ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Zohran Mamdani: అమెరికాలో మొలకెత్తిన సోషలిస్ట్‌ ఆశలు

ABN, Publish Date - Nov 20 , 2025 | 05:11 AM

పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరానికి మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయఢంకా మోగించడంతో ప్రపంచ పెట్టుబడిదారుల ఆశలు అడియాశలయ్యాయి. ఆయన తనను తాను డెమొక్రటిక్ సోషలిస్టును అని...

పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థకు ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరానికి మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయఢంకా మోగించడంతో ప్రపంచ పెట్టుబడిదారుల ఆశలు అడియాశలయ్యాయి. ఆయన తనను తాను డెమొక్రటిక్ సోషలిస్టును అని ముందుగానే ప్రకటించుకుని ఎన్నికల రణరంగంలోకి రావడంతో పెట్టుబడిదారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ సహా వేలాది కార్పొరేట్ శక్తులు జోహ్రాన్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాయి. జోహ్రాన్ గెలిస్తే నగరాన్ని వదిలేసి వెళ్లిపోతామని వేలమంది పెట్టుబడిదారులు ఉక్రోషం వెళ్లగక్కారు.

పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ వేళ్లూనుకున్న అమెరికాలో తనను తాను సోషలిస్ట్‌ అని జోహ్రాన్‌ ప్రకటించుకోవటం ఆషామాషీ కాదు. ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి అక్కడి సమాజమే పురిగొల్పింది. ట్రంప్ పరిపాలన దేశంలో తీవ్ర అసమానతలకు దారితీసింది. దేశంలోని అధిక సంపన్నులకు అనుకూలంగా పన్ను సంస్కరణలను ట్రంప్‌ మొదలుపెట్టారు. వీటి ఫలితంగా 2027 నాటికి అత్యధిక ఆదాయం ఉన్న 0.1శాతం మంది చెల్లించే పన్నుల్లో నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో 3,11,000 యూఎస్ డాలర్లు తగ్గుతాయి. ఈ లోటు తీరేందుకు నెలకు 15వేల డాలర్ల కన్నా తక్కువ ఆదాయం గల కుటుంబాలపైనే పన్ను భారం పడుతుంది. ఇదంతా ఒక శాతం బిలియనీర్లను మరింత సంపన్నులుగా మార్చే ప్రక్రియలో భాగమే. ఈ అంశం కష్టించి పనిచేసే శ్రామిక వర్గంపై పెద్ద ప్రభావాన్ని చూపింది.

సామాజిక భద్రతకు పెట్టాల్సిన ఖర్చుల్లోనూ ట్రంప్ ప్రభుత్వం భారీ కోత విధించింది. ప్రజల సంక్షేమం కంటే లాభాలకే ట్రంప్ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. కార్పొరేట్ కాలుష్య కారకాల నియంత్రణను తొలగించారు. ప్రజా సేవలను ప్రైవేటీకరిస్తున్నారు. ఈ విధానాల కారణంగా అమెరికాలోని పదిమంది అత్యంత ధనవంతులైన బిలియనీర్లు 698 బిలియన్‌ డాలర్ల సంపదను పొందారు. ట్రంప్ విధానాలతోపాటు దశాబ్దాలుగా అమెరికా ఇతర పాలకులు అనుసరించిన పెట్టుబడిదారీ విధానాలపట్ల కూడా అక్కడి యువతలో నిరాసక్తత వ్యక్తమవుతూనే వస్తున్నది. ‘ఫ్రీ మార్కెట్‌కు మద్దతు’ పేరుతో పాలకులు అనుసరిస్తున్న విధానాల కారణంగా అమెరికా సమాజంపైనా, పాలకులపైనా కొద్దిమంది కార్పొరేట్ పెట్టుబడిదారులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారన్న సంగతిని అక్కడి ప్రజలు గ్రహించారు.

