Indigo Crisis: రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:47 PM
ఇండిగో వ్యవహారంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయానికి సమాచారం పంపినట్లు సమాచారం. నవంబర్ 1వ తేదీ నుంచి ఎఫ్‌డిటిఎల్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు, డీజీసీఏకు ఇండిగో సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 08: ఇండిగో విమానాల వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇండిగో వ్యవహారంలో రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానంపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇండిగో అంశంలో ప్రయాణికులకు మేలు జరిగేలా.. సమయస్ఫూర్తితో చర్యలు తీసుకున్నారంటూ మంత్రి రామ్మోహన్ నాయుడిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
ఈ వ్యవహారంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వైపు నుంచి ఎలాంటి లోటు పాట్లు లేకుండా.. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి రామోహ్మన్ నాయుడితో ప్రధాని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఇండిగో యాజమాన్య వైఫల్యమని.. కానీ కొంత మంది తెలిసీ తెలియక చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే హోంమంత్రి అమిత్ షా సైతం ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇండిగో వ్యవహారంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయానికి సమాచారం పంపినట్లు సమాచారం. నవంబర్ 1వ తేదీ నుంచి ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు, డీజీసీఏకు ఇండిగో సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ వరకు ఇండిగో కార్యకలాపాలు అన్నీ సజావుగానే సాగాయని సంబంధిత వర్గాలు వివరించాయి. కానీ డిసెంబర్ 3వ తేదీ నుంచి ఒకేసారి సమస్యలు ఉత్పన్నమయ్యాయని.. దాంతో అంతా ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించాయి.
ఒకేసారి విమాన కార్యకలాపాల్లో సమస్య వచ్చిందని... ఇది పూర్తిగా యాజమాన్య తప్పిదమని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అదీకాక ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇండిగో యాజమాన్యంలోని పలువురు కీలక వ్యక్తులు విదేశాల్లో ఉన్నారని అధికార వర్గాలు ఈ సందర్భంగా స్పష్టం చేశాయి. ప్రయాణీకులకు చుక్కలు చూపించిన ఇండిగోపై తప్పకుండా చర్యలు ఉంటాయని.. అయితే అంతకుముందు తీసుకోవాల్సిన అంశాలపై పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి వరకు సాధారణంగానే ఉన్న వ్యవస్థ... ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించాయి. ఇండిగో సంస్థలోనే అత్యధికంగా 2,260 మంది పైలెట్లు ఉన్నారని చెప్పాయి. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ఇండిగో ఎయిర్ బస్ నుంచి 100 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిందని అధికార వర్గాలు వివరించాయి. ఎయిర్ ఇండియా 500, ఆకాశ 100, స్పైస్ జెట్ 50 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాయని తెలిపాయి.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విమానాలు నడపడానికి రెండు, మూడు సంస్థలు అనుమతి పొందినా... విమానాలు దొరకని పరిస్థితి నెలకొన్నదని చెప్పాయి. ప్రస్తుత ఈ వ్యవహారంతోపాటు విమానయాన సంస్థల్లో ఆహారం, నీరు, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత... సీటు కోసం మళ్లీ నగదు వసూలు చేస్తున్న వ్యవహారంపైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు వెల్లడించాయి. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు రిఫండ్ చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు కుండబద్దలు కొట్టాయి.
ప్రయాణీకుడు చెల్లించిన మొత్తం నగదు వెనక్కి ఇవ్వాల్సిందేనని ఇండిగో సంస్థకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నాయి. ఇండిగో సీఈఓ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరారని తెలిపాయి. వారి సమాధానం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు మొదలవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest National News And Telugu News