Local Body Elections: ఏకగ్రీవాలు.. అయితే మాకేంటి?
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:58 AM
కోర్టులో ఓడిన వారు ఏడిస్తే, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.
(ఆంధ్రజ్యోతి-కోదాడ): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి, రెండో విడతలో ఉపసంహరణ పూర్తయి ప్రచారం ప్రారంభం కాగా మూడో విడత నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఇదిలా ఉండగా మొదటి రెండు. విడతల్లో కొన్ని పంచాయతీలు ఎకగ్రీవాలయ్యాయి. పోటీ ఉన్న చోట సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అంతులేని హామీలతో పాటు, సాయంత్రం మందు, విందులతో పాటు, మహిళలకు చీర, సారెలను అందజేస్తున్నారు. అంతేకాక ఓటుకు, రూ.2 వేలు ఇస్తామని హామీ ఇస్తుండటంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే వరి కోతలు పూర్తికావటంతో అందరూ ఎన్నికలపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో ఎన్నికల (సంక్రాంతి) సంబురాలు కనిపిస్తున్నాయి. మరో పక్క పోటీలో ఉన్న గ్రామాల్లో కొందరు యువత విజయంపై బెట్టింగ్‌లు వేస్తున్నారు.
సందడి లేని పంచాయతీలు..
ఏకగ్రీవం అయిన పంచాయతీల్లో ఎన్నికల వాతావరణం కనిపించటం లేదు. దీంతో ఆయా గ్రామాల్లోని ఓటర్లలో నిరుత్సాహం కనిపిస్తోంది. మందు, విందు, డబ్బులు అందలేదని ఓటర్లలో ఆనందం లేదు. దీంతో పోటీ జరుగుతున్న గ్రామాలలో మాదిరి ఏకగ్రీవం అయినా కూడా మందు, విందు, డబ్బులు అందాల్సిందేనని ఓటర్లు అంటున్నారు. లేదంటే ఊరుకునేదే లేదంటున్నారు ఫలితంగా నియోజకవర్గంలో 600 ఓట్లు ఉన్న ఓ గ్రామంలో ఏకగ్రీవం అయిన సర్పంచి పంచాయతీ అభివృద్ధికి కొరకు రూ.12లక్షలు ఇచ్చారు. ఏకగ్రీవం కోసం ప్రయత్నించిన నాయకులను ఓటర్లు.. ‘మీరు సర్పంచి అయిన వ్యక్తి నుంచి ఏంఆశించారో తెలియదు. పోటీ ఉన్న గ్రామాల్లో ఇద్దరు అభ్యర్థుల నుంచి రూ.2 వేల చొప్పున నాలుగు వేలు వస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచి నుంచి రూ.4వేలు, మందు బాటిల్, విందుకు మాసం, చీర, సారె ఇప్పిస్తారా?.. లేదా?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వెంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఉందని మధ్యవర్తుల నాయకులు అవాక్కు అవుతున్నారు.
అనందం లేదు..
కోర్టులో ఓడిన వారు ఏడిస్తే, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవం చేస్తాం గ్రామాభివృద్ధికి కొంత మొత్తం ఇవ్వాలని పెద్ద మనుషులు సూచించటంతో తాము అనుకున్న ప్రకారం నగదు ఇచ్చామని, ఎన్నికయ్యాక ఓటర్లు నగదు, మందు, విందులు చేయాలని అంటుండటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితి ఉందంటున్నారు. భార్యా పిల్లలు పోటీ చేయవద్దని చెప్పినా, కొందరు రెచ్చగొట్టడంతో ఎన్నికల్లో పోటీ బరిలో ఉన్నారు. తీరా ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.