Chandrababu Naidu: ఐటీ టు ఏఐ.. చంద్రబాబు సాంకేతిక విప్లవం
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:12 AM
పరిపాలనలో పారదర్శకత, సమర్థతతో పాటు ప్రజలతో సమన్వయం పెంచేందుకు ఇనఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా ప్రజలకు సేవలు అందించే నూతన సంస్కరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
పరిపాలనలో పారదర్శకత, సమర్థతతో పాటు ప్రజలతో సమన్వయం పెంచేందుకు ఇనఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా ప్రజలకు సేవలు అందించే నూతన సంస్కరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐటీ, ఏఐని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సేవల్లో ఎన్నో సంస్కరణలను తీసుకువస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన ఆసాంతం జనవరి 15లోగా ఆన్‌లైన్ చెయ్యాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ పనితీరు పట్ల వారిలో సంతృప్తస్థాయి పెంచనున్నారు. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేయాలని నిర్ణయించారు.
అంతర్జాతీయ అధునాతన సాంకేతికతలపై దృష్టిపెట్టి క్వాంటం టెక్నాలజీ సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ను వనరుల కేంద్రంగా మార్చేందుకు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ హబ్ 2026 జనవరి 1న ప్రారంభించనున్నారు. రూ. 6,000 కోట్లతో జాతీయ క్వాంటం మిషన్ ద్వారా భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చే లక్ష్యంగా అమరావతిలో టెక్ పార్క్ నిర్మిస్తున్నారు. దేశంలో క్వాంటం కంప్యూటింగ్, టెక్నాలజీ, పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ క్వాంటం వ్యాలీ. ఇది అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఇక్కడ ఏఐ, ఐటీ, ఫార్మా, నిర్మాణరంగ సంస్థలు, స్టార్టప్స్, పరిశోధన కేంద్రాలు, డేటా సెంటర్లు, హైటెక్ ల్యాబ్స్ నిర్మాణం కానున్నాయి. నూతన డ్రగ్స్ ఆవిష్కరణ, ఆర్థిక విశ్లేషణలు, ట్రేడింగ్ స్ట్రాటజీలు, కోడింగ్, డేటా షేరింగ్, కాలిక్యులేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, వాతావరణ పరిస్థితుల అంచనాలు వంటి అన్ని రంగాల్లో సాధారణ కంప్యూటర్ కంటే క్వాంటం కంప్యూటర్లు అత్యంత వేగంగా పనిచేస్తాయి.
ఆనాడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఎలా విస్తరించిందో, ఈ క్వాంటం వ్యాలీ కూడా అంత పెద్ద ఎత్తున రానున్న పదేళ్లలో పురోగమిస్తుందని కంప్యూటర్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే వ్యవస్థ ద్వారా అనుసంధానించి వీటి ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్, డేటా, వాయిస్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. 2001లో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు ఈ–సేవా కేంద్రాలను ప్రారంభించింది చంద్రబాబే. వీటి ద్వారా బిల్లులు చెల్లింపు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు, టికెట్లు వంటి సేవలను ప్రజలు వినియోగించుకున్నారు. విశాఖపట్నంను ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2016లో ఫిన్‌టెక్ వ్యాలీని ప్రారంభించారు చంద్రబాబు. ఈ వ్యాలీలో బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో పెట్టుబడులను ఆకర్షించారు. ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధానిగా విశాఖ ఎదగడానికి ఫిన్‌టెక్ వ్యాలీ ఎంతగానో దోహదపడింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్‌ను కూడా చంద్రబాబే ప్రారంభించారు. ఇది డిజిటల్ సేవలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది.
వైద్య పరికరాల తయారీకి దేశంలోనే కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకొని 2016లో విశాఖలో ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ స్థాపనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందులో 140కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించాయి. ఇవి ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దశలో రాపిడ్ కిట్లను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే వాతావరణ సమాచారం, డ్రోన్లు, బయోమెట్రిక్ వ్యవస్థ, ఇతర సాంకేతికతల ద్వారా డేటాను రియల్ టైమ్‌లో సేకరించి పరిపాలనలో సమర్ధతను పెంచేందుకు 2017లో రియల్ టైం గవర్నెన్స్‌ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2024లో అమరావతిలో డ్రోన్ సమ్మిట్‌ను సీఎం చంద్రబాబు నిర్వహించారు. దీని ద్వారా వ్యవసాయ, రవాణా, ప్రజా సేవలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే పోలీసు విభాగంలో డ్రోన్ వినియోగాన్ని పెంచి, ట్రాఫిక్‌ను తగ్గించడం, నేరాలు, అసంఘటిత కార్యకలాపాలు నియంత్రించేందుకు డ్రోన్లు డేగల వలే కాపు కాస్తున్నాయంటే అందుకు సీఎం చంద్రబాబు దార్శనికతే కారణం.
దేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్‌కు మంత్రి నారా లోకేశ్ నాంది పలికారు. వాట్సాప్ ద్వారా 700 సేవలు అందించాలని మన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం వాట్సాప్‌లో హాయ్ అని టైప్ చేస్తే చాలు వినియోగదారుడి చేతుల్లోకే సేవలు వచ్చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు నేరుగా సమాచారం అందించడమే కాకుండా ప్రభుత్వ కార్యాచరణలపై పారదర్శకత పెరుగుతుంది. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్‌లో నివేదించడం, వీటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించనున్నది.
విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారుతున్నది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక్కొక్కటి విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం హర్షణీయం. ఈ నేపథ్యంలో విశాఖ రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ స్టార్టప్ కేంద్రంగా మారే అవకాశం ఉంది.
తొండపు దశరథ జనార్ధన్
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 06:12 AM