Culture Curse or Blessing: సంస్కృతి శాపమా వరమా
ABN, Publish Date - Oct 24 , 2025 | 02:21 AM
సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడటం మనకు అసాధ్యం. భూమ్మీద ఉన్నంతవరకూ గురుత్వాకర్షణను తప్పించుకోవటం ఎలా సాధ్యపడదో సంస్కృతి విషయంలోనూ...
సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడటం మనకు అసాధ్యం. భూమ్మీద ఉన్నంతవరకూ గురుత్వాకర్షణను తప్పించుకోవటం ఎలా సాధ్యపడదో సంస్కృతి విషయంలోనూ మన పరిస్థితి అంతే! మనల్ని బంధించేది గురుత్వాకర్షణ శక్తి అని గుర్తించిన తర్వాతే దాన్ని అధిగమించే నియమాలను కనిపెట్టి అంతరిక్ష విన్యాసాలను చేయగలుగుతున్నాం. ఆకాశ ప్రయాణాలను సాగించగలుగుతున్నాం. అట్లాగే సంస్కృతిలో మంచిచెడులను గుర్తిస్తేనే మంచిని పెంచగలం. చెడుని తుంచగలం. ఒకనాటి పాశ్చాత్య ఆధిపత్యానికి సంస్కృతే కారణమని గట్టిగా వాదించే ఆర్థిక చరిత్రవేత్త జోల్ మోకియర్ ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. పాశ్చాత్య సంస్కృతి ఒక్కదానికే ఆ శక్తి ఎట్లా వచ్చింది? మిగతా వాటిల్లో అదెందుకు లేదు? మోకియర్ ప్రతిపాదనల లోతుల్లోకి వెళితేనే నిజం కొంత తెలుస్తుంది.
ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ప్రతిపాదించటం విజ్ఞానశాస్త్ర గతినే మార్చేసింది. ఇది అందరికీ తెలిసిందే. న్యూటన్ ముందూ తర్వాతా ఎందరో మహామహులు తమ ప్రయోగాలు, పరిశీలనలు ఆధారంగా విశ్వం స్వరూప, స్వభావాలను వర్ణించి మన ఆలోచనల్లో సమూల మార్పులు తెచ్చారు. అనుభవ జ్ఞానం ఆధారంగానే మన అభిప్రాయాలను ఏర్పరుచుకోవాలనీ నిర్దేశించారు. పెద్దలు చెప్పారనో, పవిత్ర గ్రంథాలు పేర్కొన్నాయనో భావిస్తూ పరిశీలనాశక్తిని కొండెక్కిస్తే మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని మన అవసరాలకు అనుగుణంగా సమర్థంగా ఉపయోగించుకోలేమనీ తేల్చిచెప్పారు. మనుషులు పారిశ్రామిక విప్లవంలోకి అడుగు పెట్టటానికి ప్రయోగ–పరిశీలన ఆధార ఆలోచనలే ప్రధాన కారణమయ్యాయి.
మరి ఈ ఆలోచనలు యూరపులోనే పరిపక్వతను పొంది, అక్కడే పారిశ్రామిక విప్లవానికి ఎందుకు దారితీశాయి? వేల సంవత్సరాల నాగరికతలకు నిలయాలైన ఆసియా, ఆఫ్రికా ఖండాలు ఆ పరిణామానికి తొలుత ఎందుకు దూరంగా ఉండిపోయాయి? కారణం ఎక్కడ ఉంది? ఆ లోపానికి బాధ్యులెవరు? ఆసియా, ఆఫ్రికాలకు కాలం కలిసి రాలేదా? ప్రకృతిలోని అసమానతలే అందుకు దోహదం చేశాయా? సంప్రదాయాలూ, సంస్కృతులూ కొత్త ఆలోచనలకు ప్రతిబంధకాలయ్యాయా? ఇవన్నీ కీలక ప్రశ్నలు. అన్నీ పారిశ్రామిక విప్లవం చుట్టూ తిరిగేవే. పారిశ్రామిక విప్లవం కొన్ని దేశాలకు ఆధిపత్యాన్ని కట్టబెడితే, కొన్ని దేశాలకు పరాధీనతను ప్రసాదించింది. ధనిక–పేద దేశాలను సృష్టించింది. వలసరాజ్యాలు, సామ్రాజ్యాల ఏర్పాటుకు దారితీసింది. ఒక్కమాటలో చెప్పాలంటే పారిశ్రామిక విప్లవానికి సాటిరాగలిగిన విప్లవం మానవజాతి చరిత్రలోనే లేదు. అంతటి ప్రభావం చూపించిన పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన కారణాలను మోకియర్ విశ్లేషిస్తే, దాని తదనంతరం ఏర్పడిన ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మక విధ్వంసం ద్వారా వచ్చే సాంకేతిక మార్పులను ఆయనతో పాటు నోబెల్ బహుమతిని పంచుకున్న ఫిలిప్పే ఆగియన్, పీటర్ హౌయిట్‌లు పరిశోధించారు.
