Income Tax Deadline: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..
ABN, Publish Date - Jun 12 , 2025 | 07:58 PM
పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్. ఎందుకంటే ముందస్తు పన్ను చెల్లించేందుకు గడువు తేదీ జూన్ 15 వరకు (Income Tax Deadline) మాత్రమే ఉంది. అయితే దీనిని గడువులోగా చెల్లించకపోతే ఏమవుతుంది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పన్నులు చెల్లించడం మన బాధ్యత మాత్రమే కాదు. గడువులోగా చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ముందస్తుగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉన్న వారికి, జూన్ 15 చాలా ముఖ్యమైన తేదీగా (Income Tax Deadline) ఉంది. ఇది కేవలం క్యాలెండర్‌లోని మరో రోజు మాత్రమే కాదు. మీరు ముందస్తు పన్ను (Advance Tax) చెల్లించాల్సిన ఆఖరి గడువు కూడా ఇదే కావడం విశేషం. ఈ తేదీని మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఫైన్లు, వడ్డీల రూపంలో అదనపు భారం భరించాల్సి ఉంటుంది.
ముందస్తు పన్ను అంటే ఏంటి
ముందస్తు పన్ను అనేది మీరు ఏడాది మొత్తం సంపాదించే ఆదాయానికి ముందుగానే చెల్లించే ఆదాయపు పన్ను. అంటే, ఏడాది ముగిసిన తరువాత మాత్రమే కాదు. ఆలోచించి ముందుగానే కొన్ని తేదీలలో విడతల వారీగా చెల్లించాల్సిన పన్ను ఇది.
ఎవరు ముందస్తు పన్ను చెల్లించాలి?
మీ ఆదాయానికి సరిపడా పన్ను బాకీ రూ.10,000కు మించి ఉంటే, మీరు ముందస్తు పన్ను చెల్లించాల్సిందే. దీనిని వేతనదారులైనా, వ్యాపారవేత్తలైనా, ఫ్రీలాన్సర్లకైనా వర్తిస్తుంది.
వేతనదారులు: జీతం కాకుండా ఇతర ఆదాయాలు ఉంటే (అద్దె, వడ్డీ లాభం, షేర్ ట్రేడింగ్ లాభం) ముందస్తు పన్ను అవసరం ఉంటుంది.
ఫ్రీలాన్సర్లు / స్వయం ఉపాధి పొందే వారు: సంవత్సరాంతం లాభం అంచనా వేసి, దానికి తగ్గట్టుగా పన్ను ముందుగానే చెల్లించాలి.
వ్యాపారవేత్తలు: ఆదాయం పెరుగుతుంటే సెక్షన్ 44AD కింద పన్ను లెక్కలతో ముందస్తు పన్ను చెల్లించాలి
సీనియర్ సిటిజన్లు: వ్యాపారం ద్వారా ఆదాయానికి కూడా తప్పకుండా ముందస్తు పన్ను చెల్లించాలి
ముందస్తు పన్నును నాలుగు విడతలుగా చెల్లించాలి
జూన్ 15 – మొత్తం పన్నులో కనీసం 15% చెల్లించాలి
సెప్టెంబర్ 15 – మొత్తం పన్నులో 45% వరకు
డిసెంబర్ 15 – మొత్తం పన్నులో 75%
మార్చి 15 – మొత్తం 100%
ముందస్తు పన్ను చెల్లించకపోతే ఏమవుతుంది?
మీరు ముందు చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోతే లేదా తక్కువ మొత్తంలో చెల్లిస్తే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234B & 234C ప్రకారం మీరు చెల్లించాల్సిన బకాయిపై 1% వడ్డీ ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది. చివరకు భారీగా వడ్డీ చెల్లించి, అనవసర భారం మోయాల్సి వస్తుంది. మీరు సంవత్సరాంతానికి సంపాదించే ఆదాయం ఎంత ఉంటుందనేది అంచనా వేసుకోవాలి. ఆ ఆదాయంపై వర్తించే పన్ను రేట్ల ప్రకారం మొత్తం పన్నును లెక్కించాలి. అందులో ఇప్పటికే TDS / TCS కట్టిన పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ముందస్తు పన్నుగా చెల్లించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 07:58 PM