Hyderabad: దేవుడా.. పండగ ముందు ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Sep 30 , 2025 | 11:27 AM
క్రికెట్ మ్యాచ్ చూసి అర్ధరాత్రి బైక్‌పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
- రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
- మరో యువకుడికి తీవ్రగాయాలు
హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్ చూసి అర్ధరాత్రి బైక్‌పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. జీడిమెట్ల పోలీసుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ రుక్మిణీ ఎస్టేట్, ప్రకృతి వనం అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న బోయ నాగరాజు(Boya Nagaraju) కుమారుడు బోయ రాజ్‌గౌరవ్(19) గండిమైసమ్మ సమీపంలోని మహేంద్ర యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
28వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి రంగానగర్ స్టార్‌లైట్ అపార్టుమెంట్‌లో నివాసముంటున్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. 29వ తేదీ అర్ధరాత్రి సమయంలో మరో స్నేహితుడు సాయిఅక్షిత్‌తో కలిసి ఐడీపీఎల్(IDPL) వైపు వేగంగా వస్తున్నాడు. ఓ జిమ్‌వద్దకు రాగానే వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్డారు.
ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రాజ్‌గౌరవ్ తలకు బలమైనగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బండి వెనుక కూర్చున్న సాయిఅక్షిత్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ మేరకు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాయుడు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
Updated Date - Sep 30 , 2025 | 11:27 AM