Devotional: యాత్రల మాసం... భోజనం ఎలా...
ABN, Publish Date - Nov 02 , 2025 | 12:02 PM
ప్రయాణాలు, యాత్రల సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, ప్రయాణంలో అలసట, నీటి మార్పులాంటి కారణాలతో శరీరానికి జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, శుభ్రంగా చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.
కార్తీక మాసం యాత్రల నెల కదా. ప్రయాణాలు చేసేప్పుడు హోటల్స్‌లో తినాల్సి వస్తుంది. అయితే యాత్రల సమయంలో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కృతిక, విశాఖపట్నం
ప్రయాణాలు, యాత్రల సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో వాతావరణ మార్పులు, ప్రయాణంలో అలసట, నీటి మార్పులాంటి కారణాలతో శరీరానికి జీర్ణ సమస్యలు లేదా అలసట రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణమయ్యే, శుభ్రంగా చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ మసాలాలు, వేయించిన వంటకాలు మానేసి, ఇడ్లీ, దోసె, ఉప్మా, పులిహోర, పెరుగన్నం లాంటి తేలికైన వంటకాలను ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు వేడి ఆహారమే తినడం మంచిది. తాగునీరు ఎప్పుడూ కాచి చల్లార్చిన లేదా సీసా నీరే తాగాలి. యాత్రలో డీహైడ్రేషన్ రాకుండా తరచుగా నీరు తాగాలి. రోజుకు కనీసం ఓ పండు తీసుకోవాలి.
ఆపిల్, అరటి, జామ, ద్రాక్ష లాంటి పండ్లను ఎంచు కోవచ్చు. పల్లీలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి కాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు... ఇంటి నుంచే తీసుకెళ్ళి, రోజూ ఓ గుప్పెడు మోతాదులో తినడం వల్ల శక్తి వస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోజూ పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం మంచిది. హోటల్‌లో తినేటప్పుడు ఆహారం తాజాగా ఉందా, పరిశుభ్రంగా ఉందా అనే విషయాలను గమనించి మాత్రమే తినాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యాత్రలో ఆరోగ్యం కాపాడుకుని, శక్తిమంతంగా ప్రయాణాన్ని ఆనందించవచ్చు.
మా పాపకు పదేళ్లు. బాగా జుట్టు రాలుతోంది. ప్రొటీన్ లోపం వల్లా? మరేదైనా కారణమా?
- కౌముది, వరంగల్
జుట్టు పలుచగా ఉండడం కొన్నిసార్లు వంశపారంపర్యం కావచ్చు. అయితే ఉన్న జుట్టు ఆరోగ్యానికి ఆహారంలో కొన్ని పోషకాలు అత్యవసరం. జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే తగినంత ప్రొటీన్లు తప్పనిసరి. కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన బీ 12, ఐరన్, జింక్, కాపర్, సెలీనియం మొదలైన ఖనిజాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటికోసం చికెన్, మటన్, చేప, రొయ్యలు, గుడ్లు మొదలైన మాంసాహారంతో పాటు కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు ధాన్యాలు; బాదం, పిస్తా, వాల్నట్స్, అవిసె గింజలు మొదలైనవి మీ అమ్మాయికి ఇవ్వాలి. రోజులో రెండు నుంచి మూడు సార్లు పాలు, లేదా పెరుగు, మజ్జిగ తప్పనిసరి. విటమిన్ సి కోసం అన్ని రకాల తాజా పండ్లు ఇవ్వాలి. విటమిన్ డీ సరిపడా లేకుంటే కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండదు. తగినంత విట మిన్ డీ కోసం మీ పాపను తప్పనిసరిగా ఆరు బయట ఎండతగిలే సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఆటలాడనివ్వాలి. పిల్లలు ఆటలాడితేనే వారి ఆహారంలోని పోషకాలన్నీ వంటబడతాయి. సమయానికి తినడం, తగినంతనిద్రపోవడం ఎంతో ముఖ్యం. ఆహారంలో జాగ్రత్తలతో ఫలితం లేనప్పుడు వైద్యుల సలహాతో తగిన మందులు వాడడం మేలు.
నువ్వుల్లో తెల్ల నువ్వుల ప్రత్యేకత ఏమిటి? తెల్ల నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- చిట్టి, మహబూబ్‌నగర్
నువ్వుల్లో తెల్ల, నల్ల రకం అనే తేడాలు ఉన్నా, పోషకాల్లో రెండూ ఒకటే. అయితే నల్ల నువ్వుల్లో తెల్ల నువ్వులకంటే కొంచెం యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నువ్వులను రుచి కోసమే కాక ఔషధ విలువల కోసం అనాదిగా ఉపయోగిస్తున్నాం. ముప్ఫై గ్రాముల నువ్వులు మూడు గ్రాముల పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఆహారం ద్వారా అందే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం మొదలైన వాటికి చెక్ పెడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. నువ్వుల్లో అధిక శాతం ఉండే అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ తదితరాల వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడం, అధిక ట్రై గ్లిసెరైడ్స్ అదుపులోకి వస్తుంది.
నువ్వుల్లోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ మొదలైనవి అధిక రక్తపోటును అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో ఎముకల దృఢత్వానికి అవసరమయ్యే క్యాల్షియం కూడా ఎక్కువే. ఐరన్, కాపర్, సెలీనియం, మాంగనీసు లాంటి ఖనిజాలు అధికంగా ఉండే నువ్వులు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి మంచివి. నూనె తొలగించిన నువ్వుల పప్పు లేదా తెలగ పిండిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎదిగే పిల్లలకు, బాలింతలకు, ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి తెలగ పిండి మంచి ఆహారం. నువ్వుల్లోని ఫైటో ఈస్ట్రోజన్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను కొంతమేరకు నియంత్రిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. నువ్వులను పొడి చేసి కూరల్లో వేయడం, కొద్దిగా బెల్లంతో కలిపి లడ్డులా తీసుకోవడం, తాలింపులో, రోటి పచ్చళ్లలో వాడడం ఇలా రకరకాలుగా ఆహారంలో భాగం చేసుకుంటే అందరికీ మంచిదే. అయితే అధిక క్యాలరీలు ఉంటాయి కాబట్టి రోజుకు పదిహేను గ్రాములకు మించకుండా చూసుకోవాలి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
unday.aj@gmail.com కు పంపవచ్చు)
Updated Date - Nov 02 , 2025 | 12:05 PM