No Salary Hike: ప్రముఖ సంస్థకు రూ.12,760 కోట్ల ప్రాఫిట్.. అయినప్పటికీ ఉద్యోగులకు నో శాలరీ హైక్
ABN, Publish Date - Jul 11 , 2025 | 08:06 PM
ఏదైనా సంస్థ లాభాల్లో దూసుకెళ్తే ఆ విజయాన్ని ఉద్యోగులతో బోనస్‌లు, వేతనాల రూపంలో పంచుకోవడం సాధారణం. కానీ దేశంలో అగ్రగామి కంపెనీ అయిన TCS మాత్రం ఈసారి విభిన్నంగా వ్యవహరించింది. ఇటీవల సంస్థకు భారీ లాభాలు వచ్చినా కూడా ఉద్యోగులకు హైక్ ప్రకటించలేదు.
సాధారణంగా ఏదైనా కంపెనీకి లాభాలు వస్తే ఉద్యోగులకు బోనస్ లేదా హైక్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ ప్రముఖ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ప్రస్తుతం హైక్ ఇవ్వడం (No Salary Hike) లేదని తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ జులై 11న ప్రకటించారు. ఇది తెలిసిన ఈ సంస్థ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
లాభం వచ్చినా..
2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో TCS అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.12,040 కోట్లుగా ఉన్న నికర లాభం.. ఈ ఏడాది 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరింది. దీంతో ఆదాయం 1.3 శాతం వృద్ధి చెంది రూ.63,437 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సంస్థ ఆపరేటింగ్ లాభం మార్జిన్ 0.3 శాతం మెరుగై, 24.5 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక విజయం TCS బలమైన వ్యాపార వ్యూహాన్ని సూచిస్తుంది.
ఉద్యోగుల్లో నిరాశ
సాధారణంగా TCS ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి జీతం పెంపు విధానాన్ని పాటిస్తుంది. కానీ, ఈ సంవత్సరం జీతం పెంపు విషయంలో నిర్ణయం తీసుకోవడంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, సంవత్సరంలో ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటామని మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ ప్రకటన ఉద్యోగుల్లో నిరాశను కలిగించింది. ఎందుకంటే భారీ లాభాలను సాధిస్తున్న సంస్థ నుంచి సాధారణంగా ఉద్యోగులు జీతాల పెంపు ఆశిస్తారు.
ఉద్యోగ నియామకాలు
TCS గత సంవత్సరం 42,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారిని చేర్చుకోవడంలో ఆలస్యం జరిగింది. అయినప్పటికీ, లక్కడ్ గత ఏడాది ఇచ్చిన అన్ని ఉద్యోగ ఆఫర్లను సంస్థ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో TCS 40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులను బట్టి ఈ లక్ష్యం సవరించబడుతుందన్నారు.
TCS ఉద్యోగుల సంఖ్య పెరుగుదల
ఈ త్రైమాసికం చివరి నాటికి TCS ఉద్యోగుల సంఖ్య 6,13,069కు చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే 6,000 మంది అధికం. ఇది సంస్థ విస్తరణ, వృద్ధిని సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 08:07 PM