Comrade Sambasiva Rao: అలుపెరుగని కార్మిక యోధుడు
ABN, Publish Date - Dec 26 , 2025 | 12:47 AM
ఉద్యోగాన్నీ, ఉద్యమాన్నీ సమాంతరంగా, సమానస్థాయి శ్రద్ధాసక్తులతో, అంకితభావంతో నిర్వహించేవారు అరుదు. ఆ తరహా పోరాటయోధుడు వెల్లల చెరువు సాంబశివరావు. CITU–CPMలలో పనిచేస్తూనే...
ఉద్యోగాన్నీ, ఉద్యమాన్నీ సమాంతరంగా, సమానస్థాయి శ్రద్ధాసక్తులతో, అంకితభావంతో నిర్వహించేవారు అరుదు. ఆ తరహా పోరాటయోధుడు వెల్లల చెరువు సాంబశివరావు. CITU–CPMలలో పనిచేస్తూనే, ఇటు పోస్టల్–టెలికాం సంఘాలలో చురుకైన నాయకునిగా వ్యవహరించారు కామ్రేడ్ సాంబశివరావు. ముఖ్యంగా 80, 90 దశకాలలో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలలో సాంబశివరావు ముఖ్య భూమిక పోషిస్తూ, ఉద్యోగులు, కార్మికులకు తలలో నాలుకలా వ్యవహరించారు. సీపీఎం సభ్యునిగా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశారు.
సమాజాన్ని మార్చాలంటే నిర్దిష్టమైన రాజకీయ విధానాలతోనే సాధ్యమన్న ఆలోచన విద్యార్థి దశలోనే ఆయనకు ఉండేది. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఎస్‌ఎస్‌ఎల్సీ చదివే సమయంలో అలవడిన అభ్యుదయ భావాలు ఆయనను వామపక్ష ఉద్యమం వైపు నడిపించాయి. రాజమండ్రిలో జేఈగా తొలి అపాయింట్‌మెంట్ వచ్చింది. కానీ ఆ స్థానంలో ఉంటే ఉద్యోగ సంఘ నాయకులకు ఎదురయ్యే ఇబ్బందులు గ్రహించారు. కెరీర్‌లో నష్టపోతానని తెలిసి కూడా ఆ స్థానాన్ని వదులుకుని క్లరికల్ జాబ్‌లోకి వచ్చారు.
ఉద్యోగుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో సాంబశివరావు పాత్ర చాలా ఉంది. పోస్టల్ అండ్ టెలికాం రంగం విడిపడిన సందర్భంలో ఆయన టెలికాం రంగంవైపు వచ్చినప్పటికీ, పోస్టల్ సంఘానికి, టెలికాం సంఘానికి వారధిగా ఉండేవారు. ఉద్యోగులు–కార్మికుల సమస్యల పరిష్కారానికి మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెచ్చి, ఫలితాలు సాధించడంలో సాంబశివరావుకు అసాధారణమైన నైపుణ్యం ఉంది. ఓర్పుతో కూడిన ఆయన పోరాట పటిమను బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్ రంగంలోని ఉద్యోగ కార్మికులు రెండు దశాబ్దాల పాటు కళ్లారా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. ఉద్యోగ సంఘాల తరఫున సెమినార్లు, క్లాసులు నిర్వహించేవారు. 1993 జనవరి 4న ఏలూరులో నిర్వహించిన మహాసభల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సాంబశివరావు ఎన్నికై పదేళ్లపాటూ పనిచేశారు. చివరికి పదవీ విరమణ తర్వాత కూడా నాయకునిగానే పనిచేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ సంఘానికి ఆయుష్షుపోశారు.
రాత్రి 12 గంటల వరకూ యూనియన్ కార్యకలాపాల్లోనే సాంబశివరావు గడిపేవారు. పార్టీపై, పార్టీకి అనుబంధంగా ఉండే ట్రేడ్ యూనియన్లపై నిర్భంధం ఉన్న రోజుల్లో కూడా ఆయన వెన్నుచూపలేదు. ఆంక్షల్ని లెక్కచేసేవారు కాదు. ఆ రోజుల్లో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేవి. చాలాసార్లు తెల్లవార్లూ చర్చలు జరుగుతుండేవి. వాటిలో సాంబశివరావు చురుగ్గా పాల్గొనేవారు. కార్పొరేట్ శక్తుల నుంచి ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకోవాలని పరితపించారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి పోరాటమే లక్ష్యంగా రేయింబవళ్లూ ఉద్యమాల్లో తిరిగేవారు. కుటుంబం కంటే ఎక్కువ సమయం యూనియన్ కార్యకలాపాలకే వెచ్చించేవారు. తన పిల్లలతో గడపడానికి కూడా ఆయనకు తీరిక ఉండేది కాదు. వాళ్లను ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే చదివించారు. దివిసీమ ఉప్పెన సమయంలో కుటుంబాన్ని వదిలిపెట్టి తిరువనంతపురంలో మీటింగ్‌కు వెళ్లారు. అత్యంత నిరాడంబరమైన జీవనశైలి ఆయనది. ఎంతదూరమైనా సైకిల్ మీదే ప్రయాణం. రిక్షాలో తిరిగే ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పటికీ సైకిల్‌పైనే వచ్చి, పార్టీ ఖర్చులు లెక్కలు రాసి వెళ్లేవారు. ఆదర్శవంతమైన ఉద్యమకారుడిగా జీవితాంతం పనిచేశారు.
‘ప్రజా చైతన్య వేదిక’ అనే సోషల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గుంటూరులో ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులతో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చర్చా గోష్ఠులు, సదస్సులు నిర్వహించేవారు. ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఆయన ప్రసంగాలు ఉత్తేజపరిచేవి. కంచుకంఠంతో, ఛలోక్తులతో సాగే ఆయన ప్రసంగాలు ఆద్యంతం ఆసక్తిగా, సిద్ధాంతాల్ని జనంలోకి పంపించేలా ఉండేవి. జీవితసారం ఆ మాటల్లో దొర్లేది. తప్పును తప్పు అని కుండబద్దలు కొట్టేవారు. మంచి చేస్తుంటే భుజం తట్టేవారు. ఇంత గొప్ప వ్యక్తి నా తండ్రి అని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. పుత్రుడు జన్మించినప్పుడే తండ్రికి పుత్రోత్సాహం పుట్టదని అంటాడు శతకకారుడు. ఇది నా తండ్రి మరణ సమయం. జనులాతండ్రిని పొగుడుతున్న ఈ క్షణం, పిత్రోత్సాహంతో కన్నీళ్లతో రాస్తున్న అక్షర నివాళి ఇది!
వెల్లలచెరువు రజినీకాంత్
సీనియర్ జర్నలిస్ట్
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..
Updated Date - Dec 26 , 2025 | 12:47 AM