరు జిల్లా రైల్వే డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెనను కూల్చివేసే పనులను ఒక ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు. ఈ పనులు పూర్తి కావడానికి 6 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారన్నారు.
అలాగే, ఫ్లైఓవర్ నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. నందివెలుగు వంతెన పనులను త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు పెమ్మసాని వెల్లడించారు. పలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్‌ఓబీల నిర్మాణ పనులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదలవుతాయని తెలిపారు.
గుంటూరు శ్యామలా నగర్ వద్ద ఆర్‌ఓబీ కోసం అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉందని, దీనిపై యజమానులతో చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి చెప్పారు. గుంటూరు శివారులోని మొండిగేటు వద్ద డ్రెయినేజీ వ్యవస్థ కోసం రూ.6 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.
అలాగే, గుంటూరు రైల్వే స్టేషన్ అండర్ పాస్‌లోకి వర్షపు నీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పెమ్మసాని తెలిపారు. తెనాలిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరిక మేరకు అధికారులు సానుకూలంగా స్పందించారని పెమ్మసాని పేర్కొన్నారు.
ఈ అభివృద్ధి పనులతో గుంటూరు జిల్లా రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్