MG Windsor EV Pro: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్..ఒక్క సారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్..
ABN, Publish Date - May 06 , 2025 | 04:44 PM
ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్లోకి కొత్త మోడల్ విండ్సర్ ఈవీ ప్రోని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అయితే దీని ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ఈవీ మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా MG మోటార్ ఇండియా, తన కొత్త వేరియంట్ అయిన విండ్సర్ ఈవీ ప్రోని (MG Windsor EV Pro) భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీనిలో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, స్మార్ట్ టెక్నాలజీ వంటి అధునాతన డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ నుంచి మార్పు కోరుకునే వారికి చక్కని అవకాశమని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే దీని ఫీచర్లు, ధర వంటివి ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ధర, వేరియంట్లు
MG విండ్సర్ ఈవీ ప్రో ధర రూ.12,49,999 (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఇది MG Battery-as-a-Service (BaaS) పథకం కింద అందుబాటులో ఉంది. విండ్సర్ EVతో పోలిస్తే, విండ్సర్ EV ప్రో ధర రూ.50,000 ఎక్కువగా ఉంటుంది. దీనిలో మరిన్ని ఫీచర్లు మెరుగైన పనితీరును అందిస్తాయి.
బ్యాటరీ
విండ్సర్ EV ప్రో 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకేసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో విండ్సర్ EVలో ఉన్న 38 kWh బ్యాటరీతో పోలిస్తే, దాదాపు 117 కి.మీ. ఎక్కువ పరిధిని అందించడం విశేషం. రెండు వేరియంట్లలో కూడా 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను అందిస్తాయి. ప్రో వేరియంట్ 60 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 50 నిమిషాల్లో 20% నుంచి 80% వరకు ఛార్జ్ చేయగలదు.
ఇతర ఫీచర్లు, టెక్నాలజీ
విండ్సర్ EV ప్రోలో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
ADAS (ఆడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), లేన్ కీపింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ కలవు.
V2L, V2V ఛార్జింగ్: ఇతర EVలను ఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఇన్ఫినిటీ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి కూడా ఉన్నాయి.
డిజైన్, ఇంటీరియర్
విండ్సర్ EV ప్రోలో కొత్త డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ MG హెక్టర్‌లో కనిపించే డిజైన్‌తో పోలి ఉంటుంది. సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ వంటి రంగుల్లో లభిస్తున్నాయి. లేత గోధుమరంగు ఇంటీరియర్ థీమ్, సీట్లు, రూఫ్ లైనర్ వంటివి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి. ప్రో వేరియంట్‌లో పెద్ద బ్యాటరీని ప్రవేశపెట్టడం వల్ల బూట్ సామర్థ్యం 604 లీటర్ల నుంచి 579 లీటర్లకు కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. ఇది నిల్వ స్థలానికి ప్రాధాన్యత ఇచ్చే కొనుగోలుదారులు ఓసారి పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 06 , 2025 | 04:47 PM