Harish Rao: కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై హరీష్ రావు సంచలన కామెంట్స్
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:10 PM
కాంగ్రెస్ రెండేళ్ల పాలనై మాజీ మంత్రి హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లకు సీఎం రేవంత్ ప్రజలకు వేదన, రోదన మిగిల్చారని విమర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 8: రెండేళ్ళ కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రజా దర్బార్‌లో ప్రజలను కలుస్తా అన్నారని.. ఆ గొప్పలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జల్సాలకు, విందులకు పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్‌లకు ప్రజా భవన్‌ను వాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు. రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు.
రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అంటూ కామెంట్స్ చేశారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. విజయోత్సవాలు కాదు.. అప జయోత్సవాలు జరుపుకోవాలన్నారు.
బిల్లులు అడిగితే విజిలెన్స్ విచారణ, ఏసీబీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై పగబట్టి.. బ్లాక్ మెయిల్ పాలన చేస్తున్నారన్నారు. ఒక్క ఊరిలో కూడా పూర్తి రుణమాఫీ కాలేదని తెలిపారు. మొత్తం రుణమాఫీ అయ్యిందంటే తాను రాజీనామాకు సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ రైతు సంక్షోభ ప్రభుత్వమన్నారు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ.. మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. తాగుబోతుల తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా పెద్ద కాంట్రాక్టర్ల బిల్స్ క్లియర్ అవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి..
బైక్‌పై వెంబడించి... కత్తులు, రివాల్వర్‌తో అతి కిరాతకంగా..
Read Latest Telangana News And Telugu News