Bihar Election: అనుమానాస్పదం
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:50 AM
బిహార్‌లో నాలుగునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తీవ్ర రాజకీయ దుమారం రేపింది
బిహార్‌లో నాలుగునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) పేరుతో ఈసీ సాగిస్తున్న ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ లాలూ యాదవ్ పార్టీ ఆర్జేడీతో పాటు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), తృణమూల్ నేత మహువా మొయిత్రా, యోగేంద్రయాదవ్ ఇత్యాదులు పిటిషన్లు వేశారు. భారతరాజ్యాంగంలోని పలు అధికరణలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని పలు నిబంధనలను జూన్ 24న ఈసీ జారీ చేసిన ఆదేశాలు ఉల్లంఘిస్తున్నందున వాటిని రద్దుచేయాలన్నది ఈ పిటిషన్ల సారాంశం. స్వల్పవ్యవధిలో పౌరులు తమ ఉనికినీ, నివాసాన్నీ రుజువుచేసుకోలేక ఆఖరుకు లక్షలాదిమంది ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందని పిటిషన్‌దారులు సర్వోన్నత న్యాయస్థానానికి తెలియచేశారు. గురువారం అత్యవసర విచారణకు అంగీకరించిన కోర్టు, అంతవరకూ ‘సర్’ మీద స్టే విధించడానికి మాత్రం ఒప్పుకోలేదు. మోదీ ప్రభుత్వం అమితంగా ఆధారపడే, ప్రతీ సంక్షేమంతోనూ అనుసంధానించే ఆధార్ కార్డు కానీ, ఎన్నికల సంఘం స్వయంగా జారీ చేసిన ఓటరు గుర్తింపుకార్డు కానీ ఈ ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’లో పౌరులు సమర్పించాల్సిన అధీకృత డాక్యుమెంట్ల జాబితాలో లేవు.
కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని కాబోలు, బిహార్ ఓటర్లకు ఆదివారం ఈసీ కొన్ని సూచనలు చేసింది. జూలై 25కల్లా అధీకృత డాక్యుమెంట్లు చూపించకుంటే ఓటర్లను జాబితానుంచి తొలగిస్తానని ఈసీ అంటోందని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, ఆదివారం కొన్ని పత్రికల్లో హిందీలో ప్రకటనలు విడుదలచేసింది. ‘బూత్‌స్థాయి అధికారి మీకు అందించిన ఎన్యుమరేషన్ ఫారమ్ నింపి డాక్యుమెంట్లు, ఫోటో జతచేసి ఇవ్వండి. సమర్థింపు పత్రాలు సిద్ధంగా లేనిపక్షంలో నింపిన ఫారమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. తగిన డాక్యుమెంట్లు ఉంటే, దరఖాస్తును ప్రాసెస్ చేయడం సులువు, లేనిపక్షంలో అంతిమంగా సదరు అధికారి స్థానికంగా విచారించి ఏ నిర్ణయమూ తీసుకుంటాడు’ అన్నది ఆ ప్రకటన సారాంశం. ఉపరితలంలో ఏదో మినహాయింపు, వెసులుబాటుగా కనిపిస్తున్నా ఈసీ చెప్పదల్చుకున్నదేమిటో అర్థమవుతూనే ఉంది. 2003లో ‘సర్’ జరిగింది కనుక, ఆ తరువాత ఓటర్ల జాబితాలో చేరివచ్చినవారి పుట్టుపుర్వోత్తరాలని పరీక్షించి, అర్హులు కానివారిని ఏరివేయడం ఈసీ ఉద్దేశం.ఆర్జేడీ, కాంగ్రెస్ ఓటుబ్యాంకు అయిన దళితులు, ప్రధానంగా ముస్లింలను ఏరివేయడం లక్ష్యంగా ఇది ఆరంభమైందని ఆ పార్టీలు అంటాయి.
మయన్మార్, బంగ్లాదేశ్‌లనుంచి బిహార్‌కు అక్రమవలసలు అత్యధికంగా జరిగిపోతూ, మరోపక్క లక్షలాది మంది బిహారీ యువకులు ఇతర రాష్ట్రాలకు ఉపాధికి వలసపోతున్న తరుణంలో జాబితాను ప్రక్షాళించకపోతే ఎలా అన్నది ఈసీ, దాని సమర్థకుల వాదన. 2003 జనవరి 1 తరువాత జాబితాలోకి ఎక్కినవారినందరినీ ఈసీ అనుమానిస్తున్నదని అర్థం. అంతేనా, ఆనాటినుంచి నేటివరకూ జరిగిన ఐదుపార్లమెంట్, ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా అక్రమంగా ఓటేశారని కూడా ఒప్పుకున్నట్టే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితాలనే ఏడాదికాలంగా చేర్పులూ తొలగింపులతో ఆప్‌డేట్ చేసుకుంటూ పోయి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాటినే వాడటానికి గతనెలలోనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు తీర్మానించుకున్న తరువాత, హఠాత్తుగా ఈసీకి ఈ బుద్ధి ఎందుకు పుట్టిందో తెలియదు. రెండు దశాబ్దాలనాటి ‘సర్’ ఏడాదిపాటు కొనసాగడమే కాదు, నిర్దిష్టకాలపరిమితిలో ఓటర్లుగా నమోదైనవారిని ఇలా అనుమానించిందీ లేదు. సిద్ధం చేసిన జాబితాలో అనుమానాస్పద అంశాలేమీ లేవని స్థానిక అధికారులు చెబుతున్నప్పటికీ, బీజేపీ వ్యతిరేక ఓటర్ల ఏరివేత లక్ష్యంగానే కేంద్ర ఎన్నికల సంఘం హఠాత్తుగా ఈ నిర్ణయానికి వచ్చిందని విపక్షాల విమర్శ. ఇంటింటికీ పోయి సర్వేలు చేయడం నుంచి, జాబితాలు సిద్ధం చేయడం వరకూ సమస్తమూ రెండునెలల్లోనే చక్కబెట్టగల వ్యవస్థ తన దగ్గర ఉన్నదనీ, వేలాదిమందిని రంగంలోకి దించానని ఈసీ చెప్పుకుంటోంది. కానీ, కొత్తగా ఓటర్లయిన దాదాపు మూడుకోట్లమంది బిహారీల్లో ఎంతమంది తమ పుట్టుక, ఊరు, చదువుతోపాటు, తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలనూ చూపించి 1955నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సి) నిర్దేశించిన రీతిలో తమ పౌరసత్వాన్ని ఇంత స్వల్పకాలంలో రుజువుచేసుకోగలరన్నది ప్రశ్న.
Updated Date - Jul 08 , 2025 | 12:51 AM