Are Theatre Movies Disappearing: థియేటర్ సినిమాలు కనుమరుగవుతాయా
ABN, Publish Date - Dec 21 , 2025 | 04:39 AM
నా చిన్నప్పుడు ‘లవకుశ’ సినిమా చూసేందుకు బండ్లు కట్టుకొని ప్రజలు తండోపతండాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవారు. అలాంటి సినిమాలు చూసిన తరువాత తమ జీవితం...
నా చిన్నప్పుడు ‘లవకుశ’ సినిమా చూసేందుకు బండ్లు కట్టుకొని ప్రజలు తండోపతండాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవారు. అలాంటి సినిమాలు చూసిన తరువాత తమ జీవితం ధన్యమైందని అనుకొనేవారని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు! సామాన్యుడికి ఆనాడు సినిమా చూసేందుకు ‘పావలా’ నేల టికెట్ సరిపోయేది! నేడు బ్లాకులో మల్టీప్లెక్స్‌లో సినిమా చూసేందుకు, అక్కడ పాప్‌కార్న్ లాంటి ఖరీదైన తినుబండారాలు కొనుక్కునేందుకూ, ఇంటిల్లిపాదికీ వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి!
ఆనాటి సినిమాల్లో నవరసాలతో పాటు జనానికి అర్థమయ్యే రీతిలో ఆచరణకు వీలైన చిన్నపాటి సందేశం కూడా ఉండేది! డబ్బులు చేసుకోవటానికే ఆనాటి నిర్మాతలు సినిమాలు తీసేవారు, కానీ పూర్తిగా సినిమాల ద్వారానే వందకు వంద శాతం లాభాలు పొందాలనే పేరాశతో వ్యవహరించక పోయేవారు! ప్రేక్షకులకు వినోదంతో పాటు కలకాలం జ్ఞాపకం ఉంచుకొనే నడవడికనూ, ఏది మంచీ ఏది చెడూ అనే విచక్షణా జ్ఞానాన్ని అప్పటి సినిమాలు అందించేవి! కుటుంబగాథలు, జానపద నాయకుల వీరోచిత సాహసాలూ, క్రూరత్వం ప్రదర్శించిన విలన్లు చివరకు హీరోల చేతుల్లో చావక తప్పదనే నీతితో కూడుకున్న న్యాయం ఉండేది. పౌరాణిక గాథలు– అందులో నటించిన కృష్ణుడు, రాముడు కాలెండర్లను పూజగదుల్లో పెట్టుకొనే రీతిలో సినిమాలు నిర్మాణమయ్యేవి! ఒకటో రెండో ‘క్లాస్’ సినిమాలను నిర్మాతలు అభిలాషతో తీసినా, కొద్దిపాటి నష్టంతో బయటపడేవి. అలాంటి వాటికి ప్రభుత్వ సాయంతో పాటు, అవార్డులు కూడా దక్కేవి!
ఇప్పటి సినిమా నిర్మాణాలూ, ప్రేక్షకుల ఇక్కట్లూ, ఫ్యాన్స్ అనవసరంగా చేసే హడావిడి వల్ల కలిగే రాద్ధాంతాలూ, శాంతిభద్రతల సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! పేరు తెచ్చుకున్న ఇప్పటి సినిమాలో కూడా ప్రేక్షకుడు రెండున్నర గంటల సినిమాను వీక్షించటానికి నానా హైరానా పడుతున్న తరుణంలో... సినిమా క్రమేపీ సామాన్యుడికి దూరమవుతున్నదా? అని ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇందుకు కారణం ఎవరు?
మల్టీప్లెక్స్ థియేటర్ల రాకతో మామూలు థియేటర్లు మరుగునపడుతున్నాయి. కొన్ని పట్టణాలలో, టౌన్లలో సినిమా హాళ్ళు ఫంక్షన్ హాళ్ళుగా మారుతున్నాయి. ఇళ్లల్లో కూర్చొని, ఓటీటీ ద్వారా వచ్చే సినిమాలు టీవీలలో చూస్తే పోలా!... అనుకుంటున్న ప్రేక్షకుడిని మళ్ళీ సినిమా హాళ్ళకి తీసుకొని వచ్చి, సినిమాలు చూసే పరిస్థితి కల్పించగలరా? మన దేశంలో సినిమా పెద్దలు ఏరోజుకారోజు లెక్కలు చూసుకొని సరిపెట్టుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తే అంతకంటే కావల్సింది ఏముంది అన్న మోహంలో పడిపోయారు. సాధారణ సినిమాలు జనరంజకంగా తీయొచ్చు అన్న సంగతి గాలికి వదిలేశారు. హీరోలు, దర్శకులు ఒకటి రెండు సినిమాలతో కోటీశ్వరులు కావచ్చని, సినిమా అంటే డబ్బు వచ్చే సోర్స్ అనే భ్రాంతిలో పడిపోయారు. సగటు ప్రేక్షకుడిని మర్చిపోయారు.
