ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Political Economy: ఇది సకాలపు సబబేనా

ABN, Publish Date - Dec 26 , 2025 | 01:35 AM

జిలుగువెలుగుల భారత్‌ గురించి మనం వినని రోజంటూ ఉండదు. ఉరుకులు పరుగులు తీస్తున్న మన ఆర్థిక వ్యవస్థ గురించీ, క్రమం తప్పకుండా ఐదేళ్లకొకసారి శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చుకుంటున్న మన....

జిలుగువెలుగుల భారత్‌ గురించి మనం వినని రోజంటూ ఉండదు. ఉరుకులు పరుగులు తీస్తున్న మన ఆర్థిక వ్యవస్థ గురించీ, క్రమం తప్పకుండా ఐదేళ్లకొకసారి శాంతియుతంగా ప్రభుత్వాలను మార్చుకుంటున్న మన ప్రజాస్వామ్యం ఘనత గురించీ ఇంటా బయటా చాలా ప్రశంసలూ వినపడతాయి. ప్రశంసలన్నిటినీ వొట్టి ప్రచారాలుగా, అతిశయోక్తులుగా కొట్టేయటం తేలిక! విశ్లేషించటమే కష్టం! వాస్తవాలనూ ప్రశంసలనూ తక్కెడలో పెట్టి ఒకదానికొకటి సరిగ్గా తూగుతున్నాయా? లేదా? అని బేరీజు వేసుకుంటే దిద్దుబాట్ల అవసరాలు కనపడతాయి. వాటికి సంసిద్ధతను వ్యక్తంచేయటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సాహసంతో కూడిన పని! ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక విమర్శలు చేయటానికి ప్రజాస్వామ్యాల్లో కూడా ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛకు తిరుగులేదన్న దేశంగా పేరొందిన అమెరికాలో కూడా దానికి వ్యతిరేక వాతావరణం విజృంభిస్తోంది. వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడపట్టి ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల భావాల వారీగా చిట్టాలను రూపొందిస్తున్నారు. అమెరికా విధానాలను ఎప్పుడో ఒకప్పుడు విమర్శించినవారూ, ఇప్పటికీ వాటితో ఏకీభావం లేనివారూ సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో తలకిందులై పోతున్నారు!

అక్కడ సంగతి సరే.. మరిక్కడ సంగతేంటని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన జవాబు లభించదు. రాజకీయాలనూ, ఆర్థిక విషయాలనూ నిర్మొహమాటంగా చర్చించటం అరుదైపోతోంది. రాజకీయంగా మావైపో, ఆవలివైపో అన్న ధోరణే ప్రబలిపోతోంది. దీనికి భిన్నంగా సమస్యలను సామాజిక, ఆర్థిక, న్యాయ దృష్టితో అంచనా వేయటం, మెరుగైన ముందడుగులు సూచించటం ఎవరైనా చేస్తే సకాలపు సబబుగా భావించాల్సి వస్తోంది. రాజకీయ, ఆర్థిక విశ్లేషణలో ఇప్పటికే గణనీయంగా కృషిచేసిన ఇద్దరు అధ్యాపకులు అతుల్‌ కోహ్లీ, కాంతా మురళి ‘డెమొక్రసీ అండ్‌ ఇనీక్వాలిటీ ఇన్‌ ఇండియా’ అన్న తమ తాజా రచనతో ఆ పనిని సమర్థంగా చేశారు. స్వాతంత్య్రం సాధించిన నాటి నుంచి ఇప్పటివరకూ భారత్‌ చాలా కష్టతరమైన ప్రయాణాన్నే చేసింది. సాధించిన గణనీయ విజయాలూ ఉన్నాయి. గట్టిగా ఆశించినా చేరుకోలేని గమ్యాలూ ఉన్నాయి. మతతత్వంతో మొదటికే మోసంవస్తోన్న ప్రమాదాలూ నెలకొంటున్నాయి. వీటి వెనకున్న రాజకీయాలనూ, వాటితో ప్రభావితమవుతోన్న ఆర్థికరంగాన్నీ మనం లోతుగా అర్థంచేసుకోవటమే అసలు సమస్య.

