Panigrahi Subbarao: సాహితీ, సాంస్కృతిక అగ్నికణం
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:00 AM
ముప్పయ్యారేళ్లు మాత్రమే జీవించినా, మరణించి దాదాపు యాభయ్యేళ్లు కావస్తున్నా, ఇంకా తడియారని నెత్తుటి సంతకం పాణిగ్రాహిది! ఆరిపోని అగ్నికణం అతని సాహిత్యం! విప్లవాకాశాన అరుణకిరణం...
ముప్పయ్యారేళ్లు మాత్రమే జీవించినా, మరణించి దాదాపు యాభయ్యేళ్లు కావస్తున్నా, ఇంకా తడియారని నెత్తుటి సంతకం పాణిగ్రాహిది! ఆరిపోని అగ్నికణం అతని సాహిత్యం! విప్లవాకాశాన అరుణకిరణం ఆయన!
కళింగాంధ్రలో తొలితరం కమ్యూనిస్టుల జీవిత కాలం మూడు నాలుగు దశాబ్దాలలోపే ముగిసిపోయేది. గంటి రాజేశ్వరరావు, పుల్లెల శ్యామసుందరరావు, మార్పు పద్మనాభం నుంచి పాణిగ్రాహి, తామాడ గణపతి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తి, మదనాల దుష్యంత్ తదితరుల దాకా సహజ, అసహజ (ఎన్‌కౌంటర్ల) మరణాలకు గురయినవారే! వీరంతా మరింత కాలం జీవించి ఉంటే కళింగాంధ్ర రాజకీయాలు భిన్నంగా ఉండి ఉండేవి!
చిన్నతనంలో ఇంటిలోని బ్రాహ్మణీయం కంటే బయటి సమాజమే సుబ్బారావును ఎక్కువగా ప్రభావితం చేసింది. సమాజమే దేవాలయమనుకున్నాడు. తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. దీంతో స్కూల్ ఫైనల్‌తోనే చదువు ఆగిపోయింది. కొన్నాళ్లు సోంపేట దేవాలయ పూజారిగా ఉన్నాడు. మరికొన్నాళ్లు ఖరగ్‌పూర్ వలసపోయి ప్రైవేటు పాఠశాల నడిపేడు. బతుకు బాధలను ఎదుర్కొంటూనే నాటి సామాజిక, రాజకీయ అంశాలపైనా, మతమౌఢ్యం పైనా కవితలూ, నాటికలూ, నాటకాలూ రాసేవాడు. యువకుల్ని కూడగట్టి నాటకాలాడేవాడు. ఖరగ్‌పూర్‌లో ఉన్న రోజుల్లోనే కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితుడైనాడు. అప్పటికి శ్రీకాకుళం జిల్లా నలుమూలలా కమ్యూనిస్టుల నాయకత్వంలో వ్యవసాయకార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు ఏర్పడి ఆయా రంగాల్లో ఉద్యమాలు సాగేవి. సోంపేట, పలాస, టెక్కలి వరుసలో ఉద్దానం ఉద్యమ ప్రాంతమయ్యింది. ఆ ప్రాంత ఉద్యమానికి బొడ్డపాడు కేంద్రమయ్యింది. పాణిగ్రాహి సాహిత్యం, నాటకాల గురించి తెలుసుకున్న బొడ్డపాడు యువకులూ, పార్టీ నాయకత్వమూ ఖరగ్‌పూర్ నుంచి పాణిగ్రాహిని బొడ్డపాడులోని జగదీశ్వరాలయానికి పూజారిగా తీసుకొచ్చేరు. ఇక రెస్ట్ ఈజ్ హిస్టరీ! పాణిగ్రాహి సాంస్కృతిక రంగాన అగ్నికణమైనాడు. రాజకీయ విప్లవాకాశాన అరుణ కిరణమయ్యేడు!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ పంథాను, కార్యక్రమాలను దాదాపుగా పాణిగ్రాహి తన కవితల్లోనూ పాటల్లోనూ చిత్రించాడు. అంతకుముందు ఆదర్శపూర్వక ధోరణిలో రాసిన రచనల్లో సమాజంలోని దుర్మార్గంపై విమర్శ ఉంది. దుర్మార్గానికి కారణమైన వారిపై ఆగ్రహం ఉంది. దుర్మార్గానికి బలయినవారిపై ఆవేదన ఉంది. కమ్యూనిస్టు దృక్పథం కలిగినాక ఆగ్రహానికీ, ఆవేదనకూ రాజకీయ స్పష్టత ఏర్పడింది. వ్యవస్థ స్వరూప స్వభావాలు తెలిసేయి. వ్యవస్థను నడిపే పాలకవర్గాల గురించి, వ్యవస్థను మార్చే శ్రామిక శక్తుల గురించి తెలిసింది. ఇక అక్కడి నుంచి పాణిగ్రాహి రాసిన సాహిత్యం– వ్యవస్థ మార్పునకు అవసరమైన రాజకీయ చైతన్యాన్ని కలిగించే దిశగా నడిచింది. ఎన్ని ప్రక్రియలు వీలైతే అన్ని ప్రక్రియలు చేపట్టేడు. కవితలు రాసేడు. పాటలు రాసేడు. చివరికి, అక్షరం రాని ఆదివాసీల కోసం జముకుల కథ రాసి, ఆడి పాడేడు. ఒరియా భాషలో కూడా కవితలూ, పాటలూ రాసేడు. ఏ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలనుకున్నాడో ఆ ప్రాంత ప్రజల భాషనూ, నుడికారాన్నీ, సంస్కృతినీ నేర్చుకొని సాహిత్యీకరించేడు.