టీవీల రాకతో, చానెళ్ళ ఆకర్షణలతో, దృశ్యానుభూతితో పుస్తకాలు చదవటం కాలక్రమేణా కనుమరుగయింది. గొప్పల కోసం ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు కానీ, తెలుగు మరీ పలచనైపోయి, కేవలం స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాలకే పరిమితమైంది. మారుతున్న సమాజం తీరును ఎవరూ తప్పుపట్టలేరు. కాలానుగుణంగా మార్పులతో ప్రజానీకం ముందుకు నడవక తప్పదు. అయితే పూర్తిగా విలువలు మృగ్యమయ్యే రీతిలో ప్రస్తుత సమాజం వ్యవహరిస్తే భవిష్యత్తులో నష్టపోయేది వారి వారసులే. భాష అనేది భావాన్ని వ్యక్తపరిచే సాధనం. కానీ మనిషిలో నుంచి సహజ తీరులో భావ సంపదను అమర్చుకుంటూ వచ్చే భాష బదులుగా, సంబంధంలేని భాషను పనిగట్టుకొని నేర్చుకోవడమే గొప్ప అనుకొని ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే! ఈ ఇంగిత జ్ఞానం వదులుకోకూడదు! ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు ఊరకే చెప్పలేదు! ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని మరొకరు ఊరకనే పొగడలేదు! అన్ని భాషలను ఆదరిస్తున్న తీరులోనే స్వంత భాషను మెరుగ్గా ఆదరిస్తే– మన గుర్తింపును (ఐడెంటిటీని) మనం కోల్పోకుండా ఉంటాం. మన సంస్కారాన్ని, విలువలను, భావితరాల కోసం నిలబెట్టుకున్న జాతిగా మనగలుగుతాం.
భాష మాదిరే మన సినిమాను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినోదం కోసం చూసే సినిమా ఆర్థిక విషాదం కల్పించకూడదు. అందని ద్రాక్షపండులా తెలుగు సినిమాను ఈ తరం నిర్మాతలూ, దర్శకులూ, నటులూ మార్చటం... సినీ రంగానికి ద్రోహం చేయడమే. కాలక్షేపం కోసం అర్రులు చాచే సామాన్య జనానికి ఉన్న ఒకే ఒక ప్రయోజనాన్ని, అందుబాటులో ఉన్న వినోద సాధనాన్ని గుంజుకొనే వారు ఎంతగొప్పవారైనా, కళామతల్లి ముద్దుబిడ్డలుగా పొగడ్తలను మూటగట్టుకుంటున్న వారైనా సరే– గర్హనీయులే.
పాశ్చాత్య దేశాల్లో కూడా కొంతకాలం పాటు పుస్తకాలు అటకెక్కాయి! టీవీల నీడల్లో అనాదరణకు లోనయ్యాయి. కానీ ప్రస్తుతం కోల్పోయిన ఆదరణను అవి తిరిగి పొందుతున్నాయి. సినిమా విషయంలో హాలీవుడ్‌ను కూడా ప్రశ్నించే విధంగా నెట్‌ఫ్లిక్స్ – వార్నర్ డీల్ కుదిపేస్తున్నది. అసలు సిసలైన సినిమాలకు రూపకల్పన చేసే హాలీవుడ్ పరిశ్రమ కుదేలవుతున్నదా? అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ డీల్ కుదిరితే ప్రేక్షకులు కోరుకునే సినిమా కాలగర్భంలో కలిసిపోతుంది. స్వతంత్ర పోకడలతో నిర్మాణాత్మకంగా తీసే సినిమాలకు నీళ్ళొదులుకోవాల్సిందే. సినిమాలు చూడటానికి క్యూ కట్టే సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పదు. పారామౌంట్ లాంటి సంస్థ ఈ డీల్‌ను తీవ్రంగా ఖండిస్తోంది. సినిమాలు చూసేవారికి థియేటర్ల కాలక్షేపం అందుబాటులో ఉండని పరిస్థితి అక్కడా ఏర్పడనున్నదా? అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ డీల్ సినిమా ప్రేక్షకులకు ప్రమాదకారిగా మారొచ్చని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాలు కల్పించుకొనే అవకాశంతో పాటు, ఈ సమస్యను ఏ విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలన్న ఆలోచనల్లో అక్కడి విజ్ఞులు ఉన్నారు. ఇక్కడ కూడా సినిమా ప్రేక్షకుల మంచి చెడ్డలు చూస్తున్న మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాలకులూ కలగజేసుకొని సినిమాను సామాన్యుడికి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
రావులపాటి సీతారాంరావు
ఈ వార్తలు కూడా చదవండి:
AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత
MLA Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి షాక్.. అత్యవసర విచారణకు నో చెప్పిన హైకోర్టు..
Updated Date - Dec 21 , 2025 | 04:39 AM