Jane Street: 2ఏళ్లలో రూ. 36,671 కోట్ల అక్రమార్జన
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:27 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ మన మార్కెట్ వ్యవస్థను తెలివిగా బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గుర్తించింది.
డెరివేటివ్ ట్రేడింగ్‌లో అమెరికా సంస్థ జేన్ స్ట్రీట్ మాయాజాలం
సెక్యూరిటీ మార్కెట్ నుంచి కంపెనీని నిషేధించిన సెబీ
రూ.4,843 కోట్ల అక్రమ లాభాలు తిరిగి చెల్లించాలని ఆదేశం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ మన మార్కెట్ వ్యవస్థను తెలివిగా బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గుర్తించింది. అందుకుగాను, జేన్ స్ట్రీట్ గ్రూప్‌ను సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధించిన సెబీ.. రూ.4,843 కోట్ల అక్రమ లాభాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటివరకు మార్కెట్ సంస్థ నుంచి సెబీ జప్తు చేసుకోనున్న అతిపెద్ద మొత్తమిదే.
రెండు వ్యూహాలతో మోసం
అధిక లావాదేవీలు జరిగే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ సూచీల స్థాయిలను కృత్రిమంగా పెంచడం లేదా తగ్గించడం ద్వారా జేన్ స్ట్రీట్ గ్రూప్ ఈ భారీ మోసానికి పాల్పడిందని సెబీ గుర్తించింది. ప్రధానంగా ఈ రెండు సూచీ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా రూ.36,671 కోట్లు పోగేసింది. 2023 జనవరి నుంచి 2025 మార్చి మధ్య కాలంలో డెరివేటివ్ కాంట్రాక్టులకు సంబంధించి 21 ఎక్స్‌పైరీ (గడువు) తేదీల్లో ఈ గ్రూప్ తన చేతివాటాన్ని ప్రదర్శించిందని నియంత్రణ మండలి దర్యాప్తులో వెల్లడైంది. ఆ గడువు తేదీల్లో సూచీల గమనాన్ని ప్రభావితం చేసి ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్ల ద్వారా భారీగా గడించేందుకు ఈ గ్రూప్ కంపెనీలు క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో భారీ ఎత్తున లావాదేవీలు నెరిపాయంటోంది. ఇందుకోసం జేన్ స్ట్రీట్ రెండు వ్యూహాలను ఎంచుకుంది. 1. ఇంట్రాడే ఇండెక్స్ మ్యానిపులేషన్ స్ట్రాటజీ. 2. మార్కింగ్ ది క్లోజింగ్ స్ట్రాటజీ.
ఇంట్రాడే ఇండెక్స్ మ్యానిపులేషన్ స్ట్రాటజీ
ఉదయం సెషన్‌లో బ్యాంక్ నిఫ్టీ సూచీ నమోదిత షేర్లు, వాటి ఫ్యూచర్స్‌లో పెద్దఎత్తున కొనుగోళ్లు జరపడం ద్వారా కృత్రిమంగా వాటి ధరలతోపాటు వాటికి గిరాకీ పెంచడం. ఉద యం కొనుగోలు చేసిన షేర్లు, ఫ్యూచర్స్‌లో మధ్యాహ్నం సెషన్ నుంచి ఉన్నఫళంగా అమ్మకాలకు పాల్పడటం ద్వారా వాటి ధరలను ఒక్కసారిగా తగ్గించడం చేసింది. తద్వారా జేన్ స్ట్రీట్ అప్పటికే తీసుకున్న ఇండెక్స్ ఆప్షన్స్ పొజిషన్ల ద్వారా భారీగా లాభం గడించింది.
మార్కింగ్ ది క్లోజింగ్ స్ట్రాటజీ
డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ తేదీ నాడు చివరి రెండు గంటల ట్రేడింగ్‌లో పెద్దఎత్తున కొనుగోలు లేదా విక్రయం ద్వారా సూచీల గమనాన్ని ఒక్కసారిగా మార్చడం ద్వారా జేన్ స్ట్రీట్ షార్ట్ కాల్ లేదా లాంగ్ పుట్ పొజిషన్ల ద్వారా లబ్ది పొందినట్లు సెబీ గుర్తించింది.
ఇండెక్స్ ఆప్షన్స్‌లో రూ.44,358 కోట్ల లాభం
పై రెండు వ్యూహాలను అనుసరించి జేన్ స్ట్రీట్.. ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా రెండేళ్లకు పైగా కాలంలో రూ.44,358 కోట్లు ఆర్జించింది. ఇంత భారీ స్థాయిలో గడించేందుకు స్టాక్స్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లు, క్యాష్ మార్కెట్లో రూ.288 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అంటే, నికరంగా రూ.36,671 కోట్లు గడించింది.
సెబీ చేపట్టిన చర్యలివి..
