Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:03 PM
కార్తీక పౌర్ణమి వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణాలు కొత్త శోభను సంతరించుకున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 05: కార్తీక మాసం అందునా పౌర్ణమి కూడా కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలతోపాటు భక్తులు దీపాలు వెలిగించారు. దాంతో దేవాలయాల ప్రాంగణాలన్ని దీపాలతో నిండిపోయాయి.
ముఖ్యంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీకి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, కుంకు మార్చన పూజలు జరిపి, ఉసిరి చెట్టుకు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఇక శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులతో భక్తులు దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి వేళ.. పరమ శివునికి దీపారాధన జరిపితే పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఇక తెలంగాణలోని వరంగల్ భద్రకాళి, వేములవాడ రాజన్న, భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ద్రాక్షారామం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమరావతిలోని అమర లింగేశ్వర స్వామి, సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి, మహానంది, అన్నవరం తదితర దేవాలయాల్లో భక్తుల రద్దీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కొనసాగింది.
గోదావరి నదీలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో రాజమండ్రిలోని పుష్కర ఘాట్, కోటి లింగాల రేవు, ఇటు కోవ్వూరులోని గోష్పాద క్షేత్రం నిండిపోయాయి. ఇక విజయవాడలోని కృష్ణానది తీరంలో సైతం భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఇక మచిలీపట్నంలోని సముద్ర స్నానానికి భక్తులు పోటెత్తారు.
దాదాపు లక్ష మంది ఈ స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేక బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణలోని హనుమకొండ రుద్రేశ్వర స్వామి సిద్దేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఇక ఏపీలోని పంచారామ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోయాయి.
శ్రీకాళహస్తిలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. అయితే పలు ఆలయాల్లో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు
Updated Date - Nov 05 , 2025 | 09:54 PM