Local Governance: స్థానిక సంస్థల నిధులన్నీ కరెంట్ బిల్లులకే
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:03 AM
గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు జరిగింది. గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలకమైన 23 అంశాలను...
గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు జరిగింది. గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలకమైన 23 అంశాలను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా స్థానిక సంస్థలకు గణనీయమైన బాధ్యతలు, అధికారాలు దఖలుపడ్డాయి. అయితే అధికారాలతో పాటు తగిన ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోతే ఈ వ్యవస్థ కాగితాలపైనే మిగిలిపోతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 12,760 గ్రామపంచాయతీలు, 567 మండల ప్రజా పరిషత్తులు, 31 జిల్లా ప్రజా పరిషత్తులు పనిచేస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఆర్థిక మనుగడకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆయువుపట్టు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన సుమారు రూ.1,477కోట్ల నిధుల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి సగటున ఏడాదికి దాదాపు రూ.10లక్షలు అందుతున్నాయి. ఈ పరిమిత నిధులతోనే వీధిదీపాలు, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి మౌలిక అవసరాలు తీర్చాలి. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన తాజా విద్యుత్ ధరలు స్థానిక సంస్థలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వీధిదీపాలకు యూనిట్‌కు రూ.7.10, గ్రామీణ తాగునీటి అవసరాల కోసం వాడే పంపులకు యూనిట్‌కు సుమారు రూ.6 చార్జీలు విధించారు. ప్రజల భద్రతకు అవసరమైన వీధిదీపాలు, జీవనాధారమైన తాగునీటి వ్యవస్థలను వాణిజ్య వినియోగంతో సమానంగా పరిగణించడం సమానత్వ సూత్రానికి విరుద్ధం.
దీని ప్రభావం గ్రామపంచాయతీల ఆర్థిక స్థితిపై పడుతోంది. చాలా గ్రామపంచాయతీలు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. మున్సిపాలిటీలైతే నెలకు లక్షల రూపాయల భారాన్ని మోస్తున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం కేటాయించే నిధుల్లో ఎక్కువ భాగం విద్యుత్ బిల్లులకే ఖర్చవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి, వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తుండటం సామాజిక న్యాయ దృక్కోణంలో ప్రశంసనీయం. అయితే అదే ప్రభుత్వం గ్రామ పంచాయతీలు వంటి స్థానిక సంస్థలపై అధిక విద్యుత్ చార్జీలు విధించడం విధానపరమైన అసమతుల్యతను స్పష్టంగా చూపిస్తోంది. ప్రజల ప్రాథమిక అవసరాలను నెరవేర్చే సంస్థలపై ఇలాంటి భారం మోపడం గ్రామ స్వరాజ్య భావనను నిర్వీర్యం చేస్తుంది.
ఈ సమస్యకు దీర్ఘకాలిక, స్థిరమైన పరిష్కారాలు అన్వేషించాలి. ప్రతి గ్రామపంచాయతీలో జనాభా, విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా చేసుకొని 50 నుంచి 100 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 నుంచి 1000 మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని ద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గడమే గాక పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర విద్యుత్ భద్రత, స్థానిక సంస్థల ఆర్థిక స్వావలంబన కూడా సాధ్యమవుతాయి. సుమారు మూడు నుంచి నాలుగు వేల కోట్ల పెట్టుబడితో భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక లాభాలు అందించే మార్గం ఇది. తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ సంస్థలు గ్రామపంచాయతీలపై ఉన్న విద్యుత్ భారాన్ని తగ్గించే దిశగా తక్షణ, సానుకూల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని మాటలకే పరిమితం చేయకుండా, ఆచరణలో నిలబెట్టాలి.
ఆకుల సంపత్‌కుమార్
న్యాయశాస్త్ర విద్యార్థి
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 06:03 AM