ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagans Controversial Remarks: దైవసన్నిధిలో నేరాలకు జగన్ వత్తాసు

ABN, Publish Date - Dec 07 , 2025 | 02:40 AM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం విలేఖరుల సమావేశంలో చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలను బట్టి... రాష్ట్ర ప్రజలు పుట్టెడు కష్టాలలో ఉన్నారని ఎవరైనా నమ్మాల్సిందే...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల క్రితం విలేఖరుల సమావేశంలో చెప్పిన మాటలు, చేసిన ఆరోపణలను బట్టి... రాష్ట్ర ప్రజలు పుట్టెడు కష్టాలలో ఉన్నారని ఎవరైనా నమ్మాల్సిందే! అంతేకాదు, గత ఎన్నికలలో కూటమి నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆయనకు 11 సీట్లే ఇచ్చి అన్యాయం చేశారన్న భావన కూడా కలుగుతుంది. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న తన కలలను కూటమి నాయకులు కల్లబొల్లి కబుర్లతో కల్లలు చేశారన్న ఉక్రోషం కూడా ఆయన మాటల్లో కనిపించింది. సుదీర్ఘంగా 2 గంటలా 43 నిమిషాల పాటు సాగిన విలేఖరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన మాటలన్నీ నిజమా? అన్న అనుమానం కించిత్‌ కూడా రాకుండా ఆయన తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. గతంలో కేసీఆర్‌ ఒక్కరే ఇలా గంటలకొద్దీ విలేఖరుల సమావేశాలు నిర్వహించేవారు. అయితే, ఆయన మధ్య మధ్యలో పిట్ట కథలు చెబుతూ విలేఖరులకు బోర్‌ కొట్టకుండా ఉత్తేజపరిచేవారు. ఈ చాతుర్యం జగన్‌లో లేనందున సదరు సమావేశానికి హాజరైన విలేఖరులకు కచ్చితంగా బోర్‌ కొట్టి ఉంటుంది. అయినా ఆయన తాను చెప్పాలనుకున్న వాటిని చిత్ర విచిత్ర హావభావాలతో చెప్పుకొన్నారు. ఒక నార్సిసిస్టిక్‌ పర్సనాలిటీ నోటి వెంట వెలువడిన అసత్యాలను, అర్ధసత్యాలను పట్టించుకోవడం ఎందుకులే అనుకోకుండా కూటమి ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఆ వెంటనే స్పందించి జగన్‌రెడ్డికి బదులిచ్చారు. ఇంతవరకు జగన్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు. అయితే, జగన్‌రెడ్డి తనలోని అక్కసును దాచుకోకుండా మధ్య మధ్యలో వెళ్లగక్కారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్యను, ఆయన బంధువు గోపీనాథ్‌ జెట్టి అనే ఐజీ స్థాయి అధికారిని ‘వాడూ వీడూ’ అని సంబోధించడం ద్వారా తనలోని కక్షను ఆయన ప్రదర్శించారు. ఇదే పని చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ చేసి ఉంటే బీసీ వర్గానికి చెందిన, అది కూడా యాదవ కులానికి చెందిన అధికారులను అవమానించారని నీలి మీడియా, కూలి మీడియా గగ్గోలు పెట్టి ఉండేది. గత ప్రభుత్వంలో హద్దులు మీరి ప్రవర్తించడమే కాకుండా అవినీతికి పాల్పడిన ఆరోపణలపై ఒకరిద్దరు అధికారులు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో... ‘దళిత అధికారులపై కక్ష ఏమిటి?’ అని ఇదే నీలి, కూలి మీడియా వాపోవడం చూశాం. జగన్మోహన్‌రెడ్డి తనలోని నటనా కౌశలాన్ని ఎంతలా బయటకు తీసినా మధ్య మధ్యలో తన నిజ స్వరూపాన్ని దాచుకోలేకపోతున్నారు. ఫలితంగా అవతలి వారిని ఏక వచనంతో ‘వాడూ వీడూ’ అనీ సంబోధిస్తుంటారు. విలేఖరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన మాటలను ఎంత మంది నమ్మారో తెలియదుగానీ... విలేఖరులు మాత్రం బాధితులయ్యారు. జగన్మోహన్‌రెడ్డి ఉపన్యాసం మొదలుపెడితే ఎంత తొందరగా వదిలిపెడతారా? అని ఎదురుచూస్తానని ఆయన పార్టీకే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఎక్కడో చెప్పినట్టు గుర్తు! సొంత పార్టీ వారే భరించలేని ఆయన ఉపన్యాసాలను విలేఖరులు నిర్బంధంగా భరించాల్సి రావడం విషాదమే!

