KCR Political Revolution: తెలంగాణ అస్తిత్వానికి కాపలాదారు
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:50 AM
తెలంగాణ చరిత్రలో 2001 ఏప్రిల్ 27 రోజును కీలకంగా మలచిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ, 14 సంవత్సరాల లఘు, పద్నాలుగేళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఈ ఉద్యమం, సవాళ్లు, అవమానాలు, మరియు ప్రభుత్వ కక్ష్యలతో కూడిన విప్లవాత్మక ప్రయాణం దేశానికే తెలంగాణను ఒక మోడల్‌గా నిలిపింది
భారత స్వాతంత్ర్య చరిత్రలో 1885 డిసెంబర్ 27కు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో, తెలంగాణ చరిత్రలో 2001 ఏప్రిల్ 27కు అంతే ప్రాధాన్యత ఉన్నది. రెండింటి లక్ష్యం దాదాపు ఒక్కటే. పరాయి పాలన, దోపిడీ, పీడనలకు వ్యతిరేక పోరాటమే. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వచ్చారు. సగటు తెలంగాణ పౌరుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నమ్మకం పెంచుకునేందుకు కారకుడయ్యారు. ప్రజల భావోద్వేగాన్ని, అంతఃసంఘర్షణను తెలంగాణ అస్తిత్వ ఉద్యమంగా మలిచి, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని నిర్మించి, రాజకీయ ప్రక్రియ ద్వారా స్వరాష్ట్ర ఉద్యమాన్ని దేశచిత్రపటం పైకి తీసుకురావటంలో కేసీఆర్ చేసిన పద్నాలుగేళ్ళ ఉద్యమం అసామాన్యం. ఎన్నెన్నో దారుల్లో ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, తెలంగాణ విద్యావంతులు, కవులు, కళాకారుల గళాలు, ప్రతి ఊరు ఒక జేఏసీగా మారాయి. వీటన్నింటిని ఒక జేఏసీగా ఏర్పరచటంలోను, రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టటం లోను కేసీఆర్ అలుపెరగని కృషితో, వ్యూహాలు ఎత్తుగడలతో, ఎన్నికలు ఉపఎన్నికల గూండా పద్నాలుగేళ్ళ నిర్విరామ ఉద్యమాన్ని వెన్ను చూపకుండా నడిపారు. రాజకీయ పార్టీల ఆధిపత్య సంస్కృతి, అధికార పీఠాలపై కూర్చున్న కుట్రపూరిత చర్యలు, అడుగడుగునా ఆటంకాలు, అవమానాలు, విద్యార్థి యువకుల ఆత్మబలిదానాలు... వీటన్నిటి మధ్యా గుండెమండిన తెలంగాణను ఒక్క వేదిక మీదకు తెచ్చి ఒక్క తాటిపైన నడపటం, ధిక్కార స్వరాల్ని ఏకం చేసి రాజకీయ ఉద్యమ ప్రక్రియతో పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం చేయటం ఒక అసాధారణ చరిత్ర.
