Hidden Bitter Truth for Pensioners: కేంద్రం తీపి కబురులో పెన్షనర్లకు దాగున్న చేదు
ABN, Publish Date - Nov 05 , 2025 | 02:35 AM
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సంఘం నియమిస్తా’మని ప్రకటించిన కేంద్రం, ఎట్టకేలకు బిహార్ ఎన్నికల ముందు....
ఈ ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సంఘం నియమిస్తా’మని ప్రకటించిన కేంద్రం, ఎట్టకేలకు బిహార్ ఎన్నికల ముందు దీన్ని నియమించింది. ఈ ఎనిమిదవ వేతన సవరణ సంఘానికి విధివిధానాలనూ ఖరారు చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది తీపి కబురు’ అంటూ మీడియా ఊదరగొడుతున్నది. కానీ నిజానికి పెన్షనర్లకు సంబంధించి ఇది చేదు వార్తే! కేంద్రం ఖరారు చేసిన విధివిధానాలను అనుసరించే ఈ ఎనిమిదవ వేతన సంఘం నివేదిక తయారవుతుంది. ఈ విధివిధానాలలోని మూడవ అంశం అతి ప్రమాదకరమైంది. దీని ప్రకారం ‘నాన్ కంట్రిబ్యూటరీ’ (ఉద్యోగి విరాళం లేని) ‘అన్ ఫండెడ్’ (నిధులు సమకూర్చబడని) పెన్షన్ పథకాలకు అయ్యే వ్యయాన్ని లెక్కగట్టి దానికి అనుగుణంగా సిఫారసులు చేయాలన్నారు. ఏప్రిల్ 1, 2004 కంటే ముందు ఉద్యోగంలో చేరి, జనవరి 1, 2026 కంటే ముందు రిటైర్ కాబోయే వారికి ఇది వర్తిస్తుంది.
ఉద్యోగి తన వేతనంలోంచి కొంత భాగాన్ని భవిష్యత్తులో రాబోయే పెన్షన్ కోసం విరాళంగా జమ చేసే పద్ధతి మన దేశంలో 2004 తర్వాత మొదలైంది. అప్పటిదాకా ప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్‌లలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం నిధులు కేటాయించేవారు. ‘మీ వేతనంలోంచి మీరు కొంత ఇవ్వండి, ప్రభుత్వం కొంత ఇస్తుంది. దాన్ని షేర్ మార్కెట్‌లో పెట్టి, లాభాలొస్తే దాంతో మీకు పెన్షన్ ఇస్తాం’ అనే అమానుష వైఖరితో, పెన్షన్ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకునే ప్రక్రియకు 2004లో వాజపేయి ప్రభుత్వం బీజం వేసింది. ఆ పద్ధతినే ఆ తర్వాత వచ్చిన మన్మోహన్‌సింగ్ ప్రభుత్వమూ కొనసాగించింది. మన రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి మొదలుకొని, ఈనాడున్న రేవంత్‌రెడ్డి వరకూ ఇదే బాటలో నడుస్తున్నారు.
ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇంకాస్త ముందుకు వెళ్లి, 2025 మార్చి 25న ఫైనాన్స్ బిల్లుకు అనుబంధంగా పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని ఆమోదింపజేసుకుంది. ఆ చట్టంలో ‘2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు– ఆ తర్వాత రిటైర్ కాబోయే పెన్షనర్లు’ అనే విభజన రేఖ గీసింది. ఎనిమిదవ వేతన సవరణ సంఘం సిఫారసులు ఆ రిటైర్ కాబోయే పెన్షనర్లకు మాత్రమే వర్తించేటట్టు నిర్దేశించింది. అలా అంతకుముందు రిటైర్ అయిన పెన్షనర్లకు మొండి చెయ్యి చూపే అధికారాన్ని చేతుల్లో ఉంచుకుంది. ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలలో మూడవ అంశం దీన్నే సూచిస్తుంది.
దీని ఫలితంగా ధరలు ఎంత పెరిగినా, జీవన ప్రమాణాలు ఎంత ఎత్తుకు చేరుకున్నా, వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలకు ఆసుపత్రి ఖర్చుల భారం ఎంత మోయలేనిదైనా పెన్షనర్ల పెన్షన్ పెరగదు. బొటాబొటీ వచ్చే నెల భత్యంతో జీవితం సాగవలసిందే. ఇంతకుముందు వేతన సవరణ సంఘాలకు ఇచ్చే మార్గదర్శకాలలో, ‘ప్రపంచంలోని ఇతర దేశాలలో అమల్లో ఉన్న పెన్షన్ పథకాల్లో ఉత్తమ విధానాలను పరిశీలించి వాటిని మన దేశంలో ప్రవేశపెట్టే విధంగా ఆలోచించండి’ అనే సూచన ఉండేది. ఇది సంక్షేమ రాజ్యం అన్న స్పృహ ఈ సూచనలో వ్యక్తమయ్యేది. ఇప్పుడు ఆ మార్గదర్శకాన్ని తొలగించి ఈ మూడవ అంశాన్ని చేర్చింది మోదీ ప్రభుత్వం.
అయితే, ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించిన విషయమేననీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సురక్షితమనీ అనుకోవడానికి వీలు లేదు. ఎనిమిదవ వేతన సవరణ సంఘానికి ఇచ్చిన మార్గదర్శకాలలో నాలుగవ అంశంలో– వారు ఇవ్వబోయే సిఫారసుల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులపై ఏ విధంగా ఉంటుందో కూడా పరిశీలించమని పేర్కొన్నారు. అంటే– కేంద్ర వేతన సంఘం సిఫారసులను రాష్ట్రాలు అనుసరిస్తాయని చెప్పకనే చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ప్రవేశపెడితే పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు ఆ పథకాన్ని తమ ఉద్యోగులకు వర్తింపజేసాయి. ఆ తర్వాత పెన్షనర్ల, ఉద్యోగుల ఒత్తిడికి తలవంచి అయిదారు రాష్ట్రాలు పాత పద్ధతినే అనుసరిస్తున్నాయి.
పెన్షనర్లు ప్రభుత్వానికి భారం అనే పద్ధతిలోనే 2004 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పెన్షనర్లంటే అందరూ అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు. శ్రమించగలిగిన కాలాన్నంతా ఉద్యోగ జీవితంలోనే గడిపి నెలనెలా వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషించుకున్నవారు. వారిని వృద్ధాప్యంలో ఇలా వదిలివేయడం ఎంతవరకు సబబు?
మన రాష్ట్రంలో ఇప్పటికే పెన్షనర్లు పలు సమస్యలతో సతమతవుతున్నారు. పదవీ విరమణ పొందాక ప్రభుత్వం నుంచి రావాల్సిన, ఉద్యోగంలో ఉండగా తాము దాచుకున్న డబ్బులే రావటం లేదు. కరువు భత్యం వాయిదాలు పేరుకు పోతున్నాయి. పెన్షన్ సవరణ లేదు. ఆరోగ్య పథకం అమలు కాదు. ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా’ ఇప్పుడు వారిపై ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల రూపంలో మరో ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ఉద్యోగులు, పెన్షనర్లు సమష్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉద్యమ స్ఫూర్తితో తీవ్రమైన ఒత్తిడి తేవాలి.
రాజేంద్రబాబు అర్విణి
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 05 , 2025 | 02:35 AM