Kalash Stolen From Red Fort: ఎర్రకోట వద్ద భారీ చోరీ.. కోట్ల విలువైన బంగారు వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగ
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:32 PM
ఓ దొంగ ఆ బంగారు ఆభరణాల గురించి తెలుసుకుని చోరీకి సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బుధవారం జైన సన్యాసిలా దుస్తులు వేసుకుని పూజలు జరిగే స్టేజి దగ్గరకు వచ్చాడు.
ఎర్రకోటలో మరో సారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ దొంగ కోట్లు విలువ చేసే బంగారు వస్తువులను ఎత్తుకెళ్లిపోయాడు. వివారాల్లోకి వెళితే.. ఎర్రకోట ప్రాంగణంలో జైన మతానికి చెందిన కార్యక్రమం ఒకటి జరుగుతోంది. మొత్తం పదిరోజుల కార్యక్రమం అది. రెండు బంగారు కలశాలతో పాటు వజ్రాలు పొదిగిన మరికొన్ని బంగారు వస్తువులను పూజల్లో ఉంచారు. ఓ దొంగ ఆ బంగారు ఆభరణాల గురించి తెలుసుకుని చోరీకి సిద్ధపడ్డాడు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. బుధవారం జైన సన్యాసిలా దుస్తులు వేసుకుని పూజలు జరిగే స్టేజి దగ్గరకు వచ్చాడు.
నిర్వాహకులందరూ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగ తన పని మొదలుపెట్టాడు. పవిత్రమైన బంగారు వస్తువులు పెట్టిన స్టేజి దగ్గరకు వెళ్లాడు. బంగారు వస్తువుల్ని సంచిలో వేసుకుని మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు. నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి స్టేజి దగ్గరకు వచ్చారు. అక్కడ బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఆ బంగారు వస్తువుల యజమాని సుధీర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వస్తువులు అందంగా కనిపించాలని వాటిపై విలువైన రాళ్లు పొదిగించాము. కానీ, కలశాలు మాత్రం మా సెంటిమెంట్లకు సంబంధించినవి. ఆ వస్తువులకు విలువ కట్టలేము. దొంగను పోలీసులు గుర్తించారు. వీలైనంత త్వరగా అతడ్ని పట్టుకుంటారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సీసీటీవీల్లో భయానక దృశ్యాలు.. జైలు వార్డర్‌పై సుత్తితో దాడి చేసి..
ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు