Public Libraries India: గ్రంథాలయాలు డిజిటల్ మెట్టు ఎక్కాల్సిందే
ABN, Publish Date - Nov 20 , 2025 | 05:15 AM
ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, దేశంలోని పౌర గ్రంథాలయాలు నిధుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, పాలనాపరమైన నిర్లక్ష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో
ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి 20 వరకూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, దేశంలోని పౌర గ్రంథాలయాలు నిధుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, పాలనాపరమైన నిర్లక్ష్యం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో సుమారు 6.65 లక్షల గ్రామాలు ఉన్నప్పటికీ, రాజా రామ్మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (RRLF) లెక్కల ప్రకారం కేవలం 47,000 పబ్లిక్ లైబ్రరీలు మాత్రమే అధికారికంగా నమోదు అయ్యాయి. ఈ సంఖ్య దేశంలోని విశాలమైన జనాభాకు సమాచార, విద్యా సేవలను అందించడానికి ఏ మాత్రం సరిపోదు.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, 2022 IFLA–UNESCO పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో కనీసం ప్రతి వెయ్యిమందికి ఒక గ్రంథాలయం అవసరం. ఈ నిష్పత్తిని భారతదేశ జనాభా నేపథ్యంలో పరిశీలిస్తే, దేశానికి కనీసం 13 లక్షలకు పైగా పబ్లిక్ లైబ్రరీలు అవసరం. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాల సంఖ్యతో పోలిస్తే ఈ పరిమాణం దాదాపు 13 రెట్లు ఎక్కువ. సమాచార సమానత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం ఎంత దూరంలో ఉందన్నది ఈ వ్యత్యాసాన్ని బట్టి అర్థమవుతున్నది.
పలు ప్రపంచ దేశాలు గ్రంథాలయాల ప్రాముఖ్యాన్ని గుర్తించాయి. అమెరికా, ఫిన్లాండ్, సింగపూర్, యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు గ్రంథాలయాలను సమాజ అభ్యాస, సృజనాత్మకత కేంద్రాలుగా అభివృద్ధి చేశాయి. ఈ దేశాలలో ప్రభుత్వ బడ్జెట్‌లో గ్రంథాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ దేశ ప్రజలు లైబ్రరీలను సామాజిక పెట్టుబడిగా భావించి, వాటిని చదువుకోవడానికేగాక, విశ్రాంతి నిలయం గాను, సామాజిక చర్చా కేంద్రంగాను, సమాచారం ఇచ్చిపుచ్చుకునే స్థావరంగాను ఉపయోగిస్తారు. కానీ భారతదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. ప్రజల్లో చదివే అలవాటు తగ్గి, స్మార్ట్‌ఫోన్లపైనా ఆన్‌లైన్ మీడియాపైనా ఆధారపడే సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా యువత పుస్తకాల కంటే ఆడియో విజువల్ కంటెంట్, యూట్యూబ్ పాఠాలు, ఇ–పుస్తకాలు వంటి డిజిటల్ వనరులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. చాలా లైబ్రరీలు ఈ మార్పుకు సాంకేతికంగా సిద్ధంగా లేవు. ఇంటర్నెట్ సదుపాయం, వై–ఫై లేదా ఇ–రిసోర్స్ యాక్సెస్ లేకపోవడం వాటి ఆకర్షణను తగ్గిస్తోంది. దీనితో పఠన సంస్కృతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మాయమవుతోంది. కాబట్టి గ్రంథాలయాలు ఇప్పుడు డిజిటల్‌గా అనుసంధానం కావించబడటం చాలా ముఖ్యం.
2022 IFLA–UNESCO పబ్లిక్ లైబ్రరీ మానిఫెస్టో గ్రంథాలయాల కొత్త విధిని నొక్కి చెబుతూ, అవి ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో కొనసాగాలని సూచించింది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత, రిమోట్ యాక్సెస్ సేవలకు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రతి వర్గానికి సమాచార సేవలు అందించడం కీలకంగా మారింది. అయితే, భారతదేశంలోని గ్రామీణ పౌర గ్రంథాలయాలలో ఈ రకమైన దూరప్రవేశ సేవలు ఇంకా జనజీవనంలో భాగం కాలేదు.
పౌర గ్రంథాలయాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న రాజా రామ్మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (RRLF) నిధుల కేటాయింపులను పరిశీలిస్తే– 2019 నుంచి 2024 వరకు రూ.662 కోట్లు కేటాయించినప్పటికీ, రాష్ట్రాలు వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాయి. నేషనల్ మిషన్ ఆన్ లైబ్రరీస్ (NML) మోడల్ లైబ్రరీ ప్రాజెక్ట్ కింద కేటాయించిన దాదాపు రూ.952 కోట్లలో రాష్ట్రాలు కేవలం రూ.405 కోట్లు మాత్రమే ఉపయోగించుకున్నాయి. అనేక రాష్ట్రాలు గ్రంథాలయ చట్టాల ద్వారా ప్రజల నుంచి గ్రంథాలయ పన్నును వసూలు చేస్తున్నప్పటికీ, ఆ నిధులను గ్రంథాలయాలకు కేటాయించడంలో విఫలమవుతున్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.1000 కోట్లు, కర్ణాటక రూ.300 కోట్లు, మహారాష్ట్ర రూ.800 కోట్లు గ్రంథాలయాలకు బాకీ ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో పౌర గ్రంథాలయాలు సంక్షోభ స్థితికి చేరుకున్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారంగా బహుముఖ ప్రయత్నాలు అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, సంస్కృతి, సమాచార శాఖల బడ్జెట్‌లో కనీసం 1 శాతాన్ని గ్రంథాలయ అభివృద్ధికి కేటాయించాలి. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (PPP) నిధులు, CSR నిధుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధిని, సాంకేతిక అప్‌గ్రేడ్‌లను చేపట్టాలి. ప్రతి జిల్లా లైబ్రరీని ఒక డిజిటల్ హబ్‌గా మార్చి, ఆన్‌లైన్ లెర్నింగ్‌ను ఏర్పాటు చేయాలి. స్థానిక భాషా వనరులను అందుబాటులో ఉంచాలి. బుక్ క్లబ్‌లు, రచయితలతో చర్చలు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా గ్రంథాలయాలను సమాజ కేంద్రాలుగా మార్చాలి. తగిన వెలుతురు, సౌకర్యవంతమైన కుర్చీలు, ఎయిర్ కండీషనింగ్, వేగవంతమైన వై–ఫైతో కూడిన ఆధునిక భవనాలను ఏర్పాటు చేయాలి. గ్రంథాలయాలు మల్టీపర్పస్ సెంటర్లుగా (బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, బీచ్‌లలో) కూడా విస్తరించాలి.
‘‘పుస్తకాలు మనిషి శక్తిని, స్వేచ్ఛను పెంచే ఆయుధాలు’’ అంటారు బి.ఆర్ అంబేడ్కర్. ఈ దృక్పథంతో, భారతదేశం తన గ్రంథాలయ వ్యవస్థను పునరుద్ధరించుకోవాలి. ప్రజా గ్రంథాలయాల పునరుద్ధరణ కేవలం విద్యాపరమైన అవసరం మాత్రమే కాదు, సమాన అభ్యాస అవకాశాలపై ఆధారపడిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అత్యవసరం.
రవి కుమార్ చేగొని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం
(జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)
ఇవీ చదవండి:
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Updated Date - Nov 20 , 2025 | 05:15 AM