ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Artificial Intelligence In Education: బాలలకు కృత్రిమ మేధ అవసరమా

ABN, Publish Date - Oct 28 , 2025 | 12:48 AM

వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో పాఠశాల విద్యలో మూడవ తరగతి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించింది. డిజిటల్‌...

వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో పాఠశాల విద్యలో మూడవ తరగతి నుంచి కృత్రిమ మేధ (ఏఐ) పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించింది. డిజిటల్‌ టెక్నాలజీల ఏకీకరణతో రూపొందే ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా భావి శ్రామికశక్తిని తీర్చిదిద్దే లక్ష్యంతో పాఠశాల స్థాయి నుంచి ఏఐ పాఠ్య ప్రణాళికను అమలుపరచనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని అనుసరించి రాష్ట్రాల విద్యా మంత్రిత్వశాఖలు కూడా ఏఐ పాఠ్య ప్రణాళికలను రూపొందించేందుకు పూనుకున్నాయి.

విద్యార్థులకు ఏఐ పరిజ్ఞానాన్ని బోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో ‘SOAR Initiative (Skilling for AI Readiness)’ను ప్రారంభించింది. దీని ద్వారా సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌)కు అనుబంధంగా ఉన్న దాదాపు 18 వేల పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి ఏఐను ఒక ‘నైపుణ్య విషయం’గా బోధిస్తున్నారు. 6, 7, 8 తరగతులకు మూడు విభిన్న ‘15 గంటల’ బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కృత్రిమ మేధపై బాలలకు అవగాహన కలిగించడం, దానిని ఆచరణాత్మకంగా అనువర్తింపచేయడం, ఏఐ వినియోగంలో ఉత్పన్నమయ్యే సామాజిక చిక్కులను పిల్లలు అర్థం చేసుకోవడమే ఈ కార్యక్రమాల లక్ష్యంగా ఉన్నది. ఇక 9, 10, 11, 12 తరగతులకు ‘150 గంటల’ ఎలెక్టివ్‌ కోర్సుల (విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తులు, భావి వృత్తి జీవిత లక్ష్యాలు లేదా తమ ప్రధాన పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా కొత్త విషయాలను అధ్యయనం చేయడం ఆధారంగా ఎంచుకునే ఐచ్ఛిక కోర్సులు)ను బోధిస్తున్నారు. చాలా కొద్ది విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది సైన్స్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏఐ కోర్సులను తప్పనిసరి చేశాయి. సమస్త విద్యా విభాగాలకు ఏఐ బోధన తప్పనిసరికాదు. కనుక ఆలోచనాపరులు ఒక ప్రశ్న అడిగి తీరాలి: పాఠశాలల్లో ఏఐ బోధనకు ఇంత తొందర ఎందుకు? కృత్రిమ మేధ మన జీవితాలను పలు విధాలా ప్రభావితం చేయనున్నదనడంలో సందేహం లేదు. ‘ప్రపంచ ఏఐ ప్రమాణాలను రూపొందించడంలోను, ఏఐ సాంకేతికతల అభివృద్ధి, అనువర్తనాలలోను ప్రధానపాత్ర వహించాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. దీనిపై ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయితే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏఐ బోధన తప్పనిసరా?

డిజిటల్‌ అంతరాలను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల; వనరులు తక్కువగా ఉన్న సామాజిక వర్గాల విద్యార్థులకు అవకాశాలను అందించేందుకు ‘SOAR Initiative’ ఇతోధికంగా తోడ్పడుతుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. డిజిటల్‌ సాధనాలను ఉపయోగించనివారు, అసలు వాటిని ఎలా ఉపయోగించాలో తెలియని విద్యార్థులు, ఉపాధ్యాయులే మన విద్యారంగంలో అత్యధికంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డిజిటల్‌ అంతరాలను తగ్గించడమనే లక్ష్యం నెరవేరుతుందా? ఒక సాదృశ్యంతో ఈ విషయాన్ని మరింత వివరంగా పరిశీలిద్దాం. గత మూడు దశాబ్దాలుగా మొబైల్‌ ఫోన్‌ మన జీవితాలను అనేక రీతుల్లో అమితంగా ప్రభావితం చేస్తోంది. మన వైయక్తిక జీవితాలనే కాకుండా సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను మౌలికంగా మార్చివేసింది. అంతమాత్రాన ‘మొబైల్‌ ఫోన్‌ ఎలా పనిచేస్తుంది?’ అనే అంశాన్ని బాలలకు మూడవ తరగతి నుంచే బోధించి తీరాలా? మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించాల్సిన తీరుతెన్నులను పాఠశాల బాలలకు బోధించాలి. అయితే ఎప్పుడు? ఆ సాంకేతికతను మెరుగ్గా అర్థం చేసుకుని, ఉపయోగించుకోగల సామర్థ్యాన్ని అలవరచుకున్నప్పుడు. భద్రంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని బాలలకు పాఠశాలలు నేర్పాలి. అది సమకూర్చే విద్యా ప్రయోజనాలను బాలలు పొందగలిగేలా చూడాలి.