మనం సంస్కృతి అనే పదాన్ని తరచూ చాలా పరిమిత అర్థంలో వాడతాం. సామాజికశాస్త్రాల్లో దానికి చాలా విస్తృతార్థం ఉంది. సంప్రదాయాలు, పూజలు, ఆరాధనా పద్ధతులు, కుటుంబ సంబంధాలు, మంచీచెడులు, ధర్మాధర్మాలు, నైతిక ప్రవర్తనలు, బాధ్యతలు లాంటివన్నీ సంస్కృతిలో భాగమే. కానీ వీటన్నిటికంటే మించింది వివేచనాశక్తి. హేతుబద్ధంగా ఆలోచించగలిగే తత్వం. కాలక్రమంలో సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలు ముందుకాళ్లకు బంధనాలుగా మారతాయి. వాటిని తొలగించుకునే శక్తి కూడా సంస్కృతిలో భాగంగానే మనుషులకు లభించాలి. అలా లభించాలంటే వివేచనాశక్తి, హేతుబద్ధ ఆలోచనలకు సంస్కృతిలో ప్రాధాన్యత ఏర్పడాలి. ముఖ్యంగా సమాజంలో పై మెట్టులో ఉన్న వర్గాలు సంస్కృతిలో ఆ మేరకు సంస్కరణలకు మార్గాలు తెరవాలి. అట్లా యూరపులో కొత్త ఆలోచనలకు ద్వారాలు తెరవబట్టే పారిశ్రామిక విప్లవం సాధ్యమైందని జోల్‌మోకియర్ ప్రతిపాదించారు.
వలసదేశాలను దోచుకోవటం, ఆఫ్రికా వాసులను బానిసలుగా అమెరికా ఖండానికి తీసుకువెళ్లటం, అక్కడి నుంచి బంగారం, వెండి లోహాలను కొల్లగొట్టటం, బలప్రయోగంతో ఆసియా–ఆఫ్రికా వ్యాపారస్థులను లొంగదీసుకోవటం, అతితక్కువ ధరలకు ముడిసరుకులను తరలించుకుపోవటం, రైతుల చేతుల్లో నుంచి భూములను తొలగించి వారిని కార్మికులుగా మారేలా చేయటం, బ్రిటన్‌కు భూమిపైపొరల్లో బొగ్గు తేలికగా లభించటం లాంటివన్నీ కలగలిసి పారిశ్రామిక విప్లవానికీ, ఆ తర్వాత యూరోపు ఆధిపత్యానికీ దోహదం చేశాయనీ చెప్పే వాదనలను తోసిపుచ్చుతూ జోల్‌మోకియర్ చేసిన ప్రతిపాదనలు ఆర్థిక చరిత్రకారుల్లో ఇప్పటికీ చర్చలను రగుల్చుతూనే ఉన్నాయి. ప్రయోగాలకూ, పరిశీలనలకూ ప్రాధాన్యమిచ్చే సంస్కృతి యూరపులో కొలంబస్ సాహసిక నౌకాయానాల కాలం నుంచి మొదలై ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే నాటికి గట్టిగా స్థిరపడిందనీ, 18వ శతాబ్దంలో అదింకా బలపడి పారిశ్రామిక విప్లవానికి కావాల్సిన మేధో భూమికను తయారుచేసిందన్నదే మోకియర్ ప్రతిపాదనల్లో ప్రధానమైంది. ఆ సంస్కృతి వల్లే అనేక రంగాల్లో విజ్ఞానం పోగుపడి, యంత్రాల తయారీకి దారితీశాయని చెప్పారు. దేశాల తలరాతలను సంస్కృతే మార్చిందనీ, దేశాల మధ్య ఆర్థిక అంతరాల అన్వేషణకు సంస్కృతిలోకే తొంగిచూడాలని చెబుతూ మోకియర్ ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. మోకియర్ దృష్టి నుంచి చూస్తే సొంత సంస్కృతి సర్వశ్రేష్ఠమని గుడ్డిగా భావించే ఏ సమాజమూ ముందుకు వెళ్లలేదు.