ఆ చరిత్రకు రాజకీయ ప్రక్రియ ద్వారా నేతృత్వం వహించింది టీఆర్‌ఎస్ అని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకరే చెప్పారు. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా అరిచి తెలంగాణ గొంతుకను విశ్వవ్యాప్తంగా వినిపించి ‘స్వరాష్ట్ర సాధనే నా స్వప్నం’ అన్న ఏకవాక్య నినాదంతో కేసీఆర్ టీఆర్ఎస్‌ను ఉద్యమ పథాన నడిపించారు. పెద్దమనుషుల ఒప్పందాల్ని, ఇచ్చిన మాటల్ని తుంగలో తొక్కి తెలంగాణను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కిన ఆధిపత్యాన్ని ధిక్కరించటం ఆ బక్కమనిషి కేసీఆర్‌కే దక్కింది. తెలంగాణ భూములు ఎండిపోయి; రైతులు, చేనేతలు, విశ్వకర్మల ఆత్మహత్యలు, వలసలు, ప్రపంచీకరణతో చెల్లాచెదురైన పల్లెలు, నీళ్ళ గోసలు... వీటన్నిటితో తెలంగాణ గుండెమండి తల్లడిల్లుతున్న ఉద్యమ సందర్భంలోనే దొంగాటలాడే నాయకుల్ని (బైటోడ్ని, ఇంటోడ్ని) దద్దమ్మలని, సన్యాసులని తిట్టింది నిజం. అది ఉద్యమభాష. జయశంకర్ నుంచి తొలిదశ ఉద్యమకారుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు, జనసంఘాల నేతలవరకు అందరితోనూ కేసీఆర్ కొన్ని వేలగంటలు నిరంతరంగా చర్చలు, మేధోమథనం చేశారు. టీఆర్ఎస్ చారిత్రక సందర్భంలో అవతరించిన పార్టీ. ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగుజాతి అస్తిత్వంతో టీడీపీ ఏర్పడినట్లుగా తెలంగాణ అస్తిత్వంతో పురుడు పోసుకుని పుట్టిన పార్టీ ఆనాటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్. పద్నాలుగేళ్ళ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ గోసల్ని, జరిగిన మోసాల్ని, తీవ్ర దుర్భిక్ష స్థితిగతుల్ని, దక్కకుండా పోతున్న కొలువుల్ని, నీటి దగాల్ని, నిధుల స్వాహాను పూసగుచ్చినట్లు చెప్పి తెలంగాణను జాగృతం చేస్తూ ఉద్యమ పథాన బీఆర్ఎస్ నడిచింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో ద్రోహాలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో పరాభవాలు, అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కొంటూ పోరాడి గెలిచింది. తెలంగాణను తెచ్చింది. తెలంగాణ వచ్చాక పదేళ్ళ పాలనాపగ్గాలను చేపట్టి రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకపాత్రను పోషించింది. దేశానికే తెలంగాణను మోడల్‌గా నిలిపింది.
ఇపుడు బీఆర్ఎస్ 2025 ఏప్రిల్ 27 నాటికి 25వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఉద్యమ సమయంలో జాతిని సన్నద్ధం చేసిన పార్టీనే పునర్నిర్మాణాన్ని చేపట్టిన ఉజ్వల చరిత్ర బీఆర్ఎస్‌ది. జలసాధన ఉద్యమాలు జరిగిన నేలలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దూకే స్థితిని తెచ్చిన ఖ్యాతి బీఆర్ఎస్‌కే దక్కుతుంది. దశాబ్దకాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చరిత్రలోనే అత్యధిక కొలువుల నియామకాలు చేసింది. తెలంగాణను ధనిక రాష్ట్రంగా నిలుపుతూ, చీకట్లను తొలగిస్తూ నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. వెయ్యికి పైగా గురుకులాలు, దళిత బంధు, రైతుబంధు పథకాలు విప్లవాత్మక చర్యలు. 33 జిల్లాలు ఏర్పాటు చేసి, ఆ జిల్లాలలో ప్రజల పక్షాన నిలిచి నిరంతరం ఉద్యమించేందుకు 30 బీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మించుకుని తెలంగాణ సమాజానికి కాపలాదారుగా నిలిచింది. వానమ్మ వానమ్మ అని, పల్లె కన్నీరు పెడ్తుందని, చుక్కనీరు లేని తెలంగాణ అని పాటలు కట్టి పాడుకున్న తెలంగాణను దేశానికే ధాన్యాగారం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది. తమిళుల అస్తిత్వం అంటే డీఎంకే పేరు చెబుతారు. అట్లనే తెలంగాణ అస్తిత్వమంటే బీఆర్ఎస్. తెలంగాణ స్వీయరాజకీయ అస్తిత్వంతో నిలిచి, తెలంగాణను గెలిపించిన బీఆర్ఎస్ రేపటి బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలిపింది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని పరిపూర్ణం చేయవలసిన బాధ్యత బీఆర్ఎస్ భుజం మీద వేసుకుంది. పాలకులు ఎవరైనా తెలంగాణ సమాజంపై ఈగవాలకుండా చూసే బాధ్యత బీఆర్ఎస్‌దే.
- జూలూరు గౌరీశంకర్
Updated Date - Apr 26 , 2025 | 05:51 AM