శుక్రవారం జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల ప్రకారం.. జేన్‌స్ట్రీట్ గ్రూప్‌నకు చెందిన జేఎస్ఐ (జేన్ స్ట్రీట్ ఇండియా) ఇన్వె్‌స్టమెంట్స్, జేఎ్‌సఐ2 ఇన్వె్‌స్టమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలను సెక్యూరిటీస్ మార్కెట్ లావాదేవీల నుంచి తదుపరి ఆదేశాలిచ్చే వరకు నిషేధం విధించింది. అలాగే, ఈ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిషేధ కాలంలో జేన్ స్ట్రీట్ కంపెనీలు మన మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా షేర్ల కొనుగోలు, విక్రయాలు లేదా ఇతర కార్యకలాపాలకు నెరిపేందుకు వీలుండదు.
డెరివేటివ్ ట్రేడింగ్‌లో వ్యవస్థాగత అక్రమాలకు పాల్పడటం ద్వారా ఆర్జించిన రూ.4,843.57 కోట్ల అయాచిత లాభాలను తిరిగి చెల్లించాలని ఆదేశం. జేన్ స్ట్రీట్ ఈ మొత్తాన్ని సెబీ ఎస్ర్కో ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు కంపెనీలు భారత్‌లోని తమ ఆస్తులను విక్రయించేందుకు కూడా వీల్లేకుండా సెబీ ఆంక్షలు విధించింది.
జేన్ స్ట్రీట్ కంపెనీల బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ అకౌంట్లు, కస్టోడియల్ అకౌంట్లను సెబీ స్తంభింపజేసింది. అంటే, సెబీ అనుమతి లేకుండా ఈ ఖాతాల్లోంచి సొమ్ము ఉపసంహరణకు వీలుండదు.
భవిష్యత్‌లో జేన్ స్ట్రీట్ కంపెనీల కార్యకలాపాలను నిశితంగా గమనించాలని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను నియంత్రణ మండలి నిర్దేశించింది.
ఇలా బయటపడింది..
మిలీనియం మేనేజ్‌మెంట్‌తో జేన్ స్ట్రీట్ వివాదంపై 2024 ఏప్రిల్‌లో మీడియాలో కథనాలు వచ్చాయి. అనైతిక ట్రేడింగ్ వ్యూహం ద్వారా జేన్ స్ట్రీట్ భారత డెరివేటివ్ మార్కెట్ నుంచి 100 కోట్ల డాలర్లు ఆర్జించిందని మిలీనియం మేనేజ్‌మెంట్ ఆరోపించింది. ఆ కథనం ఆధారంగానే సెబీ జేన్‌స్ట్రీట్ గ్రూప్‌పై దర్యాప్తు ప్రారంభించింది.
ఒక్కరోజే రూ.735 కోట్ల లాభం
గత ఏడాది జనవరి 17న జేన్ స్ట్రీట్ ఇంట్రాడేలో సూచీ గతిని ఒక్కసారిగా మార్చడం ద్వారా ఏకంగా రూ.750 కోట్ల లాభం ఆర్జించిందట. దలాల్‌స్ట్రీట్‌లో ఈ గ్రూప్‌నకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు లాభమని సెబీ దర్యాప్తులో తేలింది.
4 కంపెనీల ద్వారా భారత్‌లో ట్రేడింగ్ కార్యకలాపాలు
అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీ అయిన జేన్ స్ట్రీట్ గ్రూప్ ఎల్‌ఎల్‌సీ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఆల్గో ట్రేడింగ్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఈ గ్రూప్‌నకు చెందిన అమెరికా, యూరప్, ఆసియాలోని ఐదు కార్యాలయాల్లో 2,600 మందికి పైగా పనిచేస్తున్నారు. 45 దేశాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు నెరుపుతోందీ గ్రూప్. గ్రూప్‌నకు చెందిన 4 కంపెనీలు భారత మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు జరుపుతున్నాయి. అందులో జేఎ్‌సఐ ఇన్వె్‌స్టమెంట్స్ ముంబై కేంద్రంగా 2020 డిసెంబరులో ఏర్పాటైంది. జేఎ్‌సఐ ఇన్వె్‌స్టమెంట్స్ అనుబంధ విభాగమైన జేఎస్‌ఐ2 ఇన్వె్‌స్టమెంట్స్ కూడా ముంబై కేంద్రంగా 2024 సెప్టెంబరులో ప్రారంభమైంది. జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా సింగపూర్, హాంకాంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మన మార్కెట్లో సెబీ నమోదిత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)గా ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
కొనసాగుతున్న సెబీ దర్యాప్తు
జేన్ స్ట్రీట్‌పై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెబీకి ఇప్పటివరకు 18 గడువు రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ, 3 గడువు రోజుల్లో నిఫ్టీ సూచీలో గ్రూప్ కంపెనీలు అనైతిక ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఇతర గడువు రోజుల్లో, ఇతర సూచీల్లో, ఇతర ఎక్స్ఛేంజ్‌ల్లోనూ జేన్ స్ట్రీట్ అనైతిక ట్రేడింగ్‌కు పాల్పడిందా అన్న కోణంలోనూ సెబీ దర్యాప్తు సాగించనుందన్నారు. ఇప్పటివరకు గుర్తించిన రెండింటితోపాటు ఇంకేమైనా ట్రేడింగ్ వ్యూహాలను అనుసరించిందా అని కూడా నియంత్రణ మండలి విచారించనుందన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 05:58 AM