Rahul Gandhi-Modi: మోదీకి ట్రంప్ అంటే భయం.. రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేత ప్రకటనపై రాహుల్ గాంధీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:36 AM
రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతకు మోదీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో కలకలం రేపాయి. ఈ పరిణామంపై స్పందించిన రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి ట్రంప్ అంటే భయమని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం భారీ కలకలాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత విదేశాంగ విధానాన్ని మోదీ ట్రంప్ చేతుల్లో పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మోదీకి ట్రంప్ అంటే భయం అని వ్యాఖ్యానించారు (Rahul Gandhi Criticism of Modi).
‘ప్రధాని మోదీకి ట్రంప్ అంటే భయం. రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. ట్రంప్ ఏం చేసినా పట్టించుకోకుండా శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదు’ అంటూ పోస్టు పెట్టారు (Trump on India Purchasing Russian Oil).
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ట్రంప్ కామెంట్స్‌పై స్పందించింది. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. రష్యాకు భారత్ సన్నిహిత మిత్రదేశమని గుర్తు చేసింది. భారత గౌరవాన్ని దిగజార్చారని మోదీపై మండిపడింది. ‘ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ గౌరవాన్ని దిగజార్చారు. ట్రంప్ విమర్శలకు వెనకడుగు వేశారు. రష్యా చమురు కొనుగోలు చేయబోమని హామీ ఇచ్చారు. మోదీ బలహీన ప్రధాని అని దీంతో మరోసారి స్పష్టమైంది. మోదీ చర్యల వల్ల భారత విదేశాంగ విధానం అస్తవ్యస్తంగా మారింది’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రష్యా ఎప్పటి నుంచో భారత్‌కు సన్నిహిత మిత్రదేశమని పేర్కొంది. వ్యక్తిగత స్నేహం కోసం ఈ బంధాన్ని డ్యామేజ్ చేయొద్దని కోరింది.
రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తానని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారంటూ బుధవారం డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది తక్షణం జరిగే పనికాదని, కొంత సమయం పడుతుందని కూడా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్..
ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి