Polavaram Project Revived: సవాళ్లను దాటి సాకారం దిశగా పోలవరం
ABN, Publish Date - Dec 09 , 2025 | 01:42 AM
జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేసి, అయిదు కోట్ల ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారు. ఆయన అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాల వల్ల 2020లో వచ్చిన వరదలకు...
జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేసి, అయిదు కోట్ల ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారు. ఆయన అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాల వల్ల 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ అయి రాష్ట్రంపై రూ.2,745 కోట్ల అదనపు భారం పడింది. కాఫర్ డ్యాంలను సకాలంలో పూర్తిచేయకపోవడతో అనేక సమస్యలు తలెత్తాయి. అప్పట్లో కేంద్ర జలశక్తిశాఖ హెచ్చరించినా ఆయన చర్యలు చేపట్టలేదు. ప్రాజెక్టు ఆలస్యంతో విద్యుత్ ఉత్పత్తి జరగక రూ.4,000 కోట్లు, సాగునీరు & పారిశ్రామిక లాభాలు కోల్పోయి రాష్ట్రానికి రూ.17,575 కోట్ల నష్టం జరిగింది.
ఏడాదిన్నర క్రితం చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించి, శరవేగంగా నిర్మాణ పనులు సాగిస్తోంది. ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. విదేశీ నిపుణుల బృందాన్ని ఎంపిక, విదేశీ ఆకృతుల సంస్థను ఏర్పాటు చేసుకుని, కేంద్ర జలసంఘం, కేంద్ర జలశక్తి శాఖతో కలిసి ప్రాజెక్టులోని అనేక సాంకేతిక సవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. గతంలో ధ్వంసమైన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా సాగుతోంది. మొత్తం ఇప్పటికే 75 శాతం పూర్తిచేసినట్లు సమాచారం. 2026 మార్చి నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు, గ్యాప్–1 ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పూర్తి చేసేలా పనులు జరుగుతున్నట్లు, గ్యాప్–2లో వైబ్రో కాంప్యాక్షన్ పనులు 97 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. గ్యాప్–2 ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు మొదలుపెట్టేలా నిర్ణయించారు. స్ట్రిప్పింగ్, ఫిల్టర్ పనులు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ పనులు 88శాతం పూర్తిచేసినట్లు తెలుస్తోంది. క్లిష్టమైన టన్నెల్స్ లైనింగ్‌తో ఉన్న రైట్ కనెక్టివిటీస్ 82శాతం, లెఫ్ట్ కనెక్టివిటీస్ 62శాతం పనులు ప్రభుత్వం పూర్తి చేసింది.
పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, నిర్వాసితుల కుటుంబాలకు పునరావాసం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 18 నెలల కాలంలో దాదాపు రూ.1900 కోట్లు ఖర్చు చేసి మానవతా దృక్పథంతో నిర్వాసితుల పక్షాన నిలిచినది. 2016లోనూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసితులకు రూ.700 కోట్లు విడుదల చేసింది. గత జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
ప్రాజెక్టు నిర్వాసితులకు 2026 డిసెంబర్ నాటికి పూర్తి పరిహారం చెల్లించాలని, కాలనీలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం నిర్మాణానికి సహకరిస్తున్నది. అవసరమైన నిధులు ముందే ఇవ్వడం అభినందనీయం. సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం రూ.30,436 కోట్లు కాగా, ఇందులో రూ.12,157 కోట్లు అడ్వాన్స్ ప్యాకేజ్‌గా మంజూరు చేయడంతో పాటు మొదటి ఏడాదిలోనే రూ.5,052 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు ప్రాజెక్టు బిల్లులకు గాను రూ.2,644.57 కోట్లు చెల్లించింది. ఎడమ ప్రధాన కాలువ మిగిలిన పనులకు రూ.960 కోట్ల పరిపాలనా అనుమతి జారీ చేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ముంపు సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పోలవరంను 2027 నాటి పుష్కరాలకు ముందే ఆంధ్రా జనావళికి అందుబాటులోకి తేవడానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తుండడం సంతోషకరం.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 09 , 2025 | 01:42 AM