ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MGNREGA: జీ రామ్‌ జీ మహాత్ముని రెండో హత్య

ABN, Publish Date - Dec 20 , 2025 | 06:18 AM

మహాత్మాగాంధీని 1948, జనవరి 30న హత్య చేశారు. ఆ దురాగతానికి పాల్పడిన హంతకుడిని తన భావజాలమూ, ప్రచారమూ పురిగొల్పాయన్న ఆరోపణను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తీవ్రంగా....

మహాత్మాగాంధీని 1948, జనవరి 30న హత్య చేశారు. ఆ దురాగతానికి పాల్పడిన హంతకుడిని తన భావజాలమూ, ప్రచారమూ పురిగొల్పాయన్న ఆరోపణను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ తీవ్రంగా తిరస్కరించింది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ తమ కార్యకలాపాలపై విధించిన నిషేధం పూర్తిగా న్యాయ విరుద్ధమని సంఘ్‌ వాదించింది. ఆరెస్సెస్‌ వాదనను మాట వరసకు ఒప్పుకుందాం. అయితే ‘సంఘ్‌’కు, దాని ఆశీస్సులతో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీకి ఒక ప్రశ్నను సంధిద్దాం: అపూర్వ సామాజిక–ఆర్థిక కార్యక్రమం అయిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ పేరు నుంచి మహాత్మాగాంధీని ఎందుకు తొలగించారు?

జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ప్రారంభించిన ‘మహాత్మాగాంధీ నేషనల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారెంటీ స్కీమ్‌’ (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పార్లమెంటు చట్టం ఆధారంగా ఉనికిలోకి వచ్చింది. ఆ ‘ఉపాధి హామీ’ చట్టాన్ని, పథకాన్ని రద్దుచేసేందుకై ప్రభుత్వం ఒక బిల్లు (నెంబర్‌ 197/2025)ను ప్రవేశపెట్టింది (గురువారం నాడు లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది). ఆ బిల్లులోని సెక్షన్‌ 37(1) ఇలా ఉన్నది: ‘సెక్షన్‌ 10లో పేర్కొన్న విధంగా ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌ ప్రకారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 సమస్త నియమ నిబంధనలు, నోటిఫికేషన్లు, పథకాలు, ఉత్తర్వులు, మార్గదర్శక సూత్రాలు రద్దవుతాయి.’ ఆ బిల్లు ఇంకా ఇలా పేర్కొంది: ‘సెక్షన్‌ 8(1)కు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికీ 125 రోజులపాటు వేతన ఆధార ఉపాధికి హామీనిచ్చే ఒక పథకాన్ని రూపొందించాలి; బిల్లు మొదటి షెడ్యూలులో నిర్దిష్టంగా పేర్కొన్న అంశాలను అనుసరించాలి. ఆ షెడ్యూలులోని మొదటి అంశం– చట్టంలోని సెక్షన్‌ 8 కింద అన్ని రాష్ట్రాలు నోటిఫై చేసే పథకం పేరు ఇలా ఉండి తీరాలి: ‘‘వికసిత్‌ భారత్‌– గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ్‌): వీబీ– జీ రామ్‌ జీ స్కీమ్‌’’. చట్టం పేరు సంక్లిష్టంగా ఉన్నది. హిందీయేతర భాషల వారికి అర్థంకాని విధంగా కూడా ఉన్నది. అటువంటి భారత పౌరులను అవమానించడమో లేదా నిరాదరించడమో కాదా అది?

ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుపరిచిన ఉపాధి హామీ పథకం గ్రామీణ భారతంలో 12 కోట్ల కుటుంబాల మనుగడకు జీవనాడిగా వర్ధిల్లింది. ఏ రోజూ ఆకలి మంటలతో, రేపటి రోజుపై నిరాశా నిస్పృహలతో నిద్రకు ఉపక్రమించాల్సిన అగత్యాన్ని కోట్లాది కుటుంబాలకు ఆ ఉపాధి హామీ తొలగించింది. అది పేదలను ఉద్ధరించింది. నిరుపేదలను ఆదుకున్నది. ముఖ్యంగా క్రమబద్ధమైన ఆదాయం లేని మహిళలు, వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించింది. మహిళలకు ఆదాయాన్ని సమకూర్చడం ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సమకూర్చింది. కుటుంబంలోనూ, సమాజంలోనూ వారికొక సాధికారత కల్పించింది. తమ అమ్మమ్మలు, నాన్నమ్మలు ఊహించలేని ఆర్థిక సాధికారత ఈ తరం గ్రామీణ మహిళలకు సమకూరడంలో ఉపాధి హామీ పథకం పాత్ర విస్మరించలేనిది. పేదలు, నిరుపేదలు కించిత్‌ నిశ్చింతగా బతికేలా చేసింది. మోదీ సర్కార్‌ సంకల్పించిన చట్టం కోట్లాది కుటుంబాలకు ఈ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను క్రూరంగా కాలరాసింది.

యూపీఏ ప్రభుత్వ మొదటి బడ్జెట్‌ (2004–05) ప్రసంగంలో నేను ఇలా చెప్పాను: ‘బడ్జెట్‌ సమస్త కేటాయింపుల మొదటి లబ్ధిదారులు పేదలే కావాలనేది మా అభిమతం. ఆ సంకల్పంతోనే జాతీయ ఉపాధి హామీ చట్టం అమలుకు చురుగ్గా చర్యలు చేపడుతున్నాం. పేద కుటుంబాలలో శారీరక శ్రమ చేయగల ప్రతి వ్యక్తికీ ఏడాదికి 100 రోజులపాటు తప్పనిసరిగా ఉపాధి కల్పించేందుకు హామీ పడడమే మా లక్ష్యం...’ ‘జీవనోపాధి భద్రతకు హామీ’ అనేది ఆ చట్టం ఆత్మ. దాని ప్రధాన లక్షణాలు: ఉపాధి హామీ పథకం సార్వజనీనమైనది. డిమాండ్‌ ఆధారితమైనది. ఏడాది పొడుగునా అది అమలవుతూనే ఉంటుంది; ఉపాధి హామీ లబ్ధిదారుల వేతనాలు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది; ఈ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం సమకూరుస్తుంది. పనులకు అవసరమైన సామగ్రి వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది; ఉపాధి కల్పనకు తిరస్కృతుడైన వ్యక్తి నిరుద్యోగ భృతికి అర్హుడు; భవిష్యత్తులో మహిళా శ్రామికులకు మరింత ప్రయోజనకరంగా ఈ పథకాన్ని అమలుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం సంకల్పించిన కొత్త చట్టమూ, పథకమూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రయోజనాలు అన్నిటినీ ధ్వంసం చేసింది. కొత్త చట్టం ప్రకారం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి. దాని అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి నియమ నిబంధనల ప్రకారం నిధులు కేటాయిస్తుంది. అమలు వ్యయాలు కేంద్రం కేటాయింపుల కంటే అదనంగా ఉన్న పక్షంలో ఆ అదనపు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించి తీరాలి. ఏ ఏ ప్రాంతాలలో పథకం అమలవుతుందో కేంద్ర ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది! ఇది డిమాండ్‌ ఆధారిత పథకాన్ని దొంగచాటుగా సరఫరా ఆధారిత పథకంగా మార్చివేయడమే కాదూ? రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి 125 రోజుల చొప్పున గ్రామీణ పేదల కుటుంబాలకు ఉపాధి కల్పన చేయడమనేది ఒక భ్రమ మాత్రమే. అది అసంభవం. వ్యవసాయ పనులు– నాట్లు, కోతలు, నూర్పిళ్లు– ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఈ కొత్త పథకం అమలును నిలిపివేస్తారు. ఈ సేద్య కార్యకలాపాలు ముమ్మరంగా ఉన్న దినాలను ముందుగా నోటిఫై చేస్తారు. మొత్తం మీద వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండే రోజులు 60గా ఉంటాయని కొత్త చట్టం నిర్మాతలు పరిగణిస్తున్నారు. నిరుద్యోగ భృతిగా, నోటిఫై చేసిన వేతనంలో 25శాతం మాత్రమే ఇస్తారు. పైగా ఇందుకు అనేక షరతులు విధించారు. ముఖ్యంగా సంబంధిత రాష్ట్ర ఆర్థిక సత్తువ ఆధారంగా నిరుద్యోగ భృతి చెల్లింపు ఉంటుంది.

