Khajana Jewellery: ఖజానా దొంగల నేర చరిత్రపై ఆరా..
ABN, Publish Date - Aug 15 , 2025 | 09:32 AM
నగరంలో సంచలనం సృష్టించిన ఖజానా జువెలరీ షాపు దోపిడీ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఎస్‌ఓటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ విభాగాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల మీదుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ఖజానా జువెలరీ షాపు(Khajana Jewellery Shop) దోపిడీ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీసులు ముమ్మరం చేశారు. ఎస్‌ఓటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్ విభాగాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల మీదుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ(CCTV) దృశ్యాలు, ఆధారాలతో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం నగరం నుంచి బీదర్ పారిపోయిన దొంగలు అక్కడి నుంచి మహారాష్ట్రలోని పుణేకు వెళ్లారు.
అక్కడ ముఠాలోని కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మిగతా వారితో పాటు దోపిడీ సూత్రధారులు, పాత్రధారులందరినీ అదుపులోకి తీసుకొన్న తర్వాతే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అప్పటి వరకు దొంగలను వివిధ కోణాల్లో విచారించనున్నారు. దొంగల ముఠా సభ్యులు ఏ ప్రాంతానికి చెందిన వారు, నగరానికి ఎప్పుడు వచ్చారు.. ఎన్ని రోజుల పాటు నగరంలో ఉన్నారు,
దోపిడీకి ముందు రెక్కీ ఎలా నిర్వహించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. భారీ దోపిడీకి స్కెచ్ వేసినా, కేవలం 10 కిలోల వెంబడి ఆభరణాలు, కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో దొంగలు వెళ్లిపోయారు. అయితే పట్టపగలే రద్దీగా ఉన్న ప్రాంతంలో దోపిడీకి పాల్పడడాన్ని పోలీసులు చాలెంజ్‌గ్‌గా తీసుకున్నారు. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపైనే ఈ సంఘటన జరగడం సవాల్‌గా మారింది. కేసును స్వయంగా సీపీ పర్యవేక్షిస్తున్నారు.
బిహార్ ముఠాగా అనుమానం?
దోపిడీ జరిగిన ప్రాంతంలోని సెల్‌టవర్స్ ద్వారా ఆయా సమయాల్లో కొన్ని మొబైల్ నంబర్స్‌ను పరిగణనలోకి తీసుకొని వారికి పోలీసులు ఫోన్ చేశారు. అందులో కొందరి ఫోన్లు స్విచ్చాఫ్ ఉన్నాయని, ప్రాథమిక సమాచారం ప్రకారం బిహార్‌కు చెందిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీ ఫుటేజీలే కీలకం
దొంగలను పట్టుకోవడంలో సీసీ టీవీ ఫుటేజీలు కీలకంగా మారాయి. దొంగలు ఖజానా జువెలరీ షాపుల్లోకి వచ్చింది మొదలుకొని లోపల వెండి వస్తువులను బ్యాగుల్లో నింపుకుంటున్న దృశ్యాలతో పాటు బయట బైకులను పార్కింగ్ చేయడం, లోపలికి రావడం, తిరిగి వాటిపై పారిపోవడం వంటివి సీసీ టీవీల్లో స్పష్టంగా ఉన్నాయి. వీటితో పాటు దొంగలు పారిపోయిన మార్గాల్లోనూ సీసీ ఫుటేజీలనే ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2025 | 09:35 AM