బొక్కలో వేయాల్సింది ఎవరిని?

జగన్‌ నోటి వెంట వెలువడిన కొన్ని ఆణిముత్యాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం! ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లను బొక్కలో వేయాలని జగన్‌రెడ్డి కోరుతున్నారు. నిజంగా అలా చేయవలసి వస్తే ఈ దేశంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయట తిరగలేరు. అందరూ జైల్లోనే ఉండాలి. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవించిన జగన్‌రెడ్డి కూడా అమలు చేయలేకపోయిన ఎన్నికల హామీలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మద్య నిషేధం! ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడంకోసం ప్రజలు కోరుకున్నా కోరుకోకపోయినా నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం మన దేశంలోని నాయకులకు పరిపాటి అయింది. అధికారం అప్పగిస్తే స్వర్గాన్ని దివి నుంచి భువికి తీసుకు వస్తామని చెబుతారు. అందరికీ అన్నీ ఉచితంగా ఇస్తామని చెబుతారు. నిజానికి ప్రజలు అవేవీ నమ్మరు. అప్పటి పరిస్థితులను బట్టి తాము ఎవరికి ఓటు వేయాలో వారికే వేస్తారు. అధికారంలో ఉన్న పార్టీపై కోపం ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎంచుకుంటారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇదే చేశారు. జగన్‌రెడ్డి పాలనలో దిమ్మ తిరిగి బొమ్మ కనపడటంతో 164 సీట్లలో కూటమిని గెలిపించి, జగన్‌రెడ్డికి 11 సీట్లే ఇచ్చారు. ప్రజల తీర్పు ఈ విధంగా ఉండబోతోందని చంద్రబాబుగానీ, జగన్‌రెడ్డిగానీ ఊహించలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో ప్రజలు కోరుకోకపోయినా చంద్రబాబు అనవసర వాగ్దానాలు చేశారు. అయితే ప్రజలు వాటిని నమ్మి ఆయన పార్టీకి ఓట్లు వేయలేదు. 2019 ఎన్నికల్లో నమ్మి అధికారం కట్టబెడితే జగన్‌రెడ్డి అరాచకంగా పాలించారన్న కోపంతోనే ప్రజలు కూటమికి కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఈ వాస్తవాన్ని విస్మరించి, హామీలు అమలుచేయనందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను బొక్కలో వేయాలని జగన్‌రెడ్డి కోరుకోవడం విడ్డూరంగా ఉంది. అవినీతి ఆరోపణలపై కొంత కాలం జైలు జీవితం గడిపిన జగన్‌రెడ్డి తనవలే మిగతా నాయకులు కూడా జైలు జీవితం గడపాలని కోరుకుంటున్నట్టు ఉంది. అందుకే కాబోలు, తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తాడూ బొంగరం లేని స్కిల్‌ కేసులో జైల్లో పెట్టించారు. హామీలు అమలు చేయని వారిని బొక్కలో వేయాలన్న జగన్‌రెడ్డి ఫిలాసఫీ ప్రకారమైతే ఓటర్లను కూడా జైల్లో పెట్టాలి. ఎన్నికల సందర్భంగా చాలామంది అన్ని పార్టీల నుంచీ డబ్బు తీసుకుంటున్నారు. చివరికి ఏదో ఒక పార్టీకే ఓటేస్తున్నారు కదా? డబ్బు తీసుకొని ఓటు వేయకపోవడం నేరమే కదా? తమకు ఇష్టం లేని పార్టీ నుంచి డబ్బు తీసుకోకూడదు కదా? యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ఇప్పుడు అందరూ తప్పు చేస్తున్నారు. అధికారంలోకి రావాలన్న తపనతో నాయకులు అలవికాని హామీలు ఇస్తుండగా, మా ఓటు మీకే అని నమ్మబలికి అన్ని పార్టీల నుంచి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారంటే ఏం చెప్పగలం? ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ను బొక్కలో వేయాలన్న జగన్‌ డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.

మద్యం పాపం... మీది కాదా?

