Dry Chia seeds: చియా గింజలు తినేవారికి గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు హెచ్చరిక ఇది
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:30 PM
చియా గింజలను నీటిలో నానబెట్టకుండా తింటున్నారా.. అయితే మీరు రిస్క్‌లో పడ్డట్టే. ఇలా చేస్తే ఆసుపత్రిపాలు కావాల్సి వస్తుందని ఓ గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు నెట్టింట పోస్టు పెట్టారు. ఈ అలవాటుతో కలిగే చేటు ఏంటో వివరంగా చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: స్మూతీస్ నుంచి పుడింగ్స్ వరకూ అనేక ఫుడ్స్‌లో చియా గింజలను జోడించడం తప్పనిసరి. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు ఈ మధ్య కాలంలో చియా గింజల వైపు మళ్లుతున్నారు. అయితే, వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని డా. సౌరభ్ సేఠీ అనే గ్యాస్ట్రోఎంటిరాలజిస్టు ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. చియా గింజలను నానబెట్టకుండా తింటే రిస్క్‌లో పడినట్టేనని హెచ్చరించారు (Dry chia seeds health risk).
డా.సౌరభ్ చెప్పిన దాని ప్రకారం, చియా గింజలను ముందుగా నీళ్లల్లో నానబెట్టకుండా తింటే అవి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించాక నీరు పీల్చుకుని పెద్దగా అవుతాయి. అన్నవాహికకు అడ్డంపడి సమస్యలు తెచ్చిపెడతాయి. చియా గింజలు తమ బరువుకు అనేక రెట్లు ఎక్కువగా నీరు పీల్చుకుని పెద్దవిగా మారతాయి. కాబట్టి, ముందుగా నానబెట్టకుండా పచ్చి వాటిని నేరుగా తింటే అవి గొంతు, పొట్టలో ఇరుక్కుని ఇబ్బంది పెడతాయి. కడుపుబ్బరంతో పాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి.
‘నీళ్లల్లో ముందుగా చియా గింజలను నాన బెట్టకుండా తిన్న వారు ఆసుపత్రి పాలైన ఘటనలు ఉన్నాయి. పచ్చి చియాగింజలు గొంతులో నీరు పీల్చుకుని పెద్దవిగా మారి యూసోఫేగస్‌కు అడ్డంపడిన ఘటనలు ఉన్నాయి. వీటిని ఎండోస్కోపీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఇది అరుదుగా మాత్రమే జరిగే ఘటనే అయినప్పటికీ ఆహారం తీసుకోవడంలో ఇబ్చందిపడే వారు. ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి’ అని ఆ డాక్టర్ తెలిపారు. తమ బరువుకు 27 రెట్లతో సమానమైన నీటిని పీల్చుకునే శక్తి చియా గింజలకు ఉందని ఆయన అన్నారు.
కాబట్టి, వీటిని ముందుగా నీటిలో నానబెట్టి తినకపోతే రిస్క్ తప్పదని హెచ్చరించారు. ‘తినడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు వీటిని నీటిలో నానబెట్టాలి. అప్పుడు అవి జెల్లీలా మారతాయి. తినడానికి సులువుగా ఉండటంతో పాటు ఈజీగా జీర్ణమవుతాయి. కొత్తగా చియా గింజలు తినేవారు తొలుత రోజుకు ఒక టీస్పూను గింజల చొప్పున తినడం మొదలెట్టాలి. శరీరం అలవాటు పడ్డ తరువాత ఎక్కువ మొత్తంలో వీటిని తినొచ్చు’ అని తెలిపారు. నానబెట్టిన చియాగింజలు తింటే వాటిల్లోని ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్‌ను శరీరం పూర్తిగా గ్రహించగలుగుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
పరగడుపున మెడిసిన్స్ వేసుకుంటున్నారా? ఇలా అస్సలు చేయొద్దంటున్న వైద్యులు
ఈ ఫుడ్స్ తింటుంటే వెంటనే మానేయండి.. వైద్యుల హెచ్చరిక