Ropar Range DIG Case: పంజాబ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇళ్లల్లో సోదాలు.. రూ.5 కోట్లు లభ్యం
ABN , Publish Date - Oct 17 , 2025 | 08:22 AM
అవినీతి కేసుకు సంబంధించి పంజాబ్‌లోని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సీబీఐ రెయిడ్ నిర్వహించగా భారీగా నగదు పట్టుబడింది. రూ.5 కోట్ల నగదు, ఖరీదైన కార్లు, నగలు అధికారులకు చిక్కాయి
ఇంటర్నెట్ డెస్క్: సీబీఐ వలకు మరో భారీ అవినీతి చేప చిక్కింది. రోపార్ రేంజ్ (పంజాబ్) డీఐజీ హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌కు చెందిన ఇళ్లల్లో గురువారం సీబీఐ జరిపిన సోదాల్లో ఏకంగా రూ.5 కోట్ల నగదు, లగ్జరీ కార్లు, నగలు, ఖరీదైన వాచ్‌లు లభించాయి (DIG Ropar Range Corruption Case).
2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి భుల్లర్.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన ఆకాశ్ భట్టా అనే వ్యాపారి భుల్లర్ తనను వేధిస్తున్నాడని ఐదు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తాను స్క్రాప్ డీలర్ అని, తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని భుల్లర్ బెదిరించారని ఆరోపించారు. తొలుత రూ.8 లక్షలు ఇచ్చి ఆపై నెలనెలా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. మ్యాటర్ సెటిల్ చేసుకోకపోతే చుక్కలు చూపిస్తానంటూ కృష్ణ అనే మధ్యవర్తి ద్వారా తనను బెదిరించారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణ అనంతరం సీబీఐ కేసు నమోదు చేసుకుని భుల్లర్‌పై ఉచ్చు బిగించింది. కృష్ణ చేసిన బెదిరింపు కాల్స్‌పై నిఘా పెట్టింది. ఈ క్రమంలో భుల్లర్ తరపున కృష్ణ బాధితుడి నుంచి రూ.8 లక్షల తీసుకుంటుంటగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తరువాత డబ్బు ఇచ్చినట్టు ఫిర్యాదు దారుడితో డీఐజీకి కాల్ చేయించింది. దీంతో తనను కలవాలని వారికి డీఐజీ సూచించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు భుల్లర్‌ను, కృష్ణను మోహాలీలోని ఆయన ఆఫీసులో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం రోపార్, మోహాలీ, చండీగఢ్‌లో భుల్లర్‌కు సంబంధించి పలు చోట్ల గురువారం సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో రూ. 5 కోట్ల నగదుతో పాటు 1.5 కేజీల బంగారం, మెర్సిడీజ్, ఆడీ కార్లు, 22 ఖరీదైన రిస్ట్ వాచులు, 40 లీటర్ల ఇంపోర్టెడ్ మద్యం, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. భుల్లర్‌కు మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ నివాసంలో రూ.21 లక్షల నగదు కూడా అధికారులు లభించింది. నేడు అధికారులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి:
మోదీకి ట్రంప్ అంటే భయం.. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత ప్రకటనపై రాహుల్ గాంధీ
మీ 4వ భార్యకు నెలకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సిందే.. ఎంపీకి తేల్చి చెప్పిన హైకోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి