West Bengal Shocker: సామూహిక భోజనాల్లో గొడవ.. గుడ్లు ఎక్కువగా తిన్న యువకుడి హత్య
ABN, Publish Date - Nov 02 , 2025 | 02:11 PM
పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రెండు గుడ్లు ఎక్కువగా తిన్న ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా చంపేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పరిమితికి మించి గుడ్లు తిన్న ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. హుగ్లీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని 26 ఏళ్ల రామచంద్ర ఘోషాల్‌గా గుర్తించారు(Hooghly man beaten to death).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని లహా బజార్ ప్రాంతంలో జగద్ధాత్రి పూజ ముగింపును పురస్కరించుకుని శుక్రవారం నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం భక్తుల కోసం స్థానిక క్లబ్ ఒకటి సామూహిక భోజనాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ ఒక్కో గుడ్డును కేటాయించగా రామచంద్ర ఘోషాల్ తనకు కేటాయించినది పోను తన స్నేహతులకు ఇచ్చిన రెండు గుడ్లు అధికంగా తినేశాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం జరిగింది (Fight Over Eggs turns Fatal).
ఆ తరువాత రామచంద్ర ఇంటికి వెళుతున్న తరుణంలో మరోసారి వారి మధ్య వివాదం తలెత్తింది. దీంతో, రామచంద్ర స్నేహితులు అతడిని దారుణంగా కొట్టారు. గాయాలపాలైన రామచంద్రను రాజు మైతీ అనే నిందితుడు స్థానికంగా ఉన్న ఓ వెయిటింగ్ రూమ్‌లో కూర్చోపెట్టి వెళ్లిపోయాడు. అచేతనంగా పడి ఉన్న రామచంద్రను స్థానికులు కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. రామచంద్ర తల్లిదండ్రులకు అతడు ఒక్కడే సంతానం కావడంతో వారు శోక సంద్రంలో కూరుకుపోయారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపై ఎవరెవరు దాడి చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యోదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీస్ ఔట్ పోస్టు కూతవేటు దూరంలో ఉన్నా వారు జోక్యం చేసుకోకపోవడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేసినా ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
బెంగళూరులో దారుణం.. సీనియర్ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!
Updated Date - Nov 02 , 2025 | 02:19 PM