Minister Dola Swamy: వెన్నుపోటు దినం కాదు.. వైసీపీకి తద్దినం..
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:24 AM
మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి వైసీపీ ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీకి తద్దినం పెట్టారని, పార్టీని మూసివేసుకోవాలని సూచించారు.
మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి
కొండపి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ సిగ్గులేకుండా వెన్నుపోటు దినం నిర్వహిస్తుందట. ప్రజలు ఆ పార్టీకి పాడెకట్టినరోజు కనుక వైసీపీ తద్దినం చేసుకోవడం మంచిది’ అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం కె.ఉప్పలపాడులో రేషన్ దుకాణాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నువ్వు, నీ పార్టీ వల్ల ఉపయోగంలేదని ప్రజ లు 11 స్థానాలకు కుందించారు. ఇప్పుడు ఆ పదకొండు కూడా ఎందుకు ఇచ్చామా..? అని బాధపడుతున్నారు’ అని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి స్వామి వ్యాఖ్యానించారు. ‘ప్రజల ఆస్తి పత్రాలపై నీ బొమ్మలు వేసుకుని.. అందరికీ అమ్మఒడి అని ఒక్కరికే ఇచ్చి.. పెంచిన పింఛన్ డబ్బులు విడతల వారీగా ఇవ్వడం వల్ల నీ పార్టీకి ప్రజలు తద్దినం పెట్టారు. కనుక వైసీపీ నాయకులు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఈ నెల 4న పిండ ప్రదానం చేసుకుని, పార్టీని మూసివేసుకోవడం మంచిది’ అని ఘాటుగా విమర్శించారు. పొగాకు రైతుల కోసం వస్తున్నానని చెప్పి.. ఆ తర్వాత వాతావరణం బాగాలేదని వాయిదా వేసుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. తన ప్రభుత్వంలో చేసిన నిర్వాకానికి రైతులు తిరగబడి తగిన బుద్ధి చెబుతారనే భయంతోనే వాయిదా వేసుకున్నారని విమర్శించారు.
Updated Date - Jun 02 , 2025 | 04:26 AM