Share News

Unhealthy Food Habits: ఈ ఫుడ్స్ తింటుంటే వెంటనే మానేయండి.. వైద్యుల హెచ్చరిక

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:52 AM

భారత్‌లో 56 శాతం అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లే కారణమని ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో తేలింది. మరి ఆరోగ్యవంతులు కూడా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Unhealthy Food Habits: ఈ ఫుడ్స్ తింటుంటే వెంటనే మానేయండి.. వైద్యుల హెచ్చరిక
Foods To Avoid For Health

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో 56 శాతం అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లే కారణం.. ఇటీవలి భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలోని అంశం ఇది. పోషకాహారం, కసరత్తులు చేయడం ఆరోగ్యానికి మూల సూత్రాలు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను వెంటనే మానేయడమో లేదా వీలైనంతగా తగ్గించడమో చేయాలని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (Foods to Avoid for Health).

మనకు వచ్చే పలు రకాల అనారోగ్యాలకు ప్రధాన కారణం చక్కెర లేదా బెల్లాన్ని అధికంగా స్వీకరించడమేనని వైద్యులు చెబుతున్నారు. భారతీయులు అధికంగా వాడే ఈ రెండూ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులే కాకుండా సాధారణ ఆరోగ్యవంతులు కూడా చక్కెర వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. బెల్లం ఎంత సహజసిద్ధమైనదైనా కూడా ఊబకాయం, గుండెజబ్బుల ముప్పు కచ్చితంగా ఉంటుంది.


చక్కెరలు అధికంగా ఉండే సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఆరోగ్యానికి చేటుచేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటిల్లో ఎలాంటి పోషకాలు ఉండవు. కేవలం ఒంట్లోకి క్యాలరీలు మాత్రమే వచ్చి చేరతాయి. చివరకు ఇవి కొవ్వుగా మారి ఊబకాయానికి దారితీస్తాయి. వీటికి బెల్లం ఆరోగ్యకర ప్రత్యామ్నాయమైనప్పటికీ దీన్ని కూడా ఓ మోస్తరుగానే తినాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం, శరీరానికి కావాల్సిన ఎనర్జీలో 10 శాతం మాత్రమే చక్కెరల నుంచి సమూకూర్చుకోవాలి. వీలైతే ఈ వాటాను 5 శాతానికే పరిమితం చేయాలి. ఈ మేరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.


ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్, పచ్చళ్లు వంటివి కూడా ప్రమాదకరమే. వీటితో బీపీ పెరిగి, హృద్రోగాలు వస్తాయి. ఇక శాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యపానంతో లివర్‌కు ముప్పు అంతాఇంతా కాదు. అప్పుడప్పుడూ డ్రింక్ చేసే వారు కూడా దీర్ఘకాలంలో లివర్‌కు ముప్పు తెచ్చుకుంటారు. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూరలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పు, చక్కెర, కొవ్వులను బాగా తగ్గించాలి. ఆరోగ్యవంతులు కూడా ఈ ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి:

ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే

శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..

Read Latest and Health News

Updated Date - Jun 26 , 2025 | 01:16 PM