Hyderabad: మద్యానికి డబ్బుల కోసం నిత్యం వేధింపులు.. తల్లి చేతిలో కుమారుడు హతం..
ABN, Publish Date - Oct 11 , 2025 | 07:46 AM
ఇళ్ల్లలో పని చేస్తూ తల్లి జీవనం సాగిస్తుంటే, జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు డబ్బు కోసం నిత్యం ఆమెను వేధించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక మరో ఇద్దరితో కలిసి అతడిని గొంతు నులిమి హత్య చేసింది.
- భరించలేక హత్య చేసిన తల్లి
- నిద్రలో చనిపోయాడని నమ్మించే యత్నం
- అనుమానం రావడంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
- తల్లి, మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: ఇళ్ల్లలో పని చేస్తూ తల్లి జీవనం సాగిస్తుంటే, జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు డబ్బు కోసం నిత్యం ఆమెను వేధించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక మరో ఇద్దరితో కలిసి అతడిని గొంతు నులిమి హత్య చేసింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన గంగులమ్మ (50) సుమారు 20 సంవత్సరాల క్రితం కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి నగరానికి వచ్చింది. బేగంపేట ఉమానగర్(Begumpet Umanagar)లోని ఓ ఇంట్లో వాచ్‌మన్ గదిలో ఉంటూ ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఆమె కుమారుడు ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగే వాడు. మద్యానికి బానిసై తాగడానికి డబ్బుల కోసం నిత్యం తల్లిని వేధించే వాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆమెను కొట్టేవాడు. తాగొచ్చి మళ్లీ కొట్టేవాడు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ కావడంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. వేరే ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న అతనికి చెప్పింది. అతను సరే అనడంతో గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అతడిని ఇంటికి పిలిపించింది. అతను మరో వ్యక్తిని తీసుకుని వచ్చాడు. మద్యం మత్తులో హర్షవర్ధన్ నిద్రపోతుండగా గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం తోడుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
శుక్రవారం ఉదయం వరకు కుమారుడి మృతదేహం ఉన్న గదిలోనే ఆమె ఉంది. ఉదయం కుమారుడు ఎంత లేపినా లేవడం లేదని స్థానికులకు చెప్పింది. ఏడుస్తూ కుమారుడి మృతదేహం వద్దే ఏమీ తెలియనట్టు కూర్చుంది. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. మృతదేహాన్ని పాడె ఎక్కించే క్రమంలో మెడపై గాయాలు కనిపించాయి. స్థానికులకు అనుమానం వచ్చి పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ అక్కడికి వచ్చి ఆమెను విచారించగా వేధింపులు భరించలేకే మరో ఇద్దరితో కలిసి టవల్‌తో గొంతు నులిమి కుమారుడిని హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 11 , 2025 | 07:46 AM