దేన్నైనా ఏ దృక్పథంతో అర్థంచేసుకోవాలన్నది ఎప్పుడూ చిక్కుసమస్యగానే ఉంటుంది. మతదృక్పథంతో ప్రపంచాన్ని చూడటం ఒకరకంగా తేలికైన పని! కష్టాలకూ, నష్టాలకూ, అర్థాలకూ, అనర్థాలకూ, అసమానతలకూ, అదృష్టాలకూ, దురదృష్టాలకూ, అధోగతులకూ, పురోగతులకూ.. ఒక సకలాతీతశక్తినే కారణంగా భావిస్తే, అన్నిటిలోనూ యథాతథస్థితిని ఆమోదిస్తూ కాలాన్ని వెళ్లదీయొచ్చు. కానీ కాలమే మనిషిని ఆ తరహా ఆలోచనల్లో నిలువనీయటం లేదు. పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించే ప్రజాస్వామ్య రాజకీయాలు, ఆర్థిక అసమానతలను ఒక పరిమితిలో ఉంచాలనే ఆధునిక దృక్పథాలు బలపడుతోన్న ప్రపంచంలో.. ఎక్కడి పరిస్థితులనైనా వాటికి అనుగుణంగానే విశ్లేషించాలన్న వివేచనే పదునుతేలుతోంది.

ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచటానికి తోడ్పడాల్సిన రాజకీయాల్లో కుల, మత అస్తిత్వాల ప్రాధాన్యం పెరగటం, ఆర్థిక అసమానతలు ఏ దేశంలో లేనంతగా పెట్రేగటం భారత్‌కు పెనుసవాళ్లుగా మారాయి. ఆర్థిక ప్రగతికి ప్రభుత్వ విధానాలు దోహదం చేసి.. పరిశ్రమలు, సంస్థల ఏర్పాటులో ప్రభుత్వం క్రియాశీలకపాత్ర పోషించి.. అవసరమైన చోట స్వయంగా స్థాపించి.. అభివృద్ధిఫలాలు అన్ని వర్గాలకూ హేతుబద్ధంగా అందేలా కృషిచేయాలన్న లక్ష్యం 1980ల వరకూ దేశంలో ఎంతోకొంత ఉండేది. ఆ తర్వాత నుంచీ ప్రభుత్వాలు క్రమేపీ ఆ పాత్ర నుంచి తప్పుకొని ఆర్థికాభివృద్ధిని సాధించే లక్ష్యం ప్రైవేటు పరిశ్రమాధిపతులదిగా, వ్యాపారవేత్తలదిగా మాత్రమే భావించటంతో కీలకమార్పులు రావటం మొదలయ్యాయి. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించటం, వాటికి వనరులను కేటాయించటం, పన్నురాయితీలు ఇవ్వటం, వాటిల్లో పెట్టుబడులకు ఆహ్వానాలు పలకటం.. ప్రభుత్వాలకు ఏకైక ప్రాధాన్యంగా మారింది. దాని ఫలితంగా ఆర్థికాభివృద్ధి పెరిగింది. అందులో సందేహం లేదు. పెరిగిన సంపదకు అనుగుణంగా ఆదాయ పంపిణీలో న్యాయమూ జరిగి ఉంటే మన రాజకీయాలు కుల, మతతత్వాలకు దూరంగా ఉండేవి. ఆర్థికాభివృద్ధి సాధనను ప్రధానంగా పరిశ్రమాధిపతులకూ, వ్యాపారవేత్తలకూ వదిలివేస్తూ వారికి అన్నివిధాలుగా అండదండలు అందించటంతో పాటు వారు సమకూర్చే నిధులతో.. విరాళాలతో మాత్రమే పార్టీలను నడిపే పరిస్థితి రావటంతో రాజకీయ రంగంలో ప్రజలను సమీకరించే పద్ధతులే మారిపోయాయి. ఆర్థిక అంశాల ఆధారంగా ప్రజలను ఆకర్షించలేని నిస్సహాయస్థితిలోకి పార్టీలు పడిపోయాయి. అన్నింటా పైవర్గాలపై ఆధారపడిన పార్టీలకు కింది, మధ్యతరగతి వర్గాల ఓట్లను వదులుకునే పరిస్థితి మాత్రం లేదు. సోషలిజం, సంక్షేమరాజ్య భావనలను 1980ల నుంచి అన్ని పార్టీలూ వదులుకున్నాయి. నినాదప్రాయంగా అప్పుడప్పుడూ వాడినా విధానాల్లో, ఆచరణలో వాటిని పూర్తిగా పక్కనపెట్టారు.