కమ్యూనిస్టుల లక్ష్యాన్నీ, సిద్ధాంత ప్రకటననూ ‘‘కమ్యూనిస్టులం... మేము కష్టజీవులం’’ అన్న పాటలో గొప్పగా చిత్రించేడు. ‘‘డబ్బులకై ఆశయాలు అంగడిలో అమ్మబోము... నిర్బంధాలకు భయపడి రివిజనిస్టులం కాము’’ అన్నాడు. ‘‘మాకున్నది సిద్ధాంతం... నమ్మము మీ వేదాంతం’’ అని ప్రకటించేడు. కమ్యూనిస్టు విప్లవకారులకు ఇది పతాకగీతం అనవచ్చు. గోడల మీద ఎర్ర రంగులో రాసిన నినాదాలపై ఒక భూస్వామి పేడ కొట్టించాడన్న సంగతి విన్నపుడు ‘‘ఎరుపంటే కొందరికి భయం భయం... పసిపిల్లలు వారికన్న నయం నయం’’ అన్నాడు. బహుశా కళింగాంధ్రలో ఇంతగా ప్రజాజీవనాన్ని స్పష్టమైన రాజకీయ దృక్పథంతో సాహిత్యీకరించిన వాళ్లు అంతకుముందు లేరు (ఇప్పుడూ లేరు).
ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత, చారుమజుందార్ నాయకత్వంలోని నక్సల్బరీ నిప్పురవ్వకు శ్రీకాకుళ అడివంటుకుంది! ‘‘దిక్కుమొక్కు లేని జనం... ఒక్కొక్కరు అగ్నికణం/ సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి’’ అని హెచ్చరించేడు. సాయుధబాటను కూడా సాహిత్యీకరించేడు. ‘‘బూర్జువాలను, భూస్వాములను... పాతరలో పాతేద్దాం, ఖతం, హతం చేసేద్దాం’’ అని రాసిన పాటను నిజం చేయటానికి కలం మాత్రమే చాలదనుకున్నాడు, తుపాకీ పట్టుకున్నాడు విప్లవం కోసం. సాయుధబాట ఆరంభించిన కొద్దినాళ్లకే, నిరాయుధులుగా దొరికిన వారిని కాల్చి చంపేసి ఎదురుకాల్పుల్లో చనిపోయినట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కరొక్కరుగా శ్రీకాకుళవీరులు నేల కొరిగిపోయేరు. చెరసాలల పాలయ్యేరు. పాణిగ్రాహికి పక్షవాతం సోకింది. చికిత్స కోసం ఉద్యమ ప్రాంతాన్ని విడిచి వెళ్లినవాడు చికిత్స పూర్తి కాకుండానే ఉద్యమావసరాన్ని గుర్తించి తిరిగొచ్చి, ఉద్యమ బాధ్యతలు తీసుకున్నాడు. కొద్దినాళ్లకే రంగమెటియా కొండల్లో అమరుడైనాడు.
నాటి శ్రీకాకుళోద్యమ సామాజిక సందర్భం కంటే నేటి సామాజిక సందర్భం మరింత సంక్షుభితం! ఇవ్వాళ కళింగాంధ్ర విధ్వంసక ప్రాజెక్టుల ప్రయోగశాలగా ఉంది. కార్పొరేట్లకు కాసుల పంటనిచ్చే సంపద్వంత సీమగా మారింది. ఆదివాసీలు ఆనాడు కేవలం సొండీలు, వడ్డీ వ్యాపారులూ, అవినీతి రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులూ, దౌర్జన్య పోలీస్ అధికారుల వల్ల మాత్రమే దోపిడీకీ, దౌర్జన్యానికీ, హింసకీ గురయ్యేవారు. ఇవ్వాళ వీళ్లకు కార్పొరేట్ శక్తులు వచ్చిచేరాయి. పోలీస్ బలగాలకు మిలటరీ, సైన్యం తోడయ్యింది. అడవినీ, అడవిలోని ఖనిజ సంపదనూ నొల్లుకోవడమేగాదు, అడవి నుంచి ఆదివాసీలను తరిమేసే కుట్ర సాగుతోంది. ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. నెత్తురు ఒలికిస్తున్నారు. కానీ ప్రజలకు నాయకత్వం వహించే శక్తులే లేవిక్కడ. రాజకీయ స్థితి ఇదయితే సాహిత్య, సాంస్కృతిక స్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.
అయిదు దశాబ్దాల త్యాగపూరిత విప్లవబాట అనేకానేక దారులుగా చీలిన సమయాన, పాణిగ్రాహి సంస్మరణను వేర్వేరు వేదికలుగా జరుపుకుంటున్న సందర్భంలో, అతని జీవితాన్ని ఎంతగా తలపోసుకుంటామో, అంతగా అతని బాటనూ చర్చించుకోవాలి. ఆ బాట నుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలను తీసుకోవాలి. కానీ ఇదే నేడు జరగడం లేదు.
అట్టాడ అప్పల్నాయుడు
(డిసెంబర్ 22న సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 06:00 AM