Share News

Medicines: పరగడుపున మెడిసిన్స్ వేసుకుంటున్నారా? ఇలా అస్సలు చేయొద్దంటున్న వైద్యులు

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:49 PM

పరగడుపున మందులు వేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే సడెన్‌గా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

Medicines: పరగడుపున మెడిసిన్స్ వేసుకుంటున్నారా? ఇలా అస్సలు చేయొద్దంటున్న వైద్యులు
Medicines Empty Stomach Risks

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఔషధాల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఆరు నూరైనా సరే టైమ్‌కు మందులు వేసుకుంటారు. ఇది మంచి పద్ధతే. అయితే, కొందరు మాత్రం ఖాళీ కడుపుతో ఉన్నా సరే మందులు వేసుకుంటారు. ఏం కాదులే అని అనుకుంటారు. అయితే, ఇలాంటి నిర్లక్ష్యం అస్సలు పనికిరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అసలు పరగడుపున ఔషధాలు ఎందుకు వేసుకోకూడదో వైద్యులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు. ఖాళీ కడుపుతో మందులు వేసుకుంటే బీపీ తగ్గడం, తలతిరిగినట్టు ఉండటం, స్పృహ తప్పడం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు ఉంది. ముఖ్యంగా బీపీ, హృద్రోగానికి సంబంధించి మందుల విషయంలో ఈ ప్రమాదం ఎక్కువ. ఎన్ఎస్ఏఐడీలు, లేదా స్టెరాయిడ్స్ కడుపులోపలి పొరపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీంతో, పరగడుపున మందులు వేసుకుంటే గ్యాస్ట్రైటిస్, అల్సర్ ముప్పు పెరుగుతుంది.


పరగడుపున మందులు వేసుకున్నప్పుడు అవి త్వరగా రక్తంలో కలిసిపోతాయి. దీంతో, ఒక్కసారిగా మనం ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. బీపీ, గుండె కొట్టుకునే వేగం, బ్లడ్ షుగర్ లెవెల్స్ వంటి వాటిల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఇక వార్ధక్య ఛాయలను తగ్గించే గ్లూటాథయోన్ వంటి ఔషధాలు, విటమిన్ సీ ఇంజెక్షన్లు వంటివి పరగడుపున తీసుకుంటే ఒక్కసారిగా బీపీ పడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది చివరకు గుండె పోటుకు కూడా దారి తీస్తుందని అంటున్నారు. ఇక ఖాళీ కడుపున పది రకాల ఔషధాలు తీసుకుంటే ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.


వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఔషధాలను శరీరం వేగంగా గ్రహించి ఇబ్బంది పడకుండా కడుపులోని ఆహారం అడ్డుపడుతుంది. అయితే, పరగడుపున తీసుకునే మందులు కూడా కొన్ని ఉన్నాయి. లీవోథైరాక్సిన్, బైఫాస్ఫోనేట్స్, డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్‌లను పరగడుపున వేసుకుంటే శరీరం వాటిని సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఆహారం తీసుకున్నాక ఈ ఔషధాలు వేసుకుంటే ప్రభావం కొంత తగ్గుతుంది. కాబట్టి, మందుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వైద్యుల సలహాలు పాటించాలి.

ఇవి కూడా చదవండి:

ఈ ఫుడ్స్ తింటుంటే వెంటనే మానేయండి.. వైద్యుల హెచ్చరిక

ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే

Read Latest and Health News

Updated Date - Jul 02 , 2025 | 12:04 AM