1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదలైన సంపూర్ణ వ్యాపారానుకూల విధానాలను 1991లో విపరీతంగా సరళీకృతం చేశారు. వీటి అమల్లో పార్టీలపరంగా తేడాలు లేకపోయినా ఎన్నికల ద్వారానే అధికారంలోకి రావాలి కాబట్టి జనసమీకరణకు కొన్ని పార్టీలు కులంవైపు మొగ్గితే, బీజేపీ పూర్తిగా మతంవైపు మొగ్గింది. మండల్‌–మసీదు రాజకీయాలకు పూర్వరంగం అట్లా ఏర్పడిందే! కాంగ్రెస్‌ మాత్రం ఎటువైపూ నిర్దిష్టంగా దూకలేని అశక్తతతో అవకాశవాదంతో వ్యవహరించింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో వ్యక్తిపూజ పెరిగి, వ్యవస్థాపరంగా కాంగ్రెస్‌ క్షీణించటంతో సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోయింది. కుల అస్తిత్వాల ఆధారంగా వచ్చిన పార్టీలు కొన్నిచోట్ల అధికారాన్ని సాధించినా స్థిరత్వంతో కూడిన రాజకీయాలను నడపటంలో విఫలమయ్యాయి. ప్రాంతీయ అస్తిత్వాలపై ఆధారపడిన పార్టీలు మాత్రమే కొంత ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఇక హిందూ ఆధిక్యత, ముస్లిం వ్యతిరేకత రాజకీయాల్లో ప్రధానంగా మారిపోయాయి. ఈ ధోరణికి వ్యతిరేకమైన గళాలన్నీ తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజకీయరంగాన వ్యక్తిపూజను సహజంగా పరిగణించటం మామూలైపోతోంది. అధికార కేంద్రీకరణ పెరిగి, రాజ్యాంగవ్యవస్థల మధ్య సమతుల్యత బలహీనపడుతోంది. పౌరసమాజం, న్యాయవ్యవస్థ, ప్రసారమాధ్యమాలు కూడా ఒడిదుడుకులకూ, ఒత్తిళ్లకూ లోనవుతున్నాయి. గతంలో కొనసాగిన సుల్తానుల, పాదుషాల పాలనంతా బానిసత్వానికి చిహ్నంగానూ, క్రూరత్వానికి ప్రతీకగానూ పరిగణించే ప్రచారం ఊపందుకుని అదే నిజమైన చరిత్ర అన్నట్లుగా ప్రజలు నమ్మేపరిస్థితి వచ్చేసింది.

సంపద, ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అసంతృప్తులు, అభద్రతలు ఎక్కువగానే ఉంటాయి. స్థూలంగా చూస్తే ఆర్థికాభివృద్ధి బాగానే కనపడుతుంది. స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలు కూడా ఆశాజనకంగానే ఉంటాయి. బిలియనీర్ల సంఖ్యలోనూ ఏటేటా మంచి ఎదుగుదలే నమోదవుతోంది. కానీ మన ఆర్థికాభివృద్ధికి ఎక్కువ ఉద్యోగకల్పనకు దారితీయని తత్వమే ఎక్కువ. అధిక జనాభా ఉన్న దేశంలో ఇదెన్నో సమస్యలకు కారణమవుతుంది. మన అభివృద్ధి నమూనా ఎక్కువ పెట్టుబడులను కోరుతుంది. తక్కువ శ్రామికులను ఇముడ్చుకుంటుంది. 1000 కోట్ల పెట్టుబడితో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించలేని ఉదాహరణలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కంపెనీలతో కుదుర్చుకునే అవగాహనా ఒప్పందాలను పరిశీలిస్తే దీన్ని తేలికగానే గ్రహించొచ్చు. చైనా, దక్షిణకొరియా, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌ల్లో ఒకప్పుడు సాధించిన అభివృద్ధి దీనికి భిన్నం. అవన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోయే క్రమంలో ఎక్కువమందికి ఉపాధిని కల్పించే అభివృద్ధి నమూనాను ఎంచుకున్నాయి. ఉద్యోగాలను ఎక్కువగా కల్పించలేని అభివృద్ధే ఒక తీవ్ర సమస్య అయితే.. దానికి తోడు ఆదాయ, సంపదల్లో నెలకొంటున్న అసాధారణ అసమానతలు.. విద్వేష భావజాలాలకు ప్రజలను తేలికగా ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. నిజానికి విద్వేష భావజాలాలు వ్యాపారాభివృద్ధికి విఘాతంగా ఉంటాయి. కానీ వాటిని వ్యతిరేకించలేని స్థితిలోనే వ్యాపార, పారిశ్రామిక వర్గం ఉందనీ, పన్నుల్లో రాయితీలు, వనరుల కేటాయింపు పరంగా ప్రభుత్వాలు అందిస్తోన్న అండదండల వల్ల.. తమ ఆస్తుల పరిరక్షణ, లాభాలు సజావుగా కొనసాగుతూ ఉండటం వల్ల.. ఆ భావజాలాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలే ఎక్కువ వినపడుతున్నాయి.

