Nationwide Voter List Revision: బిహార్ బాటలోనే దేశవ్యాప్త సర్
ABN, Publish Date - Oct 31 , 2025 | 05:15 AM
ఆ అస్తవ్యస్తత ఇప్పుడు ఒక పద్ధతిని సంతరించుకున్నది! బిహార్ అనంతరం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి అమలుపరచనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ...
ఆ అస్తవ్యస్తత ఇప్పుడు ఒక పద్ధతిని సంతరించుకున్నది! బిహార్ అనంతరం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి అమలుపరచనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– సర్) కార్యక్రమం గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ప్రజాస్వామ్య నైతికత అయిన వయోజన ఓటుహక్కును విచక్షణారహితంగా అత్యధిక ప్రజలకు తొలగించేందుకు మొరటు సాధనమైన ‘సర్’ను ఇప్పుడు నాజూకు పద్ధతులతో విస్తరించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పూనుకున్నది. అర్హులైన పౌరులకు ఓటుహక్కు తొలగింపు విషయమై నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒక పదునైన సాధనంగా దాన్ని మార్చివేసింది.
ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణను తొట్ట తొలుత బిహార్‌లో అమలుపరిచిన తీరుతెన్నులు వివాదాస్పదమయ్యాయి. తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నది. సవరించిన ఓటర్ జాబితాల్లో నిర్దుష్టత, కచ్చితత్వం మెరుగుపడకపోగా వివిధ కీలక అంశాల్లో నాణ్యత గణనీయంగా క్షీణించింది: వయోజన ఓటర్ల నిష్పత్తి (దీనినే ఓటర్లు– ప్రజల నిష్పత్తి అని కూడా అంటారు) బాగా పడిపోయింది; మహిళా, ముస్లిం ఓటర్లు పెద్ద సంఖ్యలో తగ్గిపోయారు; ఎన్నికల సమగ్రత, నిష్పాక్షికతను దెబ్బతీసే అక్రమాలు (నకిలీ ఓటర్ల నమోదు, డజన్ల కొద్దీ ఓటర్ల చిరునామా ఒకటే కావడం) మొదలైనవి యథాప్రకారం కొనసాగాయి. మరి ఈసీఐ ఈ లోపాలు, లొసుగులను గుర్తించిందా? అక్టోబర్ 27న ‘సర్’ రెండో దశను ప్రకటించిన తీరును నిశితంగా గమనిస్తే బిహార్ అనుభవాల నుంచి భారత ఎన్నికల సంఘం సరైన పాఠాలు నేర్చుకోలేదని స్పష్టమవుతున్నది. అసలు తన పరంగా జరిగిన తప్పులు అంగీకరించలేని అశక్తత, సరిదిద్దుకునేందుకు సుముఖత భారత ఎన్నికల సంఘంలో కనిపించలేదు. ఇదొక కఠోర వాస్తవం. మరికొన్ని వాస్తవాలను కూడా మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. బిహార్‌లో ‘సర్’ అమలుకు ప్రభుత్వం వెచ్చించిన నిధులు భారీ పరిమాణంలో ఉండడం, అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో ఓటర్ జాబితాల సవరణ హడావుడిగా చేపట్టడం, తమ ఓటుహక్కును కాపాడుకోవడంలో పేద ఓటర్లకు ఎదురైన కష్ట నష్టాలు, మానసిక వ్యధలు మొదలైన వాటిని గమనిస్తే ఒక విషయం విశదమవుతుంది: ఓటర్ జాబితాల సవరణను ఏ విధంగా చేయకూడదో బిహార్ ‘సర్’ నిరూపించింది.
భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ‘సర్’ కొత్త వెర్షన్‌లో మార్పులు స్వతస్సిద్ధమైన ఒక కపట పథకాన్ని మరింత సమర్థంగా అమలుపరిచేందుకు ఉద్దేశించినవే. అవి సంక్లిష్టమైనవి మాత్రమే కాదు, స్పష్టంగా కనిపించని అదనపు అంశాలు సైతం వాటిలో ఉన్నాయి. బిహార్‌లో కంటే విశాల భారతదేశంలో మరింత పకడ్బందీగా తాను కోరుకున్న తీరులో ‘సర్’ను అమలుపరిచేందుకు ఈసీఐ మెరుగ్గా సన్నద్ధమయిందనడంలో సందేహం లేదు. ఎన్నికల అధికారులకు ‘సర్’ అమలులో సకాలంలో శిక్షణ నిచ్చింది. నేమ్ మ్యాపింగ్ (ఒక పేరును గుర్తించేందుకు, సంధానం చేసేందుకు మరొక పేరుతో అనుబంధించే ప్రక్రియ)కు ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్యూమరేషన్ ఫామ్‌లు దాఖలు చేసేందుకు అనుమతించింది. దీనివల్ల పోలింగ్ బూత్ స్థాయి అధికారులకు పనిభారం తగ్గుతుంది. తద్వారా సవరణ ప్రక్రియ శీఘ్రగతిన జరిగేందుకు వెసులుబాటు అవుతుంది. బిహార్ ‘సర్’ అమలులో బహిరంగంగా ప్రకటించకుండా రహస్యంగా చేసిన కొన్ని మార్పులను ఈసీఐ ఇప్పుడు అధికారికమైనవిగా చేసింది. ఓటర్లు ఇప్పుడు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్‌తో పాటు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించనవసరం లేదు. ఈ మినహాయింపును 2002–04 నాటి పాత ఓటర్ జాబితాల్లో ఉన్న వారి సంతానానికి, లేదా ‘బంధువు’కు కూడా వర్తింపజేసింది. తాత్కాలికంగా దూర ప్రదేశాల్లో ఉన్న వారి తరఫున ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించేందుకు సంబంధిత వ్యక్తుల కుటుంబ సభ్యులకు అనుమతినివ్వడం వలస వెళ్లిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. కొత్త ఓటర్ల కోసం ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకువెళ్లేందుకు పోలింగ్ బూత్ స్థాయి అధికారులను అనుమతించడం మంచిదే. అయితే ఇంటింటికీ తిరిగి ఓటర్లను ధ్రువీకరించుకునే దశలో తొలగింపులకు కాకుండా గణనీయమైన స్థాయిలో అదనపు చేర్పులకు తోడ్పడి తీరాలి. దీనివల్ల ఓటర్లకు ప్రయాసలు, ఎన్నికల అధికారులకు పనిభారం తగ్గుతాయి. ఇవన్నీ సానుకూల సంస్కరణలుగా కనిస్తున్నా లోపభూయిష్టమైన పథకాన్ని సమర్థంగా అమలుపరిచేందుకు ఉద్దేశించినవే అనడంలో సందేహం లేదు.
చెప్పవచ్చినదేమిటంటే ఈ సడలింపులు, మెరుగుదలలు ఏవీ ‘సర్’లో స్వతస్సిద్ధంగా ఉన్న ప్రాథమిక మినహాయింపు రూపకల్పనను మార్చవు. గతంలో ఎనిమిది పర్యాయాలు అమలుపరిచిన సమగ్ర సవరణ ప్రక్రియను పునరావృతం చేయడమే ప్రస్తుత ప్రత్యేక సమగ్ర సవరణ అని భారత ఎన్నికల సంఘం పదే పదే ఉద్ఘాటిస్తోంది. ఇదొక అబద్ధం. ప్రస్తుత ‘సర్’ గతంలో జరిగిన ఏ సమగ్ర సవరణ కంటే కూడా భిన్నమైనది. గత సమగ్ర సవరణల మార్గదర్శక సూత్రాలు పూర్తిగా భిన్నమైనవి. ఈసీఐ ఈ సత్యాన్ని కప్పిపుచ్చజాలదు. మరీ ముఖ్యంగా ఓటర్ జాబితాల్లో మళ్లీ స్థానం పొందేందుకు, అంటే ఓటర్‌గా తమను తాము ధ్రువీకరించుకునేందుకు అవసరమైన దరఖాస్తును, డాక్యుమెంట్లను ఓటర్లే స్వయంగా సమర్పించాలి. ఇది మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిర్మాణ వ్యవస్థ (వయోజన పౌరులు ప్రతి ఒక్కరూ తమ సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఓటు వేయడానికి వీలు కల్పించే