Gold Price: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరలు..
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:30 PM
అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుతోంది... అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో, సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర భగ్గుమంది.
* బంగారంపై సుంకాల దెబ్బ
* మనకున్న సామర్థ్యాన్ని వినియోగించడం లేదు
* బంగారం దిగుమతులపైనే ఆధారపడ్డ కేంద్రం
* ఖనిజాలను ఎక్స్‌ప్లోర్ చేయడంలేదు
* ప్రైవేట్ రంగానికి లేని ప్రోత్సాహం
Gold News: బంగారం ధరలు (Gold price) రోజురోజుకూ కొత్త రికార్డులు (Record) సృష్టిస్తున్నాయి. అసలు మధ్య తరగతివారు గోల్డ్ కొనలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు ధరలు అంతలా పెరుగుతున్నాయి.. అసలు బంగారం మైనింగ్ (Gold Mining) మన దేశం (India)లో చేస్తున్నారా.. కేజీఎఫ్ (KGF) ఎందుకు మూతపడింది.. మనకున్న సామర్థ్యంకన్నా 200 రెట్లు తక్కువగా గోల్డ్ మైనింగ్ చేస్తున్నామా..
Also Read..: బీసీసీఐ సీరియస్..ముగ్గురిపై చర్యలు..
సరికొత్త గరిష్ఠాలకు బంగారం..
అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుతోంది... అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనా మధ్య అంతకంతకూ పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో, సురక్షితమని భావించి బంగారం, వెండిపైకి పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు మేలిమి బంగారం ధర భగ్గుమంది. ఫలితంగా దేశీయ విపణిలోనూ పసిడి ధర భగ్గుమంది. అధిక సుంకాలు, వస్తువులు, ఖనిజాల ఎగుమతులపై ఆంక్షల ఫలితంగా అమెరికాలో టెక్ కంపెనీల షేర్లు, ప్రధాన సూచీలు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా డాలర్ సూచీ 100 కంటే దిగువకు చేరడంతో, పెట్టుబడులు డాలర్ నుంచి పసిడిపైకి మళ్లుతున్నాయి. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గిస్తారనే అంచనాలూ బంగారం ధర పెరిగేందుకు దోహదపడుతున్నాయంటున్నారు విశ్లేషకులు.
బంగారంపై సుంకాల దెబ్బ
బంగారం ధరలపై ట్రంప్ సుంకాల ధర గట్టిగా పడింది... ఇబ్బడి ముబ్బడిగా చైనాపై సుంకాలను పెంచుతున్నారాయన. రెండు ప్రపంచయుద్ధాలను చూసిన జనం... ఇలాంటి వాణిజ్యయుద్ధాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదు. ఇలాంటి టారిఫ్‌ల మోత పూర్తిగా కొత్త... అందుకే వాణిజ్య యుద్ధం ముదిరితే బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు.
మనకున్న సామర్థ్యాన్ని వినియోగించడం లేదు ..
బంగారం ధరలు పెరుగుతున్న మన దేశంలో ఏడు ప్రధాన గనులున్నా... పసిడి తవ్వితీయడం లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోనూ మైనింగ్ ఆగిపోయింది. మన దేశంలో బంగారం తయారు చేయడం లేదు. మనకున్న సామర్థ్యాన్ని వినియోగించడం లేదు. దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల... విదేశీ మారక ద్రవ్యం పోతోంది. ఖనిజాలను వెలికితీయాలన్న ఆసక్తి కూడా లేదు. 95 శాతం మినరల్స్‌ను మన దేశంలో అసలు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మైనింగ్‌లో మన దేశంలో పెట్టుబడులలు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ప్రతిబంధకాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం. పర్యావరణ ఆంక్షలే ప్రధాన కారణం. ప్రైవేట్ రంగానికి ... బంగారం వెలికితీతలో ఆసక్తి ఉన్నా... ప్రోత్సాహం లేదు.
రాజస్థాన్‌లోని భుకియాలో బంగారం
2005లో పాంథేరా రీసెర్సెస్ అనే కంపెనీ... రాజస్థాన్‌లోని భుకియాలో బంగారం తవ్వేందుకు ఆసక్తి చూపింది. తవ్వకాలు మొదలెట్టాక... లైసెన్స్ కావాలని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంది. అయితే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. కేజీఎఫ్‌లో మైనింగ్ 2001లో నిలిచిపోయింది. 120 ఏళ్ల కేజీఎఫ్ చరిత్రలో 800 టన్నులకుపైగా బంగారం వెలికితీశారు. కర్ణాటకలోని హట్టీలో బంగారం వెలికి తీస్తున్నారు. 85 టన్నుల వరకు ఇక్కడ గోల్డ్ తీశారు. భారత్ ప్రతిఏటా 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుండగా... కేవలం ఒక టన్నుమాత్రమే ఇక్కడ తవ్వితీస్తున్నారు. చైనాలో 1980ల్లో ఏటా 10 టన్నులే ప్రొడక్షన్ ఉండేది... ఇప్పుడు ఏటా 300 టన్నుల బంగారాన్ని గనుల్లో తవ్వితీస్తున్నారు. మన దేశంలోనూ 300 నుంచి 400 టన్నుల పసిడిని వెలికితీయొచ్చు. ఒక్క రాజస్థాన్‌లోని భుకియా ప్రాంతంలోనే 6.7 మిలియన్ ఔన్సుల బంగారం ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించుకుంది. అసలిక్కడ 550 టన్నుల గోల్డ్ ఉందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. 10 నుంచి 20 టన్నుల బంగారం ఉన్న ... చిన్న చిన్న గనులు భారత్‌లో వందల్లో ఉన్నాయి.
