Christmas Celebrations: ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:53 PM
మతపరమైన దాడులను అణచివేస్తామని, ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించేలా చట్టాలు సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మైనారిటీల సంక్షేమం వారి హక్కు అని..
హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలను స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని ఆయన పిలుపునిచ్చారు.
డిసెంబర్ నెలను 'మిరాకిల్ మంత్'గా అభివర్ణించిన రేవంత్, ఇది క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా మిరాకిల్ మంత్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిసెంబర్‌లోనే జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏసుక్రీస్తు బోధనల స్పూర్తితో పనిచేస్తోందని చెప్పిన సీఎం, దుష్ప్రచారాలు, ఇబ్బందులు ఎదురైనా శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, రుణమాఫీతో పాటు రైతులకు 500 బోనస్ వంటి పథకాలను సీఎం ఉదహరించారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్య రంగాల్లో చేసిన సేవలను కొనియాడిన రేవంత్, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని స్పష్టం చేశారు. క్రిస్టియన్-ముస్లిం స్మశానవాటికల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్