చట్టబద్ధమైన, విధానపరమైన చట్రం) ఒక మౌలిక మార్పు. ఇంతకు ముందు ఓటరు నమోదు బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉండేది. మరొక కఠిన నిబంధనను కూడా కొత్త ‘సర్’ సవరించలేదు. సవరణ ప్రక్రియ ప్రారంభమైన నెల రోజుల్లో పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్‌ను దాఖలు చేయడంలో విఫలమైన ఓటర్లు ఎవరైనా ‘నోటీసు, విచారణ, అప్పీల్ లేకుండా’ ఓటర్ల జాబితా నుంచి తొలగింపబడతారు. ఈ కఠిన నిబంధన కఠోర శిక్ష (సామూహిక ఓటుహక్కుల తొలగింపు)కు దారితీసే ప్రమాదమున్నది. ఇది సమంజసమేనా? పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలలో కూడా ఓటరు నమోదు బాధ్యత ప్రభుత్వం నుంచి వ్యక్తిగత ఓటర్లకు బదిలీ అయ్యింది. పర్యవసానంగా నమోదైన ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నిర్మాణాత్మక అవరోధం వల్ల మన దేశంలో సైతం ఓటర్ జాబితాల నుంచి అర్హులైన ఓటర్లు హీనపక్షం 5 నుంచి 10 శాతం మేరకు మినహాయింపునకు లోనయ్యే ప్రమాదమున్నది. ఇలా తొలగింపునకు గురయ్యే ఓటర్లలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. బిహార్‌లో ఇదే జరిగింది. ఈ విషయమై ఈసీఐ దృష్టి పెట్టిందా? సమాధానం స్పష్టమే.
2002–04 నాటి ఓటర్ జాబితాల్లో ఉన్న వారి పౌరసత్వాన్ని నిశితంగా పరీక్షించినట్టు ఈసీఐ పదే పదే చెబుతోంది. ఇది మరొక అబద్ధం. ఓటర్ల పౌరసత్వాన్ని పరీక్షించలేదని నాటి సమగ్ర సవరణల మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్త సర్‌లో ప్రతి ఒక్కరూ తాము లేదా తమ బంధువులు 2002–04 నాటి ఓటర్ జాబితాలలో ఉన్నట్టుగా నిరూపించాలి. అలా నిరూపించని వారికి పౌరసత్వాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్లు చూపాలని నోటీసు జారీ అవుతుంది. గమనార్హమైన విషయమేమిటంటే 2002–04 ఓటర్ జాబితాల్లో తమ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ఎందుకు లేరో సాక్ష్యాధారాలతో నిరూపించాలని కూడా అడుగుతారు. ఇది అసోంలో అమలుపరిచిన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)లా కనిపించడం లేదూ? సదరు డాక్యుమెంట్లను పరిశీలించి ధ్రువపరిచేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌లు అనుసరించాల్సిన విధి విధానాలను ఈసీఐ ఇంతవరకూ రూపొందించనే లేదు. ప్రస్తుత దేశ పాలకులకు ఇబ్బందికరంగా ఉన్న సామాజిక సమూహాలకు చెందిన వ్యక్తులను ఓటర్ జాబితాల నుంచి తొలగించేందుకే ఈ నిబంధనలను తెచ్చారనడంలో సందేహం లేదు. ఈ దృష్ట్యా రెండో దశ ‘సర్’ నేరుగా పౌరసత్వ అర్హతల ధ్రువీకరణ ప్రక్రియ అని భావించవలసివస్తోంది. మన ఓటర్ జాబితాలను వేధిస్తున్న వ్యాధికి ‘సర్’ సరైన ఔషధమా? కాదా? అని తనిఖీ చేసేందుకు కాక ముందుగా నిర్ణయించిన సందేహాస్పద సామర్థ్యం కలిగిన ఔషధం ఎంత చక్కగా పనిచేస్తుందో నిర్ధారించుకునేందుకు బిహార్‌లో అమలుపరిచిన ప్రత్యేక సమగ్ర సవరణ ఒక దృష్టాంతమనేది స్పష్టం.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి
ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..
ఈ బ్రదర్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఫోన్‌ను ఎలా సెట్ చేశాడో చూడండి..
Updated Date - Oct 31 , 2025 | 05:15 AM