రాజకీయ నాయకుల మాటలు తాము చేసేది సంసారం, ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా ఉంటాయి. ఈ విషయంలో జగన్‌రెడ్డి మాత్రం పీహెచ్‌డీ చేశారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు ఉన్న అనుభవం తక్కువే. అయినప్పటికీ సుదీర్ఘ అనుభవం ఉన్నవారు కూడా ఆయన ముందు దిగదుడుపే. అధికారంలో ఉన్నప్పుడు ఆయినదానికీ కానిదానికీ కేసులు కట్టించి గిట్టనివారిని జైళ్లలో కుక్కిన ఆయన... ఇప్పుడు తన వాళ్లను వెనకేసుకురావడానికి విఫలయత్నం చేస్తున్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం సరఫరాలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే! అయినా... ‘మద్యం విషయంలో కేసు పెట్టడానికి ఏముంది? ఏమీ జరగని చోట కేసు కట్టి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజ్‌ కసిరెడ్డి వంటి వారిని జైల్లో పెట్టడం ఏమిటి?’ అని అమాయకంగా ప్రశ్నించే ప్రయత్నం చేయడమే జగన్‌రెడ్డిలోని గడుసుదనానికి నిదర్శనం. ఈ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంకలు కదులుతున్నాయి. మద్యం కుంభకోణం మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయని ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కేసు లోతుల్లోకి వెళుతున్న కొద్దీ దర్యాప్తు అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పేద ప్రజలకు నాసిరకం మద్యం సరఫరా చేసి వారి ఆరోగ్యంతో ఆటలాడుకున్న పాలకుల వికృత మనస్తత్వానికి ఈ కేసు ఒక మచ్చు తునక. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మద్యం కుంభకోణం జరగలేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ వికృత క్రీడలో ఎందరినో పావులుగా చేశారు. వేల కోట్లను దోచుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది ముఖ్య నాయకుడిని కూడా మోసం చేశారు. ఈ జాబితాలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. జగన్‌రెడ్డికి తెలియకుండా చెవిరెడ్డి కొన్ని వందల కోట్లు నొక్కేశారన్నది అధికారుల సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని బెయిలుపై బయటకు తీసుకురావడానికి జగన్‌రెడ్డి ఆసక్తి చూపడం లేదట! జగన్‌రెడ్డి కోసం తాము ఈ పాపం చేస్తే ఆయనే పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఈ కేసులో మరికొంత మంది ఇతర నిందితులు కూడా జగన్‌రెడ్డి తమను పట్టించుకోవడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ కేసులో ఇంకెన్ని లోతులు ఉన్నాయో దర్యాప్తు అధికారులకే అంతుపట్టడం లేదు. ఇంతటి భారీ కుంభకోణంలో కూడా అసలు కేసు ఎక్కడుంది? అని జగన్‌రెడ్డి ప్రశ్నించడం అంటే అది గడుసుదనం కాక మరేమిటి? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను కూడా జగన్‌ వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశారు. ముందస్తు బెయిలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించినప్పటికీ పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించారని జగన్‌రెడ్డి చెబుతున్నారుగానీ... అధికారంలో ఉన్నప్పుడు వారు సాగించిన అరాచకాలను ప్రజలందరూ చూశారు. అధికారం శాశ్వతం అని నమ్మడం వల్లనే అధికారం పోయాక కేసులు తలకు చుట్టుకుంటున్నాయి. జగన్‌రెడ్డి 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నవారు కూడా నమ్మారు. అందుకే హద్దు మీరి ప్రవర్తించి ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు కూటమికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలూ అదే బాటలో పయనిస్తున్నారు. అది వారి ఖర్మ. ఎప్పుడో ఒకప్పుడు పాపం పండుతుంది.

‘కల్తీ’ మాటలు...

విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన రెండు అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కోటానుకోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆయన అబద్ధాలను అలవోకగా చెప్పారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి కూడా అపచారం తలపెట్టిన వారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం మహా పాపం. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి వాడిన విషయమై జగన్‌రెడ్డి చేస్తున్న వాదన రోతగా ఉంది. నాసిరకం నెయ్యి కొనుగోలులో ఎవరి పాత్ర ఏమిటి? ఎంత? అనేది సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ నిర్ధారిస్తుంది. ఇప్పటివరకు సిట్‌ జరిపిన దర్యాప్తు ప్రకారం భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరించడంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయింది. అందుకు ఎవరు బాధ్యులు అన్నది తేలాల్సి ఉంది. తిరుమల లడ్డూ కోసం గతంలో చిత్తూరు డెయిరీతోపాటు ఒకటి రెండు సహకార డెయిరీల నుంచి మాత్రమే నెయ్యిని సేకరించేవారు. ఈ నిబంధనలను జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన పాలకమండలి సవరించింది. ఈ కారణంగానే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న డెయిరీలకు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లభించింది. ఇక్కడే అవినీతికి బీజం పడింది. భోలే బాబా డెయిరీ రంగప్రవేశం చేయగలిగింది. ఈ నిబంధనల సవరణ కూడా విచిత్రంగా జరిగింది. పాలకమండలి ముందుకు ఈ సవరణలకు సంబంధించిన తీర్మానం రాలేదు. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడానికి దాఖలైన టెండర్లను ఆమోదించే తీర్మానం మాత్రమే నాటి పాలకమండలి సమావేశంలో చర్చకు వచ్చింది. తీర్మానం ప్రతులను సభ్యులందరికీ ఇవ్వరు. చైర్మన్‌, కార్య నిర్వహణాధికారి వద్ద మాత్రమే అవి ఉంటాయి. ఆ రోజు టెండరు ఖరారు చేయాల్సిన తీర్మానాన్ని పక్కన పెట్టి... నెయ్యి సేకరణ విధానంలో మార్పులు చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ప్రస్తుతం బోర్డు సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కృష్ణమూర్తి ఉన్నారు. పోటీతత్వం పెరగడానికి వీలుగా నిబంధనలను సడలించాలన్నదే తమ ఉద్దేశమని అప్పటి అధికారులు చెబుతున్నారు. అయితే... బోర్డు ముందుకు వచ్చిన తీర్మానం ఒకటి కాగా, ఆమోదం పొందిన తీర్మానం మరొకటి కావడమే అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ప్రస్తుతం కార్యనిర్వహణాధికారిగా ఉన్న అనిల్‌ సింఘాల్‌ అప్పుడు కూడా కార్యనిర్వహణాధికారిగానే ఉన్నారు. జరిగిన దానికి ఆయన కూడా సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. భోలే బాబా డెయిరీకి అర్హత లేకపోయినా.... అర్హత కల్పించిన అధికారులు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. తిరుమల లడ్డూ పవిత్రత, విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారినెవరినీ క్షమించకూడదు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నది సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ అన్న వాస్తవాన్ని విస్మరించి జగన్‌రెడ్డి... సిట్‌ సభ్యుడైన గోపీనాథ్‌ జెట్టిని ‘వాడూ వీడూ’ అని చులకన చేసి మాట్లాడారు. గోపీనాథ్‌ జెట్టిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయలేదు. సుప్రీంకోర్టు సూచన మేరకు సీబీఐ ఎంపిక చేసుకుంది. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌ ఆధారంగానే సుప్రీంకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేసిన చిన్న అప్పన్న గురించి జగన్‌రెడ్డి చెప్పిన కథ కూడా వింతగా ఉంది. అప్పన్న ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వద్ద పనిచేసేవారని ఆయన చెప్పుకొచ్చారు. నాసిరకం నెయ్యి సరఫరా జరిగిన సమయంలో ప్రభాకరరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే లేరు. సదరు అప్పన్నను ఢిల్లీ ఏపీ భవన్‌లోనూ, ఆ తర్వాత వైవీ సుబ్బారెడ్డి వద్ద పీఏగా నియమించడం కూడా జగన్‌రెడ్డి హయాంలోనే జరిగాయి. వాస్తవం ఇది కాగా, ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న ప్రభాకరరెడ్డి వద్ద అప్పన్న పనిచేశారని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా జగన్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. నాసి రకం నెయ్యి సరఫరాలో జగన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని ఇప్పటివరకూ ఎవరూ ఆరోపించలేదు. నాసిరకం నెయ్యి సరఫరా చేయడం మాత్రం నిజం అని ప్రస్తుతానికి రుజువైంది. ఆ పాపానికి ఎవరు కారకులు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒకరిని అరెస్టు చేశారు. అప్పన్ననూ అరెస్టు చేశారు. మరికొందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాపానికి ఒడిగట్టిన వాళ్లను ఆ దేవదేవుడు క్షమించడు కూడా! పాపులు ఎవరో త్వరలో తేలుతుంది. ఇందులో ఏమీ జరగలేదని జగన్‌రెడ్డి చెప్పినంత మాత్రాన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు చూస్తూ ఊరుకోడు కదా? లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా పాపపు కూడు తినడానికి అలవాటుపడిన వారిని వెనుకేసుకు రావడానికి ఎవరు ప్రయత్నించినా... వారు కూడా ఈ పాపంలో పాలుపంచుకున్నవారే అవుతారు.

చోరీపైనా ‘చిన్న’ మాటలు..

పరకామణి చోరీ వ్యవహారంలో కూడా జగన్‌రెడ్డి అడ్డగోలు వాదనకు తెర లేపారు. పరకామణి లెక్కింపు సందర్భంగా రవికుమార్‌ అనే ఉద్యోగి 9 డాలర్లు దొంగిలించగా... ఆయన పద్నాలుగు కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి దఖలుపరచడం ఏమిటి? అన్నట్టుగా జగన్‌రెడ్డి వాదన సాగింది. నిజానికి రవి అనే అతను దొంగిలించింది 900 డాలర్లు. అలా అతను పరకామణి సొమ్ము దొంగిలించడం అదే మొదటిసారి కాదు. పాపం పండి ఆ రోజు దొరికిపోయాడు. దొంగిలించింది 9 డాలర్లా? 900 డాలర్లా? అన్నది ముఖ్యం కాదు. దేవుడి సొమ్ము దొంగిలించడం మహా పాపం! ఆ పాతకానికి ఒడిగట్టిన దొంగను శిక్షించకుండా రాజీ కుదుర్చుకోవడం ఏమిటి? ఆ అవసరం ఎవరికి, ఎందుకు వచ్చింది? దొంగతనానికి పాల్పడిన రవిని బెదిరించి సొమ్ము చేసుకున్న వారిలో కిషోర్‌, జగన్మోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి అనే పోలీసు అధికారులు ఉన్నట్టుగా అభియోగాలు ఉన్నాయి. వీరితో పాటు తెర వెనుక ఇంకెవరెవరు ఉన్నారో తేలాల్సి ఉంది. హైకోర్టు ఆగ్రహంతో సీఐడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ చోరీ కేసులో లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవలసిన అవసరం ఏమిటి? ఇదంతా ఎందుకు జరిగింది? ఎవరి ప్రోద్బలంతో అలా జరిగిందో కూడా తేలాల్సి ఉంది.

నేరస్తుడు పరకామణిలో చోరీ చేయడం అదే మొదటిసారి కూడా కాదు. కోటానుకోట్ల మంది ఆరాధించే ఆ దేవదేవుడి సన్నిధిలో ఇలాంటి ఘోరాలు జరగడం ఏమిటి? కల్తీ నెయ్యి సరఫరా చెయ్యడమైనా, పరకామణి చోరీ కేసైనా... దేవుడంటే భయం లేనట్టే కదా? దేవుడిని నిజంగా నమ్మేవాళ్లు, పూజించే వాళ్లు ఇలాంటి నీచపు పనులకు పాల్పడరు కదా! తిరుమలలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనిస్తే టీటీడీలో పనిచేస్తున్న కొందరికి ఆ దేవుడిపైన నమ్మకం, భయం లేనట్టే ఉంది. దేవుడిగా ఆ వెంకటేశ్వరుడిని నమ్మకపోతే నమ్మకపోయారు, ఆ దేవుడి పుణ్యానే కదా వారికి అక్కడ భృతి లభిస్తున్నది? అందుకైనా వారికి ఆ దేవదేవుడిపై భక్తి ఉండాలి కదా? పాలకమండలిగానీ, టీటీడీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులుగానీ... ‘దేవుడ్ని వాడుకుంటున్నామా? ఆ దేవదేవుడి కోసం పనిచేస్తున్నామా?’ అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబ్బు మాత్రమే సంపాదించాలని అనుకుంటే అందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలలో అనైతిక చర్యలకు పాల్పడటమేమిటి? పాపానికి ఒడిగట్టిన వారి విషయం అలా ఉంచితే, సదరు పాపాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్‌రెడ్డిని ఏమనాలి? క్రైస్తవ మతస్తుడైన జగన్‌రెడ్డికి కోనేటి రాయుడిపై నమ్మకం లేకపోవచ్చు. ఆ ఏడుకొండల వాడిని కోట్లాది మంది ఆరాధిస్తారు కదా? వారి మనోభావాలనైనా ఆయన గుర్తించి గౌరవించాలి కదా? జీసస్‌ సన్నిధిలో ఇలా జరిగితే జగన్‌రెడ్డి సహిస్తారా? అని బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు కానీ, జగన్‌రెడ్డి వంటి వారికి అవేవీ పట్టవు. వారు తమ స్వార్థం కోసం దేవుళ్లను కూడా వాడుకుంటారు. జగన్‌రెడ్డి ఇందుకు మినహాయింపు కాదు. అందుకే తిరుమలలో జరుగుతున్న అపచారాలు ఆయనకు స్వల్పమైనవిగా కనిపిస్తున్నాయి. తన వాళ్లను రక్షించుకొనే క్రమంలో దేవుడైనా ఆయనకు లెక్క ఉండదు. అయినా అలాంటి వాళ్ల సంగతి ఇక ఆ దేవుడే చూసుకుంటాడు!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 02:40 AM