Telangana Rising 2047: ఉజ్వల భవిత వైపు విజన్ డాక్యుమెంట్
ABN, Publish Date - Dec 12 , 2025 | 03:46 AM
ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నది. చారిత్రకంగా, భౌగోళికంగా, ఆర్థికంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నది...
ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్నది. చారిత్రకంగా, భౌగోళికంగా, ఆర్థికంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అబివృద్ధి ఆధునిక, హైటెక్ రాజధానిగా అభివృద్ధి చెందింది. దేశంలో ప్రధాన మెట్రో సిటీలుగా ప్రసిద్ధి చెందిన ఢిల్లీ, చెన్నై, ముంబయ్, కలకత్తాల కంటే అనువైన వాతావరణ పరిస్థితులు హైదరాబాద్‌లో ఉన్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచస్థాయి దిగ్గజాలైన 37 కంపెనీలు (అవిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్), పరిశోధన అభివృద్ధి కేంద్రాలు, స్టార్టప్‌లు ఉన్నాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ళతోపాటు, ప్రముఖ విద్యా సంస్థలు, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం. అంతేగాక, రాష్ట్రంలో సహకార సంస్కృతి, యువ జనాభా, పెట్టుబడులకు అనుకూల ప్రభుత్వ విధానాలు ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలై రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను సాధించటం, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయటం; 2047 నాటికి దేశ జీడీపీలో 10శాతం వాటాను సాధించటం; చైనా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోటీపడటం... మొదలైన లక్ష్యాలతో జరిగింది. ఈ సమ్మిట్‌లో దాదాపుగా రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డ్.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి సమగ్ర, సుస్థిర, సమ్మిళత అభివృద్ధి కోసం, భావితరాల బంగారు భవిష్యత్ కోసం తెలంగాణ రైజింగ్–2047 డాక్యుమెంట్‌ను తయారు చేసారు. ప్రధానంగా తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించటం ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడుల రేటు 37శాతం. దీన్ని 52శాతానికి పెంచితే 2046–47 నాటి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దీనికోసం ప్రధానంగా సేవలు, పారిశ్రామిక రంగంపై దృష్టి కేంద్రీకరించాలని, మద్దతుగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని ఈ డాక్యుమెంట్ ప్రతిపాదిస్తున్నది. ఈ లక్ష్య సాధనకు– సాంకేతిక రంగంలో నవకల్పనలు (ఆవిష్కారాలు); పూర్తిస్థాయి పెట్టుబడుల ఆకర్షణ; పారదర్శక, పౌర కేంద్రీకృత విధానాల ద్వారా సుపరిపాలన అందించటం ముఖ్యమని ఈ డాక్యుమెంట్ చెప్తున్నది. ఈ డాక్యుమెంట్ తెలంగాణను మూడు జోన్లుగా విభజించింది. దీనిలో--– 1) హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE) 2) అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరి–అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) 3) రీజనల్ రింగ్ రోడ్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమి (RARE)గా విభజించింది. ఈ విభజన ద్వారా CURE పరిధిలో ప్రపంచస్థాయి – ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. PUREలో పారిశ్రామిక, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. RAREలో వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత – ప్రాసెస్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
తెలంగాణలో నవీన సాంకేతికత ఆధారంగా మరో సిటీ నిర్మాణానికి ముందడుగుపడింది. భారత్ ప్యూచర్ సిటీ పేరుతో 30వేల ఎకరాల్లో పర్యావరణహితంగా, సాంకేతిక ఆధారాలతో నగరాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి చోదకశక్తిగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతున్నది. హైదరాబాద్‌లో ఈ పెట్టుబడుల సమ్మిట్ నిర్వహణ, తెలంగాణ విజన్–2047 డాక్యుమెంట్ విడుదల రేవంత్‌రెడ్డి పాలనలోనే కాదు, తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘటనలుగాను, తెలంగాణ భావి ప్రగతికి దిక్సూచీలుగాను భావించాలి.
రియాజ్
టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News
Updated Date - Dec 12 , 2025 | 03:46 AM