తమ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని నివారించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అమ్ముకునేందుకు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారన్న నిజాన్ని అమెరికా పౌరసమాజం గ్రహించింది. తన మాట వినని దేశాలపై భారీగా సుంకాలు విధించటాన్ని అక్కడి పౌర సమాజం బహిరంగంగానే వ్యతిరేకించింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అమెరికాలోని పేదల ఆకలి కేకలు మిన్నంటాయి. ట్రంప్ విధానాల కారణంగానే ప్రభుత్వం నుంచి తమకు అందే సంక్షేమ పథకాల నిధులు నిలిచిపోయాయన్న ఆగ్రహం పేదల్లో వ్యక్తమైంది. అమెరికాలో ‘సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎస్ఎన్ఏపీ) కింద ప్రభుత్వం నుంచి సుమారు 4.2 కోట్ల మంది ప్రతి నెల 200 నుంచి 900 డాలర్ల వరకూ ఆర్థిక సాయం అందుకుంటున్నారంటే ఆ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నదో గ్రహించవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బడ్జెట్‌ను అక్కడి చట్టసభ ఆమోదించకపోవడంతో ప్రభుత్వంలో ప్రతిష్టంభన (షట్‌డౌన్) పరిస్థితి నెలకొన్నది. లోపభూయిష్టంగా ఉన్న బడ్జెట్‌లోని వివిధ అంశాలను మార్పు చేయాల్సిన పరిస్థితి ఉండడంతో, అత్యవసర ఖర్చులకు మినహా ప్రభుత్వం ఎలాంటి వ్యయం చేసే వీల్లేకుండా పోవడంతో అమెరికన్ పేదల ఆకలి కేకలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎన్నికల ఫలితాల అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు.

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు తమను ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించే స్థితిలో లేవని అమెరికాలోని కొత్తతరం గ్రహించింది. నిరుద్యోగం, పేదరికం తీవ్రమయ్యాయి, ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉంటే కార్మిక వర్గానికి దక్కుతున్న వేతనాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిస్టు విధానాలే ప్రత్యామ్నాయమని గుర్తించి అమెరికా యువత సోషలిజం వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. ఇదే తరుణంలో జరిగిన ఎన్నికల్లో సోషలిస్టునని చెప్పుకున్న జోహ్రాన్ పట్ల అనూహ్యమైన స్పందన వ్యక్తమైంది.

జోహ్రాన్ తన ప్రచారంలో ప్రజలకు అత్యవసరమైన అంశాలపైనే దృష్టి పెట్టారు. తక్కువ ఖర్చుతో గృహవసతి, ప్రజా ఆరోగ్యం, కార్మిక హక్కులు, వలసదారుల రక్షణ, ఆర్థిక అసమానతల నిర్మూలన, విద్యలో సమాన అవకాశాలు... అంటూ తన ప్రచారాన్ని నిర్వహించారు. డెమొక్రటిక్ పార్టీ గతంలో ఎన్నడూ లేవనెత్తని అంశాలను ప్రచారానికి వాడుకున్నారు. కార్పొరేట్ వ్యవస్థకు భజన చేయకుండా సోషలిజం ఆలోచనా స్రవంతిలోని అందరికీ విద్య, ఉపాధి, నివాసం, ఆరోగ్యం కల్పిస్తూ; అసమానతలు, అణచివేత, జాత్యాహంకారం లేని వ్యవస్థ నిర్మాణానికి సిద్ధమని ప్రకటన చేశాడు. అత్యంత సంపన్నుల సంపదపై పన్నులు వేయడం ద్వారా తన హామీలను అమలు చేస్తాననీ పేర్కొన్నాడు. ఇవన్నీ సోషలిస్టు ఆలోచనలే కావడంతో న్యూయార్క్ పౌరులు జోహ్రాన్ వైపు నిలబడ్డారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమే లేదని ఆ వర్గానికి చెందిన ఆర్థికవేత్తలు, మేధావులు ఢంకా బజాయిస్తున్న తరుణంలో సోషలిజం అనే ఒక బలమైన ప్రత్యామ్నాయం ఉందని జోహ్రాన్ ఎన్నిక నిరూపించింది. కారుచీకటిలో వెలుగు రేఖలా అమెరికాలో ఆశాకిరణాలు ప్రసరించాయి. జోహ్రన్ చేతల్లో నిరూపించుకుంటే, అమెరికా వ్యాప్తంగా సోషలిస్టు వ్యవస్థలు బలపడటం తథ్యం!

సి.ఎన్. క్షేత్రపాల్‌రెడ్డి

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:11 AM