మోకియర్ ప్రతిపాదనలతో నూటికినూరుపాళ్లు ఏకీభవించటం కష్టమైనా చాలా దేశాల్లో జాతీయ సంస్కృతి పేరుతో భిన్నాభిప్రాయాలను కాలరాస్తున్న నేపథ్యంలో, సంస్కృతిలోని లోపాలను ఎత్తిచూపే వారిని దేశ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్న కాలంలో సంస్కృతిలోని మంచిచెడులను చర్చించుకోటానికి మళ్లీ అవి ఒక సందర్భాన్ని ఇచ్చాయి. పారిశ్రామిక విప్లవానికి దోహదం చేసిన ఆలోచనాపరులందరూ తమతమ ప్రతిపాదనలతో సంప్రదాయ సంస్కృతీ పునాదులను కదిలించారు. అలా కదిలించకపోతే ప్రగతి సాధ్యమయ్యేదే కాదు. మోకియర్ వాదన సారాంశాన్ని 10 అంశాలుగా చూడొచ్చు.
1) జ్ఞానసముపార్జనకు, కొత్త ఆవిష్కరణలకు, ప్రగతి భావనకు సమాజంలో గౌరవం పెరగటం మొదటిదిగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మతపరమైన విషయాలకే తప్ప ఇతరత్రా వాటికి గౌరవస్థానం ఉండేది కాదు.
2) 1500–1800 మధ్యకాలంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆలోచనాపరులు సరిహద్దులను చెరిపివేసి అన్నిటినీ ఇచ్చిపుచ్చుకున్నారు. దీన్నే సరిహద్దులను దాటిన మేధగా పిలిచేవారు. ప్రకృతిని అర్థం చేసుకోవటం ద్వారా జీవితం మెరుగుపడుతుందనే భావనను బలంగా వ్యాప్తిచేశారు. 3) రాజకీయ, న్యాయ, నైతిక అంశాలపై కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూనే ఉపయోగకర జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంటే జ్ఞానం మనిషికి ప్రత్యక్షంగా ఉపయోగపడాలి. అతని జీవన పరిస్థితిని మెరుగుపర్చటమే దాని పరమార్థం కావాలి. 4) జ్ఞానం అనేది నిరంతరం విస్తరించేదిగానూ ప్రగతికి దోహదం చేసేదిగానూ పేర్కొంటూ భవిష్యత్తు మరింత అభివృద్ధిదాయకమన్న ఆశను పెంపొందించారు. 5) రాయల్ సొసైటీ లాంటి విజ్ఞానసంఘాలు విరివిగా ఏర్పడ్డాయి. పుస్తకాలు, విజ్ఞానసర్వస్వాలు ప్రచురితమయ్యాయి. కొత్త పరికరాల సృష్టి, ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగింది. 6) యూరపులోని చిన్నచిన్న రాజ్యాల మధ్య పోటీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పెంచింది. రాజకీయ, సైనిక అవసరాలు కూడా ఆవిష్కరణల్లో పోటీకి కారణమయ్యాయి. 7) ప్రశ్నించే స్వేచ్ఛకూ, భిన్నాభిప్రాయాలను సహించే ధోరణికీ ప్రోత్సాహం పెరిగింది. ఈ రెండు లేకపోతే శాస్త్రీయపురోగతే ఆగిపోయేది. ప్రశ్నించటం వల్ల తప్పులను వెంటనే సవరించుకునే వీలుకలిగింది. మరోవైపు సంప్రదాయాలనూ, చర్చి ఆధిపత్యాన్నీ ప్రశ్నించటం మొదలైంది. 8) మత చింతనాపరుల కంటే నూతన భావాల, పరికరాల ఆవిష్కర్తల ప్రతిష్ఠ పెరిగింది.
9) జ్ఞానం, సాంకేతికత, ఉత్పత్తి పరస్పరం ప్రభావితమై సంపద పెరగటానికి కారణమైంది. పెరిగిన సంపదతో విద్యారంగంలోకి వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. పెరిగిన విద్యాధికులతో జ్ఞానం మరింత విస్తృతమైంది. జ్ఞానం ఒక స్థాయికి చేరుకుని ఆగిపోకుండా నిరంతరం విస్తృతమయ్యే ప్రవాహంలా మారింది. 10) పారిశ్రామిక విప్లవానికి ఆర్థిక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేసినా దానికి దోహదం చేసింది మాత్రం సాంస్కృతిక రంగంలో వచ్చిన విప్లవమే.
మోకియర్ కంటే ముందు కూడా సంస్కృతీ ప్రాధాన్యం గురించి చెప్పినవారూ ఉన్నారు. ఆధునిక సామాజిక శాస్త్రానికి మూలపురుషుడిగా భావించే మాక్స్‌వెబర్ 1905లోనే ప్రొటెస్టంట్ నైతికత (ప్రొటెస్టంట్ ఎథిక్) పేరుతో దాన్ని వివరించారు. కఠినశ్రమ, క్రమశిక్షణ, పొదుపు, నిజాయితీ, ఆత్మనియంత్రణ, సమయపాలన, క్రమబద్ధజీవితం అనేవి ఆ నైతికతలో భాగమనీ ఇవన్నీ ఆధునిక క్యాపిటలిస్టు ఆర్థికవ్యవస్థకు ప్రాణాధారాలనీ వెబర్ సూత్రీకరించారు. ఇవేమీ ఇస్లాం, హిందూమతాల్లో అంత ప్రముఖంగా లేవనీ కూడా వెబర్ విమర్శించారు.
పాశ్చాత్య ఆధిపత్యానికి ఇట్లా సొంత సంస్కృతిలో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని చెప్పే వివరణతో విభేదించే ప్రభావవంతమైన విశ్లేషణలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. కానీ ఎన్ని ఇతర కారణాలను చెప్పుకొన్నా భావ, వైజ్ఞానిక రంగంలో పాశ్చాత్య దేశాల్లో వచ్చిన మార్పుల ప్రభావాన్ని కాదనలేం. 16, 17, 18, 19 శతాబ్దాల్లో పాశ్చాత్య గడ్డమీద నుంచి వచ్చిన సిద్ధాంతాలూ, విశ్లేషణల్లో కొన్నైనా ఆధిపత్యాల్ని, అసమానతలను, వలస దోపీడీలనూ, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించేలా చేశాయి. అందుకే ఒక సంస్కృతి నుంచీ జనించిన భావాలు ఇతర సమాజాలకు పూర్తిగా పనికిరావనీ చెప్పలేం. అట్లా భావిస్తే ప్రజాస్వామ్యంతో మొదలుపెట్టి ఎన్నో ఆధునిక ఆలోచనలను వదులుకోవాల్సి వస్తుంది. ప్రయోగాలు, పరిశీలనలు, అనుభవాలు, హేతుబద్ధ వివేచన అనేవి జ్ఞానసముపార్జనకు సోపానాలుగా మారి విశ్వజనీనతను సంతరించుకున్నప్పుడు వాటిని గుడ్డిగా తిరస్కరించటం తిరోగమనమే అవుతుంది. దేశంలో ఇప్పుడు ఆ ఛాయలు కనపడుతున్నాయి. సకలశాస్త్రాలకూ, ప్రజాస్వామ్య పద్ధతులకూ, పర్యావరణ పరిరక్షణ విధానాలకూ భారతదేశాన్నే పురిటిగడ్డగా భావించే సంకుచితత్వం పెరుగుతోంది. దేశంపైనా, వ్యక్తులపైనా, సమూహాలపైనా గుడ్డి ప్రేమ, గుడ్డి ద్వేషం సంకుచితత్వాన్నే నేర్పుతుంది. పాత సాంకేతిక పరిజ్ఞానాలను కొత్తవాటితో తోసిపుచ్చటమే సృజనాత్మక విధ్వంసంగా ఆర్థికశాస్త్రంలో పేర్కొంటారు. కొత్త సృజనతో పాత సృజన కనుమరుగు అవుతుంది. సంస్కృతికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. కొత్త సృజనకు దారి ఇవ్వాలంటే సంస్కృతి కూడా సంస్కరణకు గురికాక తప్పదు. సంస్కృతిపై అతి మమకారాన్ని వదులుకోకా తప్పదు.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)
ఈ వార్తలు కూడా చదవండి..
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 24 , 2025 | 02:21 AM