నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్
ABN , Publish Date - Jul 14 , 2025 | 09:54 PM
తన కుమారుడు వేదాంత్‌కు క్రమశిక్షణ ఎక్కువని నటుడు మాధవన్ అన్నారు. ఆహారం తీసుకోవడం కూడా అతడికి ఓ కసరత్తు లాంటిదేనని చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ తాజా చిత్రం ఆప్ జైసా కోయీ జనాల ప్రశంసలు పొందుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన తన కుమారుడు వేదాంత్ గురించి చెప్పుకొచ్చారు. మాధవన్ కుమారుడు స్విమ్మర్‌గా ప్రపంచస్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే. మలేషియా ఓపెన్‌లో అతడు ఐదు బంగారు పతకాలు సాధించాడు. కామన్‌వెల్త్ యూత్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. అతడి క్రమశిక్షణ గురించి మాధవన్ తాజా ఇంటర్వ్యూలో పుత్రోత్సాహంతో చెప్పుకొచ్చారు.
‘ఓ ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా వేదాంత్ రాత్రి 8 గంటలకే తన రోజును ముగిస్తాడు. మళ్లీ ఉదయం 4 గంటలకు మేల్కొని తన పనిలో దిగిపోతాడు. ఇది బ్రహ్మ ముహూర్తం. ధార్మికత దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సమయం. వేదాంత్ దాదాపు 6 అడుగుల 3 అంగుళాలు ఉంటాడు. స్విమ్మింగ్‌కు సరిగ్గా సరిపోయే శరీరం నిర్మాణం అతడిది. వేదాంత్‌కు ఆహారం తీసుకోవడం కూడా ఓ కసరత్తు లాంటిదే. బాగా నమిలి తినాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. చిన్నతనంలో నాకూ ఇలాంటి డిసిప్లీన్ ఉంటే బాగుండని అనిపిస్తుంది. నాకు కాస్త బద్ధకం ఎక్కువ. క్రియేటివిటీ పేరు చెప్పి నెట్టుకొస్తుంటాను’
‘సోషల్ మీడియా పుణ్యమా అని ఈ కాలం పిల్లలకు చాలా విషయాల్లో అవగాహన పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వారిపై రుద్ద కూడదు. నేను మీతో మాట్లాడుతున్నట్టే వేదాంత్‌తోనూ మాట్లాడతాను. అతడి అభిప్రాయాలకు విలువిస్తా. తల్లిదండ్రులుగా మనం పిల్లలతో మన అనుభవాలను మాత్రమే పంచుకోవాలి. భద్రమైన వాతావరణం కల్పించాలి. ఇంట్లో తమకు నచ్చినట్టు ఉండే అవకాశం ఇవ్వాలి’
‘నా తనయుడి జీవితంలో ఓ ముఖ్య భాగంగా నాకు ఉండిపోవాలని ఉంటుంది. నా మనవళ్లు తాతా అంటూ తరచూ నా ఇంటికి రావాలని కోరుకుంటా’ అని మాధవన్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా
చియా గింజలు తినేవారికి గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు హెచ్చరిక ఇది