BC Reservations Without Sub Classification: ఉప వర్గీకరణ లేకుండా బీసీ రిజర్వేషన్లు అప్రజాస్వామికం
ABN, Publish Date - Nov 05 , 2025 | 02:09 AM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి హైకోర్టులో రెండు కౌంటర్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి, స్థానిక సంస్థల...
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ దగ్గరకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి హైకోర్టులో రెండు కౌంటర్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు 50శాతానికి మించడం రాజ్యాంగ విరుద్ధం అని. రెండోది, బీసీల్లోని అట్టడుగు సంచార జాతుల కులాల మధ్య వర్గీకరణ జరగకుండా ఈ బిల్లును అమలు కాకూడదని. దీంతో రాష్ట్రంలో బీసీ బిల్లు రాజకీయం తీవ్ర అలజడికి దారితీసింది. 50శాతం రిజర్వేషన్లు మించకుండా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశాన్ని సుప్రీం కూడా సమర్థిస్తూ, హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.
మన రాష్ట్రంలో సంచారజాతుల వారు చాలా వెనుకబడి ఉన్నారు. వీరు బీసీ–ఏలో ఉన్నారు. వీరికి రాజకీయ రంగంలో ఎలాంటి ప్రాతినిధ్యమూ లేదు. ఇప్పుడు ఉమ్మడిగా 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీసీల్లో ఆర్థికంగా ఎదిగిన కులాలే లబ్ధి పొందుతాయి. మిగతా పేద బీసీ కులాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి జీవో 9ని నిలిపివేసి, బీసీ వర్గీకరణతో కొత్త జీవో ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయా కులాల వారు ఈసీకి నివేదించారు.
ఒకసారి ఉమ్మడి ఏపీకి సంబంధించిన 2013 సంవత్సరం సర్పంచ్‌ల సమాచారాన్ని గమనిస్తే... గౌడ్స్ 818, ముదిరాజ్ 625, మున్నూరు కాపు 549, యాదవ 560, కురుమ 243, పద్మశాలి 215, పెఱిక 83 లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న కులాలే పంచాయతీ, మున్సిపాలిటీ పదవులలో అత్యధికంగా ఉన్నాయి. అయితే బీసీల్లోని మిగతా 70కి పైగా కులాలు కనీసం వార్డ్ మెంబర్, సర్పంచ్ కూడా కాలేకపోయాయి. గతంలో బీఆర్‌ఎస్ చేసిన సర్వే ప్రధానంగా కులాల మధ్య విభజన రేఖను గీసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో చేసింది. కాబట్టి బీసీల్లో ఉన్న ప్రధాన కులాలపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంచార కులాలను విస్మరిస్తున్నది. అయితే, బలమైన ఓబీసీ కులాల మద్దతు కోల్పోతుందనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేయడానికి చొరవ చూపడం లేదనేది వాస్తవం. ఓబీసీ వర్గీకరణ జరగకపోతే ప్రస్తుత ‘ఓబీసీ రిజర్వేషన్ ఫ్రేమ్‌వర్క్’తో సామాజిక న్యాయం కంటే సామాజిక అన్యాయం జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉంది.
సునీల్ నీరడి
ఈ వార్తలు కూడా చదవండి...
రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 05 , 2025 | 02:09 AM