వెలికితీస్తే ఇండియా సుసంపన్నం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భారత్‌లో 2,191 మెట్రిక్ టన్నుల బంగారు గనులున్నాయి. మీరు నమ్మలేకపోవచ్చుగానీ ఇది నిజం... దీన్ని వెలికితీస్తే భారత్ సుసంపన్నంగా మారుతుంది. పర్యావరణ పరమైన సమస్యల వల్ల కోలార్‌లో మైనింగ్ నిలిపేసినా... సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ మైనింగ్ చేసేవీలుంది.
కర్ణాటకలోనే రాయచూర్ జిల్లాలో హట్టి గోల్డ్ మైన్స్
కర్ణాటకలోనే రాయచూర్ జిల్లాలో ఉన్నాయి హట్టి గోల్డ్ మైన్స్. ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న ఏకైక గని ఇది. మహాభారతం , రామాయణంలోనూ ఈ గని గురించి ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ తీయాల్సిన బంగారం కన్నా చాలా తక్కువే తవ్వుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రాలో బంగారం
ఉత్తర ప్రదేశ్‌లోని సోన్‌భద్రాలోనూ బంగారం గనిని 2020లో గుర్తించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ 700 టన్నుల బంగారం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే... యూపీ మొత్తం సుసంపన్నంగా మారిపోతుంది. వేలాదిమందికి ఉద్యోగాలొస్తాయి. కర్ణాటక - గోవా బోర్డర్‌లోని గనజూర్‌లో బంగారం గనులున్నాయి. ఇక్కడ పసిడిని వెలికితీసేందుకు ప్రైవేట్ కంపెనీ డెక్కన్ గోల్డ్ మైన్స్ లీజు కోసం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వం లీజికివ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో జొన్నగిరిలో గోల్డ్
ఏపీ - తెలంగాణ బోర్డర్‌లోని జొన్నగిరిలోనూ గోల్డ్ ఉంది. ఇక్కడ ఏడాదికి 1.2 టన్నుల బంగారం తవ్వితీయవచ్చు. ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నిస్తున్నా... సఫలం కావడం లేదు.
జార్ఖండ్‌లోని ఛండ్లీలో లావా గోల్డ్ మైన్స్
జార్ఖండ్‌లోని ఛండ్లీలోనూ లావా గోల్డ్ మైన్స్ ఉన్నా... ప్రస్తుతం ఖనిజాల వెలికితీయడం లేదు. ఏపీలోని రామగిరిలో 1905లోనే బంగారం మైనింగ్ చేశారు. జాన్ టేలర్ అండ్ సన్స్ ... అప్పట్లో మైనింగ్ చేశారు. ఇక్కడ నాలుగు టన్నుల బంగారం ఉందని అంచనా.
కర్ణాటకలోనే 88 శాతం బంగారం
మైనింగ్ వ్యవస్థను సంస్కరిస్తేనే భారత దేశంలో బంగారం వెలికితీత సాధ్యమవుతుంది. సత్తా ఉన్నా... దాన్ని ప్రభుత్వమే తొక్కేస్తోంది. గోల్డ్ మైనింగ్‌లో రిస్క్ కూడా చాలా ఎక్కువే. ప్రాసెసింగ్ కోసం చాలా ఖర్చు చేయాలి... ఒక్కోసారి అనుకున్న స్థాయిలో గోల్డ్ లభ్యంకాకపోతే కోట్లాది రూపాయలు కోల్పోవాల్సి ఉంటుంది. మైనింగ్ స్టార్ట్ చేశాక... స్థానికులు గానీ, పర్యావరణ సాకుతో ప్రభుత్వాలుగానీ అడ్డుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. నేషనల్ మినరల్ పాలసీని సవరించి... పెట్టుబడిదారులకు అనుకూలంగా మారిస్తేనే గోల్డ్ మైనింగ్ సాధ్యం. దేశంలోని గోల్డ్ రిజర్వ్స్‌లో కర్ణాటకలోనే 88 శాతం బంగారు ఖనిజం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
For More AP News and Telugu News
Updated Date - Apr 18 , 2025 | 12:30 PM