‘పాఠశాలల్లో ఏఐ బోధన’ అనే మాటను పలువురు పలు విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఉద్దేశించిన అర్థాల వెనుక ఉన్న గణనీయమైన గందరగోళాన్ని ఆ మాట దాచిపెడుతోంది. ‘ఏఐ అక్షరాస్యత’ అని కొంత మంది అస్పష్టంగా నిర్వచిస్తుండగా మరికొంత మంది తరగతి గదుల్లో ఏఐ సాధనాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలనే అర్థంలో ఆ మాటను వాడుతున్నారు. ఉపాధ్యాయుల బోధనా కౌశలాలు, ఇతర విధుల నిర్వహణా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఏఐను ఉపయోగించుకోవాలనే అర్థంలో వాడుతున్నారు. వ్యక్తిగతీకరించిన అభ్యాసం (Personalised learning- ప్రతి విద్యార్థి ప్రత్యేక అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలను తీర్చడానికి బోధనా పద్ధతులు, బోధనాంశాలను అనుకూలంగా చేసే విద్యా విధానం) గురించి ఏఐని అభివృద్ధిపరుస్తున్న నిపుణులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థి వ్యక్తిగత విద్యా పురోగతి గురించి మాట్లాడుతోంది. ఈ అయోమయ పరిస్థితిలో సమగ్ర అవగాహనతో ఏఐ సాధనాలను ఉపయోగించడాన్ని బాలలకు ఏఐని బోధించడం నుంచి తప్పనిసరిగా వేరు చేయాలి.

ప్రస్తుతం అమలుపరుస్తున్న ఏఐ పాఠ్య ప్రణాళికను నిశితంగా పరిశీలిద్దాం. ప్రాథమికోన్నత పాఠశాల ఏఐ పాఠ్య ప్రణాళిక మూడు ఏఐ సాంకేతిక విభాగాలను ప్రవేశపెట్టింది. అవి: కంప్యూటర్‌ విజన్‌, సహజ భాషా ప్రాసెసింగ్‌, స్టాటిస్టికల్‌ డేటా. ఏడవ తరగతి పాఠ్యపుస్తకం సుస్థిరాభివృద్ధికి పరిస్థితులను అనుకూలపరచడంలోను, సామాజిక అభివృద్ధి సాధనలోను ఏఐ వినూత్న పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సిస్టమ్స్‌ థింకింగ్‌ (సమస్యల పరిష్కారానికి సమగ్రమైన రీతిలో ఆలోచించడం), సిస్టమ్స్‌ మ్యాప్స్‌ (ఒక సంక్లిష్ట వ్యవస్థ భాగాలు ఎలా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో వివరించే దృశ్య ప్రాతినిధ్యాలు) మొదలైన భావనలకు కూడా ప్రాధాన్యమిచ్చింది. 8వ తరగతి విద్యార్థులు ‘ఏఐ ప్రాజెక్టులు’, ‘ఏఐ నైతికత, బాధ్యతాయుతమైన ఏఐ ఆచరణలు’ గురించి నేర్చుకుంటారు. 9వ తరగతి పుస్తకం ఏఐకు అవసరమైన గణితం, జెనరేటివ్‌ ఏఐ గురించి చర్చించింది. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో పర్యవేక్షిత, పర్యవేక్షించని అభ్యాస నమూనాలు, క్లస్టరింగ్‌ (సారూప్యత ద్వారా డేటాను సమూహపరచడానికి పర్యవేక్షితంకాని అభ్యాస పద్ధతి), న్యూరల్‌ నెట్‌వర్క్‌లు (సంక్లిష్ట నమూనాను గుర్తించేందుకు తోడ్పడే శక్తిమంతమైన సాధనాలు) మొదలైన అంశాలు ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే ఈ అంశాలన్నిటినీ పాఠశాల స్థాయి బాలలు అర్థం చేసుకోగలరా? వాటి సారాన్ని గ్రహించగలరా? సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలలో ఏకీకరణ ప్రక్రియ ద్వారా పొందుపరిచి ఉండే అభ్యాస నమూనాలను వారు అవగాహనతో అనుసరించగలుగుతారా? తాము నేర్చుకుంటున్న గణితం, సైన్స్‌తో వీటిని వారు ఎలా జోడించగలుగుతారు? ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సామాజిక అభివృద్ధి’ అనే అంశాలను బాలలు ఎలా అర్థం చేసుకుంటారు? సిస్టమ్‌ మ్యాప్స్‌ను వారు ఎలా ఉపయోగించగలుగుతారు? ఈ భావనలు, పద్ధతులను అర్థం చేసుకునేందుకు మానసిక పరిణతి అవసరం. మరి వాటిని బాలలకు సుబోధకం చేసేందుకు ఎటువంటి బోధనాశాస్త్ర విధానాలు అవసరమవుతాయి?

