Share News

Delhi Woman Stabbed: వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:45 PM

ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహితను ఆమె లవర్ భర్త ముందే దారుణంగా హత్య చేశాడు. భర్త తిరగబడి దాడి చేయడంతో నిందితుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

Delhi Woman Stabbed: వివాహేతర సంబంధం..  భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
Pregnant Woman Stabbing In Delhi

ఇంటర్నెట్ డెస్క్: వివాహేతర సంబంధం మరో కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇద్దరి మరణానికి కారణమైంది. ఢిల్లీలో ఓ వ్యక్తి బహిరంగంగా ఓ మహిళను ఆమె భర్త కళ్ల ముందే హత్య చేశాడు. భార్యను కాపాడుకునే ప్రయత్నంలో నిందితుడిపై తిరగబడ్డ భర్త అతడిని అంతమొందించాడు. ఈ షాకింగ్ ఘటన రామ్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది (Delhi Pregnant Woman Stabbed).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, షాలిని (22) అనే వివాహితకు ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ఆకాశ్ (23) ఆటో డ్రైవర్. స్థానికంగా నివసించే శైలేంద్ర (32)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో షాలిని గర్భం దాల్చింది. అయితే, తనను కాదని భర్తతో ఉండేందుకు షాలిని నిర్ణయించడంతో శైలేంద్ర కోపంతో రెచ్చిపోయాడు.


శనివారం రాత్రి షాలిని తన తల్లిని చూసేందుకు భర్తతో కలిసి అతడి ఆటోలో వెళుతుండగా శైలేంద్ర అకస్మాత్తుగా ఆకాశ్‌పై దాడి చేశాడు. అతడు తప్పించుకోగా శైలేంద్ర దృష్టి ఆటోలో ఉన్న షాలినిపై పడింది. దీంతో, అతడు రెచ్చిపోయి ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. భార్యను కాపాడే క్రమంలో ఆకాశ్ శైలేంద్రపై తిరగబడి అతడిని కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురినీ ఆసుపత్రికి తరలించగా శైలేంద్ర, షాలిని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆకాశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షాలిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

షాలిని, ఆకాశ్‌ల మధ్య కొన్నేళ్ళ క్రితం మనస్పర్థలు వచ్చాయని ఆమె తల్లి తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె శైలేంద్రకు దగ్గరైందని వెల్లడించింది. ఇద్దరు కొంతకాలం కలిసున్నారని కూడా పేర్కొంది. అయితే భార్యాభర్తలు మళ్లీ రాజీపడి ఇద్దరు పిల్లలతో కలిసుండటం ప్రారంభించారని చెప్పింది. అప్పటికే షాలినీ గర్భం దాల్చడంతో ఆ బిడ్డ తండ్రి తానేనని శైలేంద్ర భావించినట్టు పోలీసులు తెలిపారు. కానీ, తన కడుపులో బిడ్డకు తండ్రి తన భర్తేనని షాలినీ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శైలేంద్ర ఈ దారుణానికి పాల్పడ్డాడని అన్నారు.


ఇవి కూడా చదవండి:

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 04:05 PM