Amity University Assault: స్టూడెంట్‌కు 26 సార్లు చెంప దెబ్బలు.. అమిటీ యూనివర్సిటీలో దారుణం
ABN, Publish Date - Sep 06 , 2025 | 06:13 PM
లఖ్నవూలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థిని కొందరు విద్యార్థులు పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించి అవమానించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూలోని అమిటీ యూనివర్సిటీలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ విద్యార్థిని అతడి క్లాస్‌మేట్స్ పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించారు. కారులో అతడిని కూర్చోబెట్టి వద్దని వేడుకుంటున్నా లెక్క చేయక పదేపదే చెంపలు వాయించారు. క్యాంపస్ ఆవరణలోని పార్కింగ్ స్థలంలో ఈ దారుణం జరిగింది (Amity University Lucknow assault).
ఆగస్టు 26న బాధిత విద్యార్థి శిఖర్ ముఖేశ్ కేశర్వానీ తన్న స్నేహితురాలితో కలిసి కారులో యూనివర్సిటీకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. బాధితుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, శిఖర్ తన స్నేహితురాలి కారులో కాలేజీకి వెళ్లాడు. క్యాంపస్ పార్కింగ్ స్థలంలో కారు నిలిపిన సందర్భంలో అతడిని కొందరు విద్యార్థులు అడ్డగించారు. కారులో కూర్చోపెట్టి పలుమార్లు చెంప వాయించారు.
చేయి అడ్డుపెట్టావంటే ఇంకా ఎక్కువగా దెబ్బలు పడతాయంటూ బెదిరించారు. 45 నిమిషాల పాటు నరకం చూపించారు. అతడిని కొట్టిన వారిలో ఓ విద్యార్థిని కూడా ఉంది. ఈ ఘటన తరువాత తన కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, కాలేజీకి వెళ్లడం మానేశాడని బాధితుడి తండ్రి వాపోయారు. వాళ్లు తన కొడుకుని నోటికొచ్చినట్టు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కూడా ధ్వంసం చేశారని, మళ్లీ కాలేజీకి వస్తే ఊరుకునేది లేదంటూ బెదిరించారని అన్నారు.
ఘటనపై స్పందించిన సీనియర్ పోలీసు అధికారి దినేశ్ చంద్ర మిశ్రా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా ఐదుగురు విద్యార్థుల పేర్లు చేర్చామని వెల్లడించారు. అయితే, విద్యార్థుల మధ్య గొడవకు కారణం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. రిటైర్డ్ ఉద్యోగినుంచి లక్షల దోపిడీ..
ఎర్రకోట వద్ద భారీ చోరీ.. కోట్ల విలువైన బంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ
Updated Date - Sep 06 , 2025 | 06:19 PM