Chennai News: పగబట్టిన ప్రేమోన్మాదం.. విద్యార్థిని దారుణ హత్య
ABN, Publish Date - Nov 20 , 2025 | 12:02 PM
తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా రామేశ్వరంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
- యువకుడి అరెస్టు
చెన్నై: రామనాథపురం జిల్లా రామేశ్వరం(Rameshwaram)లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్లస్-2 చదువుతున్న బాలికను ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేయగా, ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామేశ్వరం సేరాంకోట మత్స్యకారుల కాలనీకి చెందిన మారియప్పన్ కుమార్తె షాలిని (17) బాలికోన్నత పాఠశాలలో ప్లస్-2 చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన మునిరాజ్ అనే యువకుడు కొన్ని రోజులుగా షాలినిని స్కూలుకు వెళుతున్నప్పుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేక షాలిని రెండు రోజుల క్రితం ఆ యువకుడిని తనను వెంబడించవద్దని తీవ్రంగా మందలించింది.
దీంతో బుధవారం ఉదయం షాలిని స్కూలు వెళ్తుండగా మునిరాజ్ వెంబడించాడు. దారిలో వేటకొడవలితో దాడి చేసి, గొంతు కోయడం తో పాటు శరీరమంతా తూట్లు పొడిచాడు. రక్తపు మడుగులో పడిన విద్యార్థినిని స్థానికులు వెంటనే రామేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ సంఘటనపై పోలీసు లు కేసు నమోదు చేసుకుని మునిరాజ్‌ను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనను ఖండిస్తూ షాలిని కుటుంబీకులు, బంధువులు, స్థానికులు ధర్నా చేయడంతో రామేశ్వరం - మదురై రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈపీఎస్, అన్బుమణి ఖండన...
రామేశ్వరంలో విద్యార్థిని దారుణహత్యను ఖండిస్తూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, పాట్టాలి మక్కల్ కట్చి నాయకుడు డాక్టర్ అన్బుమణి ప్రకటనలు జారీ చేశారు. డీఎంకే పాలనలో స్కూలుకు వెళ్లే బాలికలకు కూడా రక్షణ లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నా ముఖ్యమంత్రి స్టాలిన్ నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గర్హనీయమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 20 , 2025 | 12:02 PM