సీబీఎస్‌ఈ ఏడవ తరగతి ఏఐ పాఠ్య ప్రణాళికలోని ఈ ప్రశ్నను పరిశీలనలోకి తీసుకోండి: ‘జెండర్‌ సమానత్వం, మహిళల, బాలికల సాధికారతను ఏఎస్‌డీజీ (సుస్థిరాభివృద్ధి లక్ష్యం) స్పష్టంగా నిర్దేశించింది? (1) ఎస్‌డీజీ–3; (2) ఎస్‌డీజీ–5; (3) ఎస్‌డీజీ–8; (4) ఎస్‌డీజీ–10’. సదరు ఎస్‌డీజీ సంఖ్య ఏదనేది అంత ముఖ్యమా? అలాగే, ఏఐ ఎలా పనిచేస్తుందో విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. ఈ అభ్యసన ప్రక్రియ కృత్రిమ మేధను ఉపయోగించడంపై బాలల్లో విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించాలి. అయితే పైన ప్రస్తావించిన ‘ప్రశ్న పద్ధతి’ అటువంటి మేధో ప్రావీణ్యాన్ని బాలల్లో వికసింపజేస్తుందా? విజ్ఞానశాస్త్రాల బోధన ద్వారా విమర్శనాత్మకంగా ఆలోచించడాన్ని విద్యార్థులకు అలవర్చడంలో మనం పెద్దగా సఫలం కాలేదు. మరి ఏఐ అక్షరాస్యత ద్వారా విమర్శనాత్మక వివేచనను వికసింపజేయడమనేది అవాస్తవిక ఆశాభావం అవుతుంది. పాఠశాలల్లో ఏఐ బోధనకు సంబంధించిన ప్రశ్న ‘అవును లేదా కాదు’ అనే సమాధానం వచ్చే రీతిలో వేయవలసిన ప్రశ్న కాదు. అంతకంటే వివరణాత్మక సమాధానాన్ని చెప్పవలసిన రీతిలో ఆ ప్రశ్న ఉండి తీరాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే విద్యాపరమైన శిక్షణకు సంబంధించిన ప్రశ్నగా ఉండాలి. జ్ఞాన/ నైపుణ్యాల సముపార్జనకు దోహదం చేసే అంశాలు అన్నిటినీ సమగ్రంగా పరిగణనలోకి తీసుకునే ప్రశ్నగా ఉండాలి. అభ్యసన ప్రక్రియల్లో బాలల మానసిక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

ఏఐ బోధన విషయమై కొన్ని ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవల్సి ఉన్నది. కృత్రిమ మేధ కేవలం ‘తాత్కాలిక నవ సాంకేతికతా సంచలనమే’ అని కొంతమంది వాదిస్తున్నారు. గత శతాబ్ది తుదినాళ్ల ‘డాట్‌ కామ్‌ బబుల్‌’తో కూడా దీనికి పోలిక తెస్తున్నారు. పాఠశాలలు జ్ఞాన/ నైపుణ్యాల సముపార్జనా నెలవులు. భవిష్యత్తుకు దృఢమైన పునాదులు నిర్మాణమయ్యే ప్రదేశాలవి. కొట్టివేయలేని ఈ వాస్తవం దృష్ట్యా నవ సాంకేతికతల విజృంభణ (టెక్నలాజికల్‌ బూమ్‌) ఒత్తిడితో పాఠశాలల విధులను నిర్దేశించడం లేదా ప్రభావితం చేయడం విద్యారంగ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దోహదం చేయదు. సమాజానికి మేలు జరగదు. కృత్రిమ మేధ బలీయమైన ఆకర్షణ గల అధునాతన సాంకేతికత. అంతేకాదు, దాన్ని వినియోగించుకునే అలవాటు వదిలించుకోలేని వ్యసనంగా మారుతుంది. భావి పౌరులను తీర్చిదిద్దే విద్యాలయాలలో ఈ నవ సాంకేతికతను ఉపయోగించడంపై నిర్ణయాలను నిష్పాక్షిక వివేచన, సమగ్ర అవగాహన, నిశిత అంతర్దృష్టితో కూడిన సామాజిక వివేకంతో తీసుకోవల్సివుంది. మరి మనం అటువంటి జ్ఞానశీలురమేనా?

ఆర్‌. రామానుజం

అజిమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు

(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:48 AM