ఫిబ్రవరి 28, 2015న పార్లమెంటులో నరేంద్ర మోదీ ఇలా చెప్పారు: ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేయకూడదని నా రాజకీయ వివేకం ఘంటాపథంగా చెబుతోంది... అది మీ (యూపీఏ ప్రభుత్వ) వైఫల్యాలకు ఒక సజీవ స్మారక చిహ్నం’. సరే, చెప్పేదేముంది, మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆ ఉపాధి హామీ పథకం క్రమేణా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. 100 రోజుల ఉపాధి కల్పనకు హామీ ఇచ్చినప్పటికీ ఆ పనిదినాల సంఖ్యను ఒక్కో కుటుంబానికి 50 చొప్పున తగ్గించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జాబ్‌కార్డులు ఉన్న 8.61 కోట్ల మందిలో 40.75 శాతం కుటుంబాలవారే పూర్తిగా 100 రోజుల ఉపాధి పొందగలిగారు. 2025–26లో అయితే ఈ లబ్ధిదారుల సంఖ్య 6.74 లక్షల కుటుంబాలకు తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అయిన నిరుద్యోగ భృతి చెల్లింపు అరుదుగా మాత్రమే జరిగింది. ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు కూడా తగ్గిపోయాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,11,170 కోట్ల నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్లకు పడిపోయింది. ఉపాధి పని పొందుతున్న కుటుంబాల సంఖ్య కూడా 2020–21లో 7.55 కోట్ల నుంచి 2024–25లో 4.71 కోట్లకు తగ్గిపోయింది. లబ్ధిదారుల వేతన బకాయిలు రూ.14,300 కోట్ల మేరకు పేరుకుపోయాయి.

మోదీ సర్కార్‌ వికసిత్‌ భారత్‌ జీ–రామ్‌–జీ బిల్లు లోపభూయిష్ఠమే కాకుండా జాతి జ్ఞాపకాల నుంచి మహాత్మాగాంధీని తోసివేసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం కూడా. ఈ అధికార ఔద్ధత్యం పూర్తిగా గర్హనీయం (వలస పాలకులకు వ్యతిరేకంగా సమస్త భారతీయులు పోటెత్తిన రోజుల్లో ప్రజలు పాడుకున్న ఒక పాట నా మనసులో ప్రతిధ్వనిస్తోంది: ‘గాంధీ నామం మరువాం, మరువాం!’ భారతీయ జనతా పార్టీ అభిప్రాయంలో స్వతంత్ర భారతదేశ చరిత్ర 2014, మే 26న ప్రారంభమయింది. మహోన్నత చరిత్రను చెరిపివేసేందుకో లేక తమకు అనుకూలంగా పునర్లిఖించేందుకో బీజేపీ ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. జవహర్‌లాల్‌ నెహ్రూకు వ్యతిరేకంగా మొదలైన ఆ ప్రయత్నాలు ఇప్పుడు మహాత్మాగాంధీకి చేరాయి. అవన్నీ నిస్సందేహంగా భారతీయ నాగరికతా ధర్మానికి విరుద్ధమైనవి. బీజేపీ తప్పులను భారత ప్రజలు క్షమించరు, క్షమించబోరు.

పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:18 AM