ఆర్థికాభివృద్ధి పుంజుకుంటున్న దశలో అసమానతలు సహజమన్న వాదనను ప్రభుత్వం కూడా బలంగా విశ్వసించటం వల్ల దాన్ని ఒక సమస్యగా పరిగణించటం లేదు. అందుకే అధికారిక నివేదికల్లో వాటికి స్థానం దక్కటంలేదు. గణాంకాలను పైపైన చూసినా పరిస్థితిలో తీవ్రత అర్థమవుతుంది. ఆదాయ, సంపదల్లో ఎగువ 1శాతం జనాభా వాటా ఇటీవల 42.5శాతానికి పెరిగింది. 10శాతం ఎగువ జనాభా వాటాని లెక్కవేస్తే అది 74.3శాతానికి ఎదిగింది. ఇక 40శాతం మధ్యతరగతి వాటా సంపదలో 22.9శాతానికి దిగజారింది. కిందనున్న 50శాతానికి దక్కింది 2.8శాతమే. ఆదాయంలో కూడా ఈ వర్గాలను వరుసగా (21.7శాతం, 56.1శాతం, 29.7శాతం, 14.7శాతం) చూస్తే కనపడేది అదే చిత్రం. దీనికి తోడు ఆర్థికాభివృద్ధిలో కూడా అనుకున్నంత వేగం కనపడటం లేదు. 2014–2023 మధ్య అది 5.8శాతానికే పరిమితమైంది. 1991–2013 కాలం (6.6శాతం)తో పోల్చితే అది తక్కువ. మరి దారిద్య్రం తగ్గలేదా? అంటే గణనీయంగా తగ్గింది. రోజుకు 1.90 డాలర్లతో జీవితాన్ని గడిపే ప్రజలు 1980లో 60శాతం ఉంటే 2011 నాటికి అది 20శాతానికి తగ్గింది. కానీ నెలకు 100 డాలర్ల ఆదాయం (దాదాపు రూ.9000) ఉన్న వారందరూ దారిద్య్రరేఖకు దిగువనున్నారని భావిస్తే వారి సంఖ్య 2011లో సైతం 60శాతం ఉంటుంది.

నిశిత సామాజిక పరిశీలనలో కొన్ని కఠోర వాస్తవాలు కనపడతాయి. దేశ బహుళత్వ సాంస్కృతిక వారసత్వాన్ని బలహీనంగా భావించటం.. మైనారిటీల్లో అభద్రత నెలకొనటం.. కుల, మతభావాల ఆధారంగా ప్రజలను సమీకరించటం.. విపరీత అధికార కేంద్రీకరణ, రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యత లోపించటం.. విజృంభిస్తున్న అసమానతలు.. తక్షణం ఎదుర్కోవాల్సిన సవాళ్లుగా ఆ వాస్తవాలు మనముందు నిలుస్తున్నాయి. రాజకీయాల్లో మార్పులతో తలెత్తిన ఈ సవాళ్లకు పరిష్కారాలు కూడా రాజకీయాల రాపిడి నుంచే రావాలి!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 01:35 AM