Leopard attack: నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:18 AM
శ్రీశైలం సమీపంలోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుత కలకలం రేపింది. నిద్రిస్తున్న సమయంలో ఓ మూడేళ్ల చిన్నారిని చిరుత పులి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయగా.. గూడెం వాసులు కేకలు వేయడంతో పొదల్లో వదిలేసి వెళ్లింది.
స్థానికులు కేకలు వేయడంతో పొదల్లో వదిలేసి పరుగు
పాప తలకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లాలో ఘటన
ఆత్మకూరు/పెద్దదోర్నాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం సమీపంలోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుత కలకలం రేపింది. నిద్రిస్తున్న సమయంలో ఓ మూడేళ్ల చిన్నారిని చిరుత పులి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయగా.. గూడెం వాసులు కేకలు వేయడంతో పొదల్లో వదిలేసి వెళ్లింది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధిత పాపకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడెంకు చెందిన కుడుముల అంజయ్య, భార్య లింగేశ్వరి, వారి కుమార్తె అంజమ్మ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన చిరుతపులి అంజయ్య పక్కనే నిద్రిస్తున్న అంజమ్మ తలను నోటికి కరుచుకొని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లసాగింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఏడవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా లేచి.. కర్ర చేతపట్టుకుని కేకలు వేస్తూ దాని వెంటపడ్డాడు. విషయం తెలుసుకున్న గూడెంవాసులు కూడా వారికి తోడయ్యారు. దీంతో కొంత దూరంలో పులి ఆ చిన్నారిని చెట్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయింది.
ఈ ఘటనలో చిన్నారి తలకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ మహేష్ చిన్నారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారిని మెరుగైన వైద్యం కోసం దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండగా తమ గూడేనికి విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్లే వన్యప్రాణుల నుంచి ముప్పు వాటిల్లిందని, విద్యుత్ సరఫరా అందించాలని స్థానికులు గురువారం దోర్నాల-శ్రీశైలం రోడ్డుపై ధర్నా చేపట్టారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దోర్నాల పోలీసు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. గూడేనికి విద్యుత్ సరఫరా అందించేలా చొరవ తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు.