ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Reservations In India: క్రీమీలేయర్‌ను కాదంటే రిజర్వేషన్లు వద్దన్నట్టే

ABN, Publish Date - Dec 07 , 2025 | 02:32 AM

దేశంలో కులవ్యవస్థ, పేదరికం ఉన్నంతవరకు రిజర్వేషన్ల మీద, రిజర్వేషన్లలో క్రీమీలేయర్ మీద వాదనలు వినపడుతూనే ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ధనవంతులు, ఎగువ మధ్య తరగతి వాళ్లను...

దేశంలో కులవ్యవస్థ, పేదరికం ఉన్నంతవరకు రిజర్వేషన్ల మీద, రిజర్వేషన్లలో క్రీమీలేయర్ మీద వాదనలు వినపడుతూనే ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ధనవంతులు, ఎగువ మధ్య తరగతి వాళ్లను ‘క్రీమీలేయర్’ అంటాం. వాళ్ల పిల్లలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేది క్రీమీలేయర్ సిద్ధాంతం. ముందుగా మనం రిజర్వేషన్లు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో మాట్లాడుకుందాం.

1951–52 ఎన్నికల్లో 80శాతం మంది ఎన్నికైన ముఖ్యమంత్రులు ఒకే కులానికి చెందిన వాళ్ళు. మొదటి ముప్పై సంవత్సరాలు ఎంపికైన ఐఏఎస్ ఆఫీసర్లు (ఎస్సీ/ ఎస్టీ తప్ప) 80శాతం మంది ఒకటే కులానికి చెందినవారు. రిజర్వేషన్లు లేని హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జీలు ఏ కులం వాళ్లు మాత్రమే ఉంటారో చూస్తున్నాం. 60శాతం బీసీలు ఉన్న దేశంలో రెండు శాతం బీసీలు మాత్రమే గత 75 సంవత్సరాలలో జడ్జీలుగా ఎంపిక అయ్యారు. సోకాల్డ్ ఉన్నత కులాల నుంచి వచ్చిన జడ్జీలు అవినీతి చేయకుండా చకచకా జడ్జిమెంట్లు ఏమైనా ఇచ్చారా అంటే అలాంటిది ఏమీ కనపడటం లేదు. పోనీ ఉన్నత వర్గాల నుంచి వచ్చిన ఐఏఎస్‌లు గొప్ప పరిపాలన చేసి దేశంలో పేదరికం పారద్రోలారా అంటే అదీ లేదు. దేశంలో మరో వందేళ్ళ తరవాత కూడా కులం ఉంటుంది. ‘నాకు రోటీ లేకున్నా పర్లేదు, విద్య లేకున్నా పర్లేదు, ఉద్యోగం లేకున్నా పర్లేదు, కానీ మందిర్ కావాలి’ అనే మూర్ఖులను తయారు చేస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నంతవరకు కులాలు వర్ధిల్లుతాయి. మన దేశం మానవ అభివృద్ధి సూచికలో వెనక్కి వెళ్తూనే ఉంటుంది.

అందరికీ తెలియాల్సింది ఏమిటంటే జీడీపీ పెరిగితే మానవ అభివృద్ధి సూచిక పెరగదు, సగటు తలసరి ఆదాయం పెరిగితే మానవ అభివృద్ధి సూచిక పెద్దగా పెరగదు. అందరికీ న్యాయమైన ఉన్నత విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, అందరికీ కల్తీ లేని పౌష్టికాహారం, అందరికీ కొనుగోలు శక్తి, లింగ సమానత్వం, స్వచ్ఛమైన తాగునీరు, గౌరవప్రదమైన ఉపాధి, హింస లేని సమాజం.... ఇవన్నీ సాధ్యమైనప్పుడే మానవాభివృద్ధి సూచిక ముందుకు వెళుతుంది.

కులాలు ఉన్నంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఎట్లా చెప్పుకుంటున్నామో అలాగే పేదరికం ఉన్నంతకాలం క్రీమీ లేయర్ ఉండాల్సిందే. రిజర్వేషన్లు లేకపోతే ధనిక కులాలు ఎలా ఎక్కువ లబ్ధి పొందుతాయో, అలాగే క్రీమీలేయర్ లేకపోతే రిజర్వేషన్ కులాలలో ఉన్న ధనవంతులు ఆ కులాలలో ఉన్న పేదలను వెనక్కినెట్టి ఎక్కువ లబ్ధి పొందుతారు.

క్రీమీలేయర్ లేకపోవడం వల్ల– ఒకే గేటెడ్ కమ్యూనిటీలో నివసించే ఇద్దరు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. ఒక ఎస్టీ అమ్మాయి, ఒక ఓసీ అమ్మాయి ఇద్దరి ఆర్థికస్థాయి ఒక్కలాగే ఉంది. ఎస్టీ అమ్మాయికి తనకంటే పది మార్కులు తక్కువ వచ్చినా కానీ ఒక మంచి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినప్పుడు ఆ ఓసీ అమ్మాయికి ఏమీ అర్థం కాదు. ఇదేమి అన్యాయం అనుకుంటుంది. రిజర్వేషన్ల చరిత్ర, నేపథ్యం తెలియదు కాబట్టి ఆ ఓసీ అమ్మాయి ఇక అప్పటి నుంచి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది. కింది కులాలను ద్వేషిస్తుంది. ఇందుకు భిన్నంగా– గ్రామీణ ప్రాంతంలో కానీ, పేదవాళ్లు ఉన్న బస్తీ నుంచి కానీ వచ్చిన అమ్మాయికి పది మార్కులు తక్కువ వచ్చినా, ఆ ఎంబీబీఎస్ సీటు వచ్చినప్పుడు అదే ఓసీ అమ్మాయి కొంతమేరకు అర్థం చేసుకుంటుంది. క్రీమీలేయర్ అనేది రిజర్వేషన్లలో రిజర్వేషన్ అని అర్థం చేసుకోవాలి. క్రీమీలేయర్ వద్దు అనే వాళ్ళు రిజర్వేషన్ వద్దు అనే వాళ్లతో సమానం. క్రీమీలేయర్‌ విధానం ఉంటే విద్యలో రిజర్వేషన్ సీట్లు, ప్రభుత్వ రిజర్వుడు ఉద్యోగాలు నిండవనీ ఖాళీగా ఉండిపోతాయనీ చేసే వాదన చాలా తప్పు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కొన్ని కోట్లమంది అర్హులైన అభ్యర్థులు ఉన్నారు.

‘మంచి కార్పొరేటు విద్యాసంస్థల్లో చదువు పొందిన ఉన్నత ఉద్యోగస్థుల పిల్లలనూ, నాణ్యతలేని ప్రభుత్వ/ బడ్జెట్ ప్రైవేటు పాఠశాలల్లో చదువు పొందిన పేదకూలీల, అల్పాదాయ వర్గాల పిల్లలనూ ఒకేలా చూడడం సరికాద’ని సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి గవాయి వాదనతో నేను –విద్యను పొందిన మొదటి తరం ఉన్నత ఉద్యోగిగా– పూర్తిగా ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానం ఉంటే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. ఈ విధానం అందరికీ సమానత్వం, అందరికీ సమన్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుబంధంగానే ఉందని మనం తెలుసుకోవాలి. ‘వాళ్లు వాళ్లు కొట్టుకొని చావనీ’ అని పరిపాలన చేసే పెద్ద కులాల పాలకులకు ఇది ఒక పెద్ద సమస్యగా కనపడదు. సమాజంలో ప్రభావం చూపించగలిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నత ఉద్యోగులతో మనకు ఎందుకు వివాదం అని రాజకీయ పార్టీలు ఈ సమస్యను పక్కన పడేస్తాయి. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, సమానత్వం సాధించాలి అనుకునే బుద్ధిజీవులే ఈ విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడవలసిన అవసరం ఉంది.

ఆకునూరి మురళి

రిటైర్డ్ ఐఏఎస్‌

ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 02:32 AM