Telangana Rising Global Summit: వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:00 PM
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 08: నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ వర్మ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతోందన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వివరించారు.
ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్న తెలంగాణ: కైలాశ్ సత్యార్థి
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 20 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. సంస్కృతి,కళలు,టెక్నాలజీ,పరిశ్రమల హబ్‌గా తెలంగాణ ఉందన్నారు. ఐకమత్యంతోపాటు శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సాధ్యమని కైలాశ్ సత్యార్థి వివరించారు.
మంగళవారంతో ముగియనున్న సమ్మిట్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైంది. ఈ సమ్మిట్ మంగళవారంతో ముగియనుంది. ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, అతిథులు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. దేశ, విదేశీ ప్రముఖులు ఈ సమ్మిట్‌కు హాజరయిన నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూకట్‌పల్లి అభివృద్ధిపై కవిత షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్
Read Latest Telangana News And Telugu News