ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:51 PM
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జ్వాలాతోరణం ఘనంగా నిర్వహించారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు.
విజయవాడ, నవంబర్ 5: కార్తీక పౌర్ణమి వెలుగుల్లో ప్రదోషకాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. దేవస్థానంలో జ్వాలాతోరణం ఘనంగా నిర్వహించారు. కనక దుర్గమ్మకు పంచహారతులు అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) దంపతులు, ఈవో వీకే శీనానాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కోటి వత్తుల దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
దుర్గమల్లేశ్వర అమ్మవారి సన్నిధిలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తిక దీపాలు వెలిగించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించడం, భక్తుల అచంచలమైన విశ్వాసాన్ని వీక్షించడం తమకు లభించిన భాగ్యమని ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అన్నారు. 'కోటి దీపోత్సవం కేవలం దృశ్యపరమైన ఆనందాన్ని మాత్రమే కాదు. మనందరినీ ఏకం చేసే ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభూతి' అని ఆయన తెలిపారు. ట్రస్ట్ బోర్డు, వేలాది మంది భక్తుల భాగస్వామ్యంతో కార్మిక పౌర్ణమి వైభవంగా జరిగిందని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక భావన కలిగించామని ఆయన అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని శీనా నాయక్ తెలిపారు. దుర్గమ్మ దర్శనంకు వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించామని ఈవో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాల సాహిత్య భేరి.. విద్యార్థులకు తానా కీలక సూచన
Updated Date - Nov 05 